సిటీబ్యూరో: హుస్సేన్ సాగర్ చుట్టూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో… బీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న ప్రణాళికలకు ప్రాధాన్యతనిచ్చింది. ఈ క్రమంలోనే ట్యాంక్ బండ్ చుట్టూతా నైట్ బజార్లను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించారు. నెక్లెస్ రోడ్డు నుంచి పీవీ ఘాట్ మార్గంలో వీటిని ఏర్పాటు చేసి, నగర వాసులకు నైట్ లైఫ్ షాపింగ్, సైట్ విజిటింగ్తోపాటుగా, పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలను రూపొందించింది.
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే పాత ప్రణాళికలను అటకెక్కించినట్లు వ్యవహరించడంతో కీలకమైన ప్రతిపాదనలను కూడా హెచ్ఎండీఏ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. నైట్ బజార్ ప్రాజెక్టును నీరుగార్చేలా వ్యవహరిస్తున్నది. హుస్సేన్ సాగర్ ఒడ్డునా రాత్రి సమయంలో విహరిస్తూ… ఆహ్లాదంగా షాపింగ్ అనుభూతిని పెంపొందేలా నిర్మించాల్సిన నైట్ బజార్ ప్రాజెక్టు నిర్వీర్యమైపోతున్నది. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో అధికారులు కూడా కీలకమైన ప్రాజెక్టులను చేపట్టలేకపోతున్నారు. నెక్లెస్ రోడ్ ఈవెంట్లకు వేదికగా నిలుస్తుండగా… నైట్ బజార్లతో ఆ ప్రాంతం రూపు రేఖలు మారిపోనున్నాయి. కానీ హెచ్ఎండీఏ యంత్రాంగం దృష్టి పెట్టడం లేదు.