Parliament Session | ఎన్నికలు, ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా సమస్యల నుంచి దృష్ఠి మళ్లించేందుకే కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నది. జమిలి ఎన్నికల చర్చ పేరుతో రాజకీయ లబ్ధి, ఎన్నికల కమిషనర్ల నియామకంలో అస్మదీయుల నియామకానికి చట్ట సవరణ చేయాలని చూస్తున్నది. ఇవి తప్ప75వ స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ కనీసం ఈ ఒక్క సమావేశాల్లోనైనా రాజ్యాంగ రూపకర్తల ఆశయం మేరకు పనిచేయాలన్న సోయి ఏమాత్రం కేంద్రానికి ఉన్నట్టు కనిపించడం లేదు.
ప్రస్తుతం దేశం ఎన్నో కీలక సమస్యలను ఎదుర్కొంటున్నది. నిత్యావసర ధరల పెరుగుదలకు కారణమైన ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం, రికార్డుస్థాయిలో పెరిగిన దేశం అప్పులు ఉండనే ఉన్నాయి. హైవేల నిర్మాణంలో తప్ప ఎక్కడా కానరాని అభివృద్ధి, చట్ట సభల్లో మహిళలకు, బలహీన వర్గాలకు 33 శాతం రిజర్వేషన్ల ఊసే లేదు. 2014లో ఇచ్చిన ఒక్కొక్కరి ఖాతాల్లో 15లక్షలు జమ దగ్గర నుంచి మిగిలిన ఎన్నో హామీలను అటకెక్కించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరవాల్సిన అవసరం ఉన్నది. 143 కోట్ల మంది జనాభా ప్రభుత్వం నుంచి ఆశించేది కనీస అవసరాలైన కూడు, గుడ్డ, నీడ, ఉపాధితో పాటు మౌలిక సదుపాయాలు.
కానీ వాటి కల్పనలో ఆసాంతం నిర్లక్ష్యం కనిపిస్తున్నది. 2014లో చమురు బారెల్ ధర 109 డాలర్లు ఉన్నప్పుడు లీటర్ డీజిల్ రూ.62 , పెట్రోల్ రూ.72 ఉన్నది. గత పదేండ్లలో చమురు ధరలు 50 డాలర్లకు తగ్గినా లక్షల కోట్లు కేంద్రం ఖాతాలో వేసుకున్నదే కానీ వాటి ధరలు తగ్గించలేదు. ఫలితంగా నేడు 87 డాలర్లకు బారెల్ తగ్గితే లీటరు పెట్రోల్ ధర రూ.110, డీజిల్ రూ.100లకు పెరి గింది. అలాగే కిలో రూ. 27 ఉన్న బియ్యాన్ని రూ.58కు, రూ.83 ఉన్న కందిపప్పు రూ.173 కు, రూ.49 ఉన్న శనగపప్పు రూ.116, రూ.60 చింతపండును రూ.168లకు పెంచింది. అలాగే వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.415 నుం చి రూ.1150లకు పెంచి ఎన్నికలు సమీపిస్తున్నందున కంటి తుడుపు చర్యగా రూ.200 తగ్గించి ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నది.
నిరుద్యోగం, ద్రవ్యోల్బ ణ పెరుగుదల రేటు గురించి చెప్పనవసరం లేదు. భారతదేశ అప్పులు 65 ఏండ్లలో రూ.58 లక్షల కోట్లు ఉంటే, మోదీ ప్రభుత్వం తొమ్మిదేండ్లలోనే 90 లక్షల కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించింది. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, అన్ని రంగాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నది.
మోదీతోపాటు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ దేశంలోని ఎన్నో రాష్ర్టాల కంటే సాగు విస్తీర్ణం పెంపుదలకు వీలుగా వ్యవసాయ రంగం రూపురేఖలు మార్చారు. దానికోసం తెలంగాణకు కేటాయించిన కృష్ణ, గోదావరి జలాల పూర్తి వినియోగానికి వీలుగా అసంపూర్తిగా ఉన్న వరద కాలువలు పూర్తి చేసి కొత్తగా కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టును నిర్మించారు. తాజాగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. సీఎం కేసీఆర్ రూ.1.59 లక్షల కోట్లు నీటి ప్రాజెక్టులపై ఖర్చు చేయగా మిషన్ కాకతీయ కింద రూ.కోట్లతో పురాతన గొలుసుకట్టు చెరువులను పునరుద్ధ్దరించారు. ఇక్కడితో ఆగకుండా 3.10 లక్షలమంది రైతులకు సబ్సిడీ కింద రూ.2186 కోట్లు ఇచ్చి సూక్ష్మసేద్యా న్ని ప్రోత్సహించారు. నిరంతర విద్యుత్తు సరాఫరాతో వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య 27.49 లక్షలకు చేరుకున్నది. రుణమాఫీ కింద రూ.17,351 కోట్లు, రైతుబంధు కింద 11 విడుతల్లో రూ.70,414 కోట్లు అందజేసి రైతాంగం హృదయాల్లో కేసీఆర్ గూడు కట్టుకున్నారు. 2014-15లో 68 లక్షల టన్నులు ఉన్న ధాన్యం ఉత్పత్తి 2023 నాటికి దాదాపు 2.70 కోట్ల టన్నులకు చేరుకున్నది. దళిత బంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు, పింఛన్ల పెంపుదల ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి.
తెలంగాణలో 2014 నాటికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కేవలం 850 సీట్లు ఉండగా నేడు 21 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి 10వేల సీట్ల దిశగా పయనిస్తున్నది. దేశం మొత్తం మీద కేవలం 157 ప్రభుత్వ వైద్య కళాశాలలను మాత్రమే మంజూరు చేసిన కేంద్రం తెలంగాణకు ఒక్క కళాశాల కూడా కేటాయించలేదు. అయినా వేల కోట్లు వెచ్చించి ప్రాథమిక దవాఖాన నుంచి సూపర్ స్పెషాలిటీ దాక ఎన్నో దవాఖానలను నిర్మిస్తున్న ఘనత కేసీఆర్‌ది. తెలంగాణలో ఐటీ పరిశ్రమ వృద్ధిరేటు గణనీయంగా పెరిగింది. నేడు ఐటీ ఉద్యోగుల సంఖ్య 9,05,715 కాగా 2026 నాటికి 10 లక్షలకు పైగా చేరుకొని రూ.3 లక్షల కోట్ల ఎగుమతులు సాధించే సానుకూల ధోరణి కనబడుతున్నది.
కేంద్ర సహకారం లేకున్నా ఎన్నో ఆంక్షలను అధిగమించి కొత్త రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తెలంగాణను దేశానికి రోల్ మాడల్‌గా అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణలో ఇంత అభివృద్ధి, సంక్షేమం చేసినపుడు కేంద్రం ఎందుకు చేయలేదు? కేవలం మతోన్మాద రాజకీయాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు, దేశంలోని మీడియాను గుప్పిట్లో పెట్టుకొని పబ్బం గడుపుతున్నది. చైనా మన అరుణాచలంలో భూభాగాన్ని ఆక్రమిస్తుందన్న వార్తలపై కూడా దీటుగా జవాబు చెప్పలేని స్థితిలో మోదీ ఉన్నారు. అలాంటపుడు జీ 20 సదస్సులు పెట్టుకొని ఏం ప్రయోజనం?
రానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగం, విదేశాంగ విధానం, వైద్య, విద్య రంగా ల్లో సామాన్యులకు మేలు జరిగే ప్రణాళికలపై చర్చ జరగాలి. అలాగే లక్షల కోట్ల మేర బ్యాంకులను దివాళాతీయిస్తూ దేశం విడిచి వెళ్తున్న బడాబాబులు నుంచి ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టేలా చట్ట సవరణలు, పబ్లిక్ రంగ సంస్థల అమ్మకాల నిలుపుదలపై చర్చించాలి.
అలాగే బీఆర్ఎస్ పార్టీ తరుపున ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు కేంద్రాన్ని లేఖ ద్వారా కోరిన విధంగా ఈ క్రింది అంశాలను కూడా ఎజెండాలో చేర్చవలసి ఉన్నది. పార్లమెంటు, అసెంబ్లీ చట్టసభల్లో 33 శాతం ఓబీసీలకు, 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు అమలయ్యేలా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసింది . రాజ్యాంగ రచన సమయంలో విస్మరించిన కొన్ని అంశాలను సరిదిద్దుకోవడానికి నాటి మేధావులు దార్శనికతతో అవకాశం కల్పించారు. దీన్ని వాడుకుని చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది.