Skin Grafting | చర్మం.. మనిషికి ఓ అందమైన తొడుగు. సున్నితంగానే కనిపించినా అత్యంత సురక్షితమైన కవచం. చలి నుంచి రక్షిస్తుంది, వర్షం నుంచి కాపాడుతుంది, హానికర సూక్ష్మజీవులను నిలువరిస్తుంది. చెమట రూపంలో వ్యర్థాలను బయటికి పంపుతుంది. ఒకటారెండా.. ఎన్నో బాధ్యతలు! కానీ, ఏ చిన్న ప్రమాదం జరిగినా తక్షణ ప్రభావం చర్మం మీదే పడుతుంది. కొన్నిసార్లు పూర్తిగా ఛిద్రమైపోతుంది. అలాంటి సమయాల్లో ‘స్కిన్గ్రాఫ్టింగ్’, ‘స్కిన్ ట్రాన్స్‌ప్లాంట్’ రోగికి కొత్త చర్మాన్నే కాదు, కొత్త జీవితాన్నీ ఇస్తాయి.
మనిషి రూపానికి ప్రతిరూపాన్ని సృష్టించగల నైపుణ్యం ప్లాస్టిక్ సర్జన్కే ఉంది. ‘రీకన్స్ట్రక్టివ్ కాస్మొటిక్ సర్జరీ’ చాలామందికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నది. బతుకు పట్ల కొత్త ఆశలు రేకెత్తిస్తున్నది. చాలా సందర్భాల్లో.. అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, విద్యుదాఘాతాల కారణంగా బాధితుల రూపం చెదిరిపోతుంది. చర్మం, కండ పూర్తిగా దెబ్బతినడం వల్ల ఎముకలు బయటికి తేలుతాయి. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలకే ప్రమాదం. మాంసపు ముద్దగా మారిన చర్మం స్థానంలో కొత్త తోలు అతికించాల్సిందే. ‘స్కిన్గ్రాఫ్టింగ్’ లేదా ‘స్కిన్ ట్రాన్స్‌ప్లాంట్’ చేయాల్సిందే. కొన్నిసార్లు ‘రీ కన్స్ట్రక్టివ్ ఫ్లాప్’ శస్త్రచికిత్సా అవసరం కావచ్చు.
చర్మం శరీరానికి రక్షణ కవచం. చర్మంలేని శరీరం అస్తి పంజరంతో సమానం. చర్మం లేకపోతే మనిషి బతకడం కష్టం. గాయాలు, రోడ్డు ప్రమాదాల సమయంలో చర్మం కాలిపోవడం వల్ల కావచ్చు, తీవ్రంగా దెబ్బతినడం వల్ల కావచ్చు శరీరంలోని నీరు, ఎలక్ట్రోలైట్స్ తదితర ఫ్లూయిడ్స్ బయటికి వచ్చేస్తాయి. శరీరం నుంచి 15 శాతానికి మించి ఫ్లూయిడ్స్ బయటికి వెళ్లిపోతే రోగి షాక్‌కు గురై అపస్మారక స్థితికి చేరుకుంటాడు. కొన్నిసార్లు మృతిచెందే ప్రమాదమూ ఉంది. ఏ కారణం వల్ల అయినా రోగికి 30 శాతానికి మించి కాలిన గాయాలుంటే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తప్పదు. అదే, ఏడాది లోపు పిల్లల్లో అయితే 5 శాతం కాలిన గాయాలైనా సరే తీవ్రంగా పరిగణించాల్సిందే. ఏడాది పైబడిన పిల్లలు, గర్భిణులు, వృద్ధుల్లో గాయాలు పది శాతానికి మించితే వెంటనే చికిత్స ప్రారంభించాలి. ఆయా అవయవాల ఆధారంగా కాలిన గాయాల శాతాన్ని లెక్కిస్తారు. శరీరాన్ని మొత్తం పదకొండు భాగాలుగా విభజిస్తారు నిపుణులు. అందులో ఒక్కో భాగాన్ని 9 శాతంగా పరిగణిస్తారు. తల, ముఖం కాలిపోతే 9 శాతం, ఛాతీ కాలిపోతే 9 శాతం, పొత్తికడుపు అయితే 9 శాతం ఇలా.. లెక్కలు ఉంటాయి. పదకొండు కీలక అవయవాలు కాలిపోయిన పరిస్థితి ఏర్పడితే.. రోగి శరీరం 99 శాతం కాలినట్లు పరిగణిస్తారు. జననేంద్రియాలు కాలితే 1శాతంగా లెక్కిస్తారు. నఖశిఖం ప్రభావితమైతే 100 శాతంగా నిర్ధారిస్తారు. 30 శాతానికి మించితే ప్రమాదపు అంచున ఉన్నట్టే.
శాతాల ఆధారంగా గాయాలను లెక్కించినట్టే, ఆ గాయం లోతు ఆధారంగా చికిత్సను నిర్ణయిస్తారు. ఈ బేరీజులో నిపుణుల అనుభవమే కీలకం. మనిషి శరీరంపై రెండు పొరలు ఉంటాయి. మొదటిది బాహ్యపొర. దీనినే వైద్యపరిభాషలో ‘ఎపిడర్మిస్’ అంటారు. రెండోది లోపలి పొర. దీన్నే ‘డెర్మిస్’ అంటారు. బాహ్యపొర (ఎపిడెర్మిస్)కాలిపోతే దానిని 1 డిగ్రీగా పరిగణిస్తారు. డెర్మిస్ పొర పాక్షికంగా కాలిపోతే 2 డిగ్రీలుగాను, పూర్తిగా కాలిపోతే 3 డిగ్రీలుగా ధ్రువీకరిస్తారు. ఒక డిగ్రీ వరకూ కాలిన వారికి మూడు రకాలుగా చికిత్స అందిస్తారు.
1.స్కిన్ సబ్స్టిట్యూట్స్ లేదా కొలాజిన్ .
2. స్పెషల్ మెడికేషన్ ఫోమ్ డ్రెస్సింగ్
3. ఆయింట్మెంట్స్ ద్వారా చికిత్స.
ఈ తరహా గాయాలకు గురైన రోగి రెండు వారాల్లో కోలుకునే అవకాశం ఉంది.
కాలిన గాయాలతో పాటు విద్యుదాఘాతం, యాసిడ్ దాడులు, యంత్రాల్లో చిక్కుకునో, రోడ్డు ప్రమాదాల్లో గాయపడో అవయవాలు నుజ్జునుజ్జు కావడం వల్ల 2-3 డిగ్రీల లోతు గాయాలు ఏర్పడే ఆస్కారం ఉంది. ఇలాంటి సందర్భాలలో రోగికి స్కిన్ ట్రాన్స్‌ప్లాంట్‌తో పాటు రీకన్స్ట్రక్టివ్ ఫ్లాప్ చేయాల్సి ఉంటుంది. కొందరికి స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తే సరిపోతుంది. గతంలో అయితే, ముందుగా కాలిన గాయాలకు పట్టీలు చుట్టేవారు. చర్మం ఊడిపోయి, ఎర్రటి పుండు వచ్చాకే స్కిన్ట్రాన్స్ప్లాంట్ చేసేవారు. ఈ పద్ధతిలో స్కిన్గ్రాఫ్టింగ్ చేసే లోపు ఇన్ఫెక్షన్కు గురై రోగి నరకం అనుభవించేవాడు, ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక పద్ధతుల వల్ల కాలిపోయిన చర్మాన్ని వెంటనే తొలగిస్తున్నారు. రోగి తొడ భాగం నుంచి కొంత చర్మాన్ని తీసేసి, అవసరమైన చోట ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. కొంత మందికి చర్మాన్ని తీసే పరిస్థితి కూడా ఉండదు. అలాంటి వారికి స్కిన్ బ్యాంక్ నుంచి సేకరించిన చర్మాన్ని ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. ఆ కొత్త చర్మం శరీరానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఫలితంగా, కాలిన గాయం త్వరగా మానుతుంది. రెండు వారాల తరువాత… తిరిగి రోగికి ఆటో స్కిన్ ట్రాన్స్‌ప్లాంట్ నిర్వహిస్తారు. అంటే, అతను లేదా ఆమె శరీరం నుంచి సేకరించిన చర్మాన్ని వేస్తారు. పూర్తి చికిత్సకు కనీసం రెండు నెలల సమయం పడుతుంది.
యాసిడ్ దాడులు, విద్యుత్ ప్రమాదాలకు గురైన వారికి, రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలైన వారికి.. కండ, నరాలు, రక్తనాళాలు దెబ్బతిని ఎముకలు బయటికి తేలి ఉంటాయి. అవయవ భాగాలు పూర్తిగా దెబ్బతిని, రూపం చెదిరిపోయి ఉంటుంది. అలాంటి రోగులకు తక్షణ వైద్యం అందిస్తూనే.. అపభ్రంశమైన భాగాలకు ఒక రూపం ఇచ్చేందుకు ఫ్లాప్ సర్జరీని ఆశ్రయిస్తారు. అంతే కాకుండా తెగిపోయిన నరాలు, రక్తనాళాలను తిరిగి అనుసంధానం చేసి, చేతులు, కాళ్లు వంటి అవయవాలకు ఒకప్పటి జవసత్వాలు అందిస్తారు. కొన్నిసార్లు రోగి ముక్కు, చెవి, పెదాలు, నాలుక, కనురెప్పలను కోల్పోతారు. అలాంటివారికి సైతం అవయవాల పునరుద్ధరణ సాధ్యమే.
కొన్నిసార్లు ప్రమాదాలు, దాడుల కారణంగా ముఖంలోని మాగ్జిల్లా, జైగోమా, మాండబుల్, ఆర్బిటల్ వంటి ఎముకలు విరిగిపోతాయి. దీని వల్ల కళ్లు, శ్వాస నాళం, దవడలు దెబ్బతినే ఆస్కారం ఉంది. దీంతో రోగి తినలేడు, శ్వాస తీసుకోలేడు. కంటి చూపునూ కోల్పోవచ్చు. ఇలాంటి సమయాల్లో ‘మినీ ప్లేట్ అండ్ స్క్రూస్’ టెక్నిక్ ద్వారా విరిగిపోయిన ఫేషియల్ బోన్స్‌ను జోడించి పాత రూపాన్ని పునరుద్ధరించవచ్చు.
ఆధునిక వైద్య విజ్ఞానం పుణ్యమాని.. ఫ్యాక్టరీ ప్రమాదాల్లో కాళ్లు, చేతులు, వేళ్లు తెగిపడిన వారికి తిరిగి అవయవాలను అతికించడమూ సాధ్యం అవుతున్నది. మైక్రోవాస్క్యులర్ సర్జరీ ద్వారా శరీరంలోని ఒక భాగం నుంచి రక్తనాళాలతో సహా ఎముక, చర్మం, కండను తరలించి, దెబ్బతిన్న అవయవాన్ని పునర్నిర్మించడం పెద్ద కష్టమేం కాదిప్పుడు.
రొమ్ములు పెద్దగా ఉన్న వారికి బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ ద్వారా, రొమ్ములు చిన్నగా ఉన్నవారికి ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అండ్ బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా సరిచేసి కొత్త రూపం ప్రసాదిస్తున్నారు. ఆధునిక వైద్య పరిశోధనలు, అత్యాధునిక యంత్రపరికరాలు ప్లాస్టిక్ సర్జరీని సులభతరం చేశాయి. చర్మ పునరుద్ధరణకు అనేక అవకాశాలు కల్పించాయి.
గ్రహణ మొర్రి, తొర్రి, కొండ నాలుక, చెవులు లేకుండా జన్మించడం, జన్మతః చేతి వేళ్లు అతుక్కుపోయి ఉండటం.. తదితర ప్రత్యేక సందర్భాల్లో శస్త్రచికిత్స ద్వారా ఆయా లోపాలను సరిచేస్తారు. అవయవాలను పునర్నిర్మిస్తారు. కంతులు తదితర సమస్యలతో అవయవాలు దెబ్బతిన్న వారికి సైతం ప్లాస్టిక్ సర్జరీద్వారా రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్స చేస్తారు. కొంతమంది ఆడ శిశువులు పోలండ్ సిండ్రోమ్ (ఒకవైపు రొమ్ము, ఛాతీ లేకుండా), వ్జైనల్ ఏజెనసిస్ (యోని లేకుండా)తో జన్మిస్తారు. ఇలాంటి లోపాలున్న వారికి యుక్త వయసులో శస్త్రచికిత్సలు జరిపి, కొత్త రూపాన్ని ఇస్తున్నారు. ముక్కు వంకర, చప్పిడి ముక్కు, డొప్ప చెవులు, ఎత్తుపళ్లు.. వంటి సమస్యలున్న వారికి కూడా కాస్మొటిక్ సర్జరీ ద్వారా కొత్త రూపును ఇవ్వడం సాధ్యమే. ఊబకాయ బాధితులకు లిపో సక్షన్, ఎబ్డామినో ప్లాస్టీ ద్వారా కొత్త ఆకృతిని ఇస్తారు.
– డాక్టర్ పలుకూరి లక్ష్మి, ప్రొఫెసర్ అండ్ హెచ్.ఒ.డి.
ప్లాస్టిక్ సర్జరీ విభాగం, ఉస్మానియా జనరల్ హాస్పిటల్/ఉస్మానియా మెడికల్ కాలేజ్
– మహేశ్వర్‌రావు బండారి
“అందంగా కనబడాలని ఏ క్రీమ్ పడితే అది వాడుతున్నారా.. ముందు ఈ సీక్రెట్స్ తెలుసుకోండి”
Naya Mall | దీంతో మసాజ్ చేస్తే ముడతలు తగ్గుతాయంట.. ధర ఎంతో తెలుసా!!”
ఈ టిప్స్ పాటిస్తే ఏజ్ పెరుగుతున్నా యవ్వనంగా కనిపిస్తారు..!!”
ఈ చలికాలంలో చర్మం పొడిబారుతుందా? ఈ చిట్కాలు పాటించండి”
ముఖంపై మడతలు వస్తున్నాయా? అయితే ఈ పండు తినండి”