తిరుపతి: తిరుమల పరకామణి చోరీ కేసులో (Parakamani Theft Case) వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy)కి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 4గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నారు. తిరుమల (Tirumala) శ్రీవారి పరకామణిలో 920 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ 2023 ఏప్రిల్ 7న పట్టుబడ్డారు. అప్పటి టీటీడీ విజిలెన్స్ ఎస్ఐ సతీశ్ కుమార్ ఫిర్యాదుతో తిరుమల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అదే ఏడాది మే 30న రవికుమార్‌పై విజిలెన్స అధికారులు చార్జ్‌షీట్ ఫైల్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఆదేశాలతో సీఐడీ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. డిసెంబర్ 2వ తేదీలోగా నివేదిక ఇవ్వాల్సి ఉన్నది.
కేసు నుంచి తప్పిస్తే తన ఆస్తులు టీటీడీకి ఇస్తానని రవికుమార్ ప్రతిపాదనతో అతని ఆస్తులపై వైసీపీ నాయకులు కన్నేసారని ఆరోపణలు ఉన్నాయి. 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్‌లో కేసును వైసీపీ నాయకులు రాజీ చేయించి రవికి చెందిన కొన్ని ఆస్తులు విరాళంగా తీసుకుంటున్నట్లు టీటీడీ బోర్టు తీర్మానించి పరాకమణి కేసును పక్కకుపెట్టింది. అయితే ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరకామణి వ్యవహారం మరోసారి వెలికితీసింది. దీంతో సీఐడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. అయితే దీంట్లో భాగంగా మాజీ ఏవీఎస్వో సతీష్ అనుమానస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే.