శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Jun 24, 2020 , 00:24:41

పదిహేను రోజులకే పీరియడ్స్‌ వస్తుంటే?

పదిహేను రోజులకే పీరియడ్స్‌ వస్తుంటే?

నా వయసు 35 సంవత్సరాలు. ఆరేండ్ల క్రితం పాలీసిస్టిక్‌ ఓవరీ డిసీజ్‌ వచ్చింది. ఆరు నెలల పాటు మందులు వాడితే తగ్గిపోయింది. నాకు థైరాయిడ్‌ సమస్య కూడా ఉంది. ఇన్నాళ్లూ ఏ ఇబ్బందీ లేదు. ఇప్పుడు రెండు నెలలుగా నాకు పీరియడ్స్‌ సరిగా రావడం లేదు. అలాగని నొప్పి ఏమీ లేదు. బ్లీడింగ్‌ కూడా ఎక్కువగా లేదు. చాలా కొంచెం కొంచెంగా అవుతూ ఉంది. నా సమస్య ఏమిటి? ఎందుకు ఇలా జరుగుతున్నది. నేనిప్పుడు ఏం చేయాలి? తగిన సలహా ఇవ్వగలరు. 

- వి.ఆర్‌., చెన్నై

చాలామందిలో అండోత్పత్తి సమయంలో కొద్దిగానే బ్లీడింగ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎటువంటి సమస్య లేదు. మీకు పదిహేను రోజులకే పీరియడ్‌ వచ్చిందంటున్నారు. అది కూడా చాలా కొద్దిగానే ఉందంటున్నారు. కాబట్టి ఇది అండోత్పత్తి సమయంలో జరిగే రక్తస్రావమే అయ్యేందుకు ఆస్కారం ఉంది. దీని వెనుక వేరే కారణాలు ఉండే అవకాశం లేకపోలేదు. మీకు ఇంతకు ముందు పాలీసిస్టిక్‌ ఓవరీ ఉందని చెప్పారు. కొందరిలో చికిత్స తరువాత కొన్నేండ్లకు అది మళ్లీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఉందో లేదో తెలుసుకోవాలంటే మీరు పొట్ట, పెల్విక్‌ అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేయించుకోవాలి. థైరాయిడ్‌ సమస్య వల్ల కూడా ఇలా జరగొచ్చు. కాబట్టి మీరు థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోండి. మీరొకవేళ అధిక బరువు ఉన్నట్టయితే అది కూడా ఇలాంటి సమస్యలకు కారణం కావొచ్చు. వ్యక్తిగత సమస్యల వల్ల కలిగే ఒత్తిడి కూడా హార్మోన్లలో తేడాలకు దోహదపడుతుంది. ఇలాంటప్పుడు మందులు వాడుకుంటే హార్మోన్లు నార్మల్‌ స్థితికి వచ్చేస్తాయి. థైరాయిడ్‌ నార్మల్‌ లేకపోయినా దాని మందుల డోసేజి మార్చి ఇస్తారు. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌లో పీసీవోడీ ఉన్నట్టు తేలితే దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. ముందుగా నేను చెప్పిన పరీక్షలన్నీ... అంటే థైరాయిడ్‌, పెల్విక్‌ అల్ట్రాసౌండ్‌ పరీక్షలు చేయించుకోండి. అవి నార్మల్‌గా ఉంటే సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో రెండు మూడు నెలలు కూడా ఇదే విధంగా అవుతున్నట్టయితే మాత్రం డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది.


logo