రామంతాపూర్, సెప్టెంబర్ 26: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గిరిజన బాలబాలికల హాస్టల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రామంతాపూర్ పబ్లిక్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న విద్యార్థి అభినందన్‌కు ఎడమ కంటికి తీవ్ర గాయమైంది. ఆ విషయం హాస్టల్ వార్డెన్ కానీ, సిబ్బంది కానీ తమకు సమాచారం ఇవ్వలేదని వికారాబాద్ జిల్లా సాలాన్నితండాకు చెందిన విద్యార్థి తండ్రి భాస్కర్ నాయక్ ఆరోపించారు.
రెండు రోజుల కిందట బేగంపేట విద్యార్థి శ్రీవర్ధన్‌కు తీవ్ర గాయమైనప్పటికీ వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని తెలిపారు. హాస్టల్లో సరైన నిర్వహణ పనులు చేపట్టడంలేదని, విద్యార్థులు ఉంటున్న గదిలో దుర్వాసన వెదజల్లడంతోపాటు ఎలుకలు సంచరిస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ సర్వేశ్వర్‌రెడ్డి స్పందించి హెచ్‌పీఎస్ హాస్టళ్లను సందర్శించి కాంట్రాక్టర్ జగన్, హాస్టల్ వార్డెన్ యశోదలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.