Dharmendra | బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర ఇక లేరనే వార్త భారతీయ సినీ ప్రపంచాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది. 89 ఏళ్ల వయసులో నవంబర్ 24న ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా శ్వాస సమస్యలతో బాధపడుతూ 12 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందినా కూడా పరిస్థితి విషమించడంతో డిశ్చార్జ్ అయ్యి తనయుడు బాబీ డియోల్ ఇంటికి వెళ్లారు. అక్కడే ఆయన ప్రాణం విడిచారు. ధర్మేంద్ర ఇక లేరనే వార్త వినగానే హిందీ చిత్రసీమ అంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది.
ఈ నేపథ్యంలో ధర్మేంద్ర నటించిన చివరి సినిమా ఏంటనే చర్చ నడుస్తుంది. ధర్మేంద్ర చివరిగా ‘ఇక్కిస్’ అనే చిత్రంలో నటించగా, ఈ మూవీకు సంబంధించిన పోస్టర్ సోమవారం (నవంబర్ 24) విడుదల కాగా, అది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. లెజెండరీ నటుడు ఇక లేరన్న సంగతి తెలిసిన అభిమానులు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూసి మరింత ఎమోషనల్ అవుతున్నారు. సినిమా యూనిట్ పోస్టర్‌తో పాటు భావోద్వేగ భరితమైన సందేశాన్ని కూడా పోస్టు చేసింది.తండ్రులు కుమారులను పెంచుతారు… కానీ గొప్ప వ్యక్తులు దేశాన్ని నిర్మిస్తారు. “ధర్మేంద్ర గారు మా సినిమాలో అమర సైనికుడికి తండ్రిగా శక్తివంతమైన పాత్ర పోషించారు.” సినిమా 2025 డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ప్రకటించారు.
‘ఇక్కిస్’లో ధర్మేంద్ర బ్రిగేడియర్ ఎం.ఎల్. ఖేత్రపాల్ పాత్రలో కనిపించనున్నారు.సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్కు తండ్రిగా ఆయన చేసిన పాత్ర ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా ఉంటుంది.పోస్టర్లో ధర్మేంద్ర తన కుమారుడి త్యాగాన్ని స్మరించుకుంటూ,ఇది నా పెద్ద కొడుకు అరుణ్… ఇది ఎల్లప్పుడూ అతనిదే అని భావోద్వేగంతో చెప్పడం చూడొచ్చు. ఈ సినిమాలో అమర వీరుడు అరుణ్ ఖేత్రపాల్ పాత్రను అమితాబ్ బచ్చన్ మనవడు ఆగస్త్య నందా పోషిస్తున్నాడు.1971 భారత్-పాక్ యుద్ధంలో అతడు ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలకు గాను మరణానంతరం పరమవీర చక్ర పురస్కారం లభించింది. ‘ఇక్కిస్’ ధర్మేంద్ర చివరి సినిమా కావడంతో, అది ఆయన అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారింది. అభిమానులు సోషల్ మీడియాలో భావోద్వేగపూరిత పోస్టులతో ఆయనను స్మరించుకుంటూ, చివరి చిత్రం విడుదలకై ఆతృతగా ఎదురుచూస్తున్నారు.