Russian oil : రష్యా నుంచి తాము చమురు కొనేందుకు ఏ దేశం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని భారత్ స్పష్టం చేసింది. ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన చేసింది. ఇటీవల అమెరికాతో ఇండియాకు ట్రేడ్ డీల్ కుదిరిన నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేయాలని అమెరికా చెప్పిందని, దీనికి ఇండియా కూడా అంగీకరించిందని ప్రచారం జరిగింది. ఇదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గినట్లు పలు నివేదికలు తెలిపాయి.
ప్రస్తుతం ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇండియాకు హోర్ముజ్ జలసంధి నుంచి చమురు సరఫరా ఆగిపోయింది. దీంతో మన అవసరాల కోసం నెల రోజులపాటు రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు పర్మిషన్ ఇచ్చామని అమెరికా ప్రకటించింది. కాగా.. మన దేశం చమురు కొనేందుకు అమెరికా అనుమతి కావాలా అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ విషయంలో కేంద్ర వైఖరిని తప్పుబడుతున్నాయి. కానీ, దీనిపై కేంద్రం స్పందించింది. ఆయిల్ కొనేందుకు ఇండియాకు ఎవరి అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాలే ముఖ్యమని, ఎవరు తక్కువ ధరకు చమురు అమ్మితే వారి నుంచి కొనుగోలు చేస్తామని తెలిపింది. దీనిపై కేంద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రకటన ప్రకారం.. ఇండియా ఆయిల్ కోసం ఏ ఒక్క దేశంపైనో, మార్గంపైనే ఆధారపడట్లేదు. 27-40 దేశాల నుంచి ఆయిల్ కొంటోంది.
రష్యా నుంచి ఫిబ్రవరిలో కూడా ఆయిల్ దిగుమతి చేసుకుంది. ఇప్పటికీ ఇండియాకు రష్యా అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, యురోపియన్ యూనియన్ అభ్యంతరాలున్నప్పటికీ మూడేళ్లుగా రష్యా నుంచి ఇండియా చమురు దిగుమతి చేసుకుంటూనే ఉంది. ఇండియాకు తగ్గింపు ధరలకే రష్యా ఆయిల్ అందిస్తుండటంతో, దేశంలో డిమాండ్‌కు తగ్గట్లు ఆయిల్ కొంటుంది. రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు అమెరికా పర్మిషన్ ఇచ్చినట్లు చెప్పుకొంటున్నప్పటికీ.. దీంతో సంబంధం లేకుండా ఇప్పటికీ రష్యా ఆయిల్‌ను ఇండియా తీసుకుంటోంది. ప్రస్తుత సంక్షోభం ఉన్నప్పటికీ ఇండియా వద్ద 250 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ ఉంది. ఇదంతా కలిపి ఏడు నుంచి ఎనిమిది వారాలపాటు దేశీయ అవసరాలకు సరిపోతుంది.
ఇండియా సంవత్సరానికి 258 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురును శుద్ధి చేయగల సామర్ధ్యం కలిగి ఉంది. ఇది ప్రస్తుత దేశీయ అవసరాలకంటే ఎక్కువే. మరోవైపు ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. శుక్రవారం నాటికి 8.5 శాతం ధరలు పెరిగినట్లు అంచనా. ఈ యుద్ధం ఇంకా ఇలాగే కొనసాగితే ధరలు ఇంకా పెరగొచ్చు. ఇండియాలోనూ ధరల పెరుగుదల ఉండొచ్చు. అయితే, ప్రస్తుతానికి మనకొచ్చిన ఇబ్బందేమీ లేదని నిపుణులు అంటున్నారు.