సైదాబాద్, మార్చి 9 : 400 సంవత్సరాల చరిత్ర కలిగిన సైదాబాద్ హనుమాన్ దేవాలయ స్థల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. వివాదంలో ఉన్న స్థలమంతా హనుమాన్ ఆలయానిదేనని సోమవారం సుప్రీంకోర్టు సృష్టం చేయటంతో దేవాదాయశాఖకు, ప్రైవేట్ వ్యక్తుల మధ్య అనేక ఏళ్లుగా కొనసాగిన వివాదానికి తెర పడింది. గత నవంబర్‌లో ఖాళీ స్థలమంతా హనుమాన్ ఆలయానిదేనని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై, ప్రైవేట్ వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణలోనే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆలయంపై ప్రైవేట్ వ్యక్తులకు ఎటువంటి హక్కులేవంటూ, 2,700 చదరపు గజాల స్థలం ఆలయానికే చెందుతుందని న్యాయస్థానం తీర్పునిచ్చిందని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
ఆలయ స్థలంపై దేవాదాయశాఖకు, ప్రైవేట్ వ్యక్తుల మధ్య కోర్టుల్లో ఎలాంటి వివాదం పెండింగ్ లేకుండా రాజీ చేసుకోవడానికి చట్టం అనుమతించదని హైకోర్టు గతంలోనే తేల్చి చెప్పింది. ఆలయానికి చెందిన వెయ్యి చదరపు గజాల స్థలం ప్రైవేట్ వ్యక్తులతో రాజీ కుదుర్చుకోవాలంటూ హనుమాన్ ఆలయానికి అనుమతిస్తూ 1990లో మార్చి 31న దేవాదాయశాఖ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని పేర్కొంటూ, 16 ఏళ్ల్లనాటి పిటిషన్లో హైకోర్టు తీర్పు వెలువరించింది.
కమిషనర్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆలయ భక్తమండలి హైకోర్టులో 2006లో పిటిషన్ దాఖలు చేయగా, జస్టిస్ నగేశ్ భీమపాక ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ మొత్తం 2,700 చదరపు గజాలు ఆలయానికి చెందినదేనని కోర్టు తీర్పు వెలువరించింది. ప్రైవేట్ వ్యక్తులు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించి తమ వాదనలు వినిపించారు. అయితే సుప్రీం కోర్టు వారి వాదనలను తిరస్కరిస్తూ ఆలయ స్థలమంతా హనుమాన్ దేవాలయానికే చెందుతుందని కీలక తీర్పు చెప్పింది. దేశ అత్యన్నత న్యాయస్థానం తీర్పుతో భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తుస్తూ పార్టీలకు అతీతంగా సైదాబాద్‌లో కోర్టు తీర్పును స్వాగతిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

సుప్రీంకోర్టు తీర్పుతో… భక్తుల సంబురాలు…
సైదాబాద్ హనుమాన్ దేవాలయం పక్షాన దేశ అత్యున్నత న్యాయస్థానంలో తీర్పు వచ్చిన సందర్భంగా దేవాలయ భక్త కమిటీ అధ్యక్షుడు కొత్తకాపు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సైదాబాద్ ప్రధాన రహదారిపై టపాసులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేసి సంబురాలు జరుపుకున్నారు. హనుమాన్ ఆలయం తమదేనంటూ కొంతమంది వ్యక్తులు కుట్రలు చేసినా, సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చిందని, భక్తుల సహకారంతో ప్రాంతంలో అతి భవ్యమైన హనుమాన్ మందిరం నిర్మించుకుందామని నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ, వీహెచ్‌పీ నాయకులు గుర్రం జైపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిరజంన్ యాదవ్, మాజీ కార్పొరేటర్ సహదేవ్‌యాదవ్, కడారి రాంకుమార్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొరుడు భూమేశ్వర్, కావేటి ధర్మరాజు,కాటేకర్ మల్లేశ్, బొడిగే వెంకటేశ్, బస్తీ పెద్దలు అంజిరెడ్డి, యశ్వంత్ రెడ్డి, రంగారెడ్డి, రాజేశ్వర్‌రావు, శ్రీపతిరెడ్డి, నర్సింగ్‌రావు తెలిపారు.