అసెంబ్లీలో హౌస్ కమిటీలు ఎక్కడ?
తెలంగాణ రాష్ర్టాన్ని మనం కొట్లాడి సాధించుకున్నది కేవలం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కాదు. మనకంటూ ఒక ఆదర్శవంతమైన పాలన ఉండాలని. ప్రజాస్వామ్య దేవాలయమైన శాసనసభలో ప్రజల గొంతుక బలంగా వినపడాలని.
తెలంగాణ రాష్ర్టాన్ని మనం కొట్లాడి సాధించుకున్నది కేవలం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కాదు. మనకంటూ ఒక ఆదర్శవంతమైన పాలన ఉండాలని. ప్రజాస్వామ్య దేవాలయమైన శాసనసభలో ప్రజల గొంతుక బలంగా వినపడాలని. కానీ, ప్రస్తుత అసెంబ్లీ నిర్వహణను గమనిస్తే.. ‘అంగట్లో అన్నీ ఉన్నా
అల్లుడి నోట్లో శని ఉన్నది’ అనే సామెత గుర్తుకొస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేండ్లు గడిచిపోయాయి. అంటే ఐదేండ్లపాలనలో సగంకాలం ముగిసింది. అయినా అసెంబ్లీని నిర్వహించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విస్మయానికి కలిగిస్తున్నది. శాసనసభ అంటే చట్టాలు చేసేందుకు, ప్రభుత్వ పనితీరును నిరంతరం సమీక్షించే వేదిక. ప్రజల ప్రస్తుత అవసరాలు, సంక్షేమానికి తగ్గట్టు ఉన్న చట్టాలను మెరుగుపర్చడం, కొత్త చట్టాలను తీసుకురావడం, ప్రభుత్వ పనితీరును సమీక్షించుకునేందుకు లోపాలను సరిదిద్దుకునేందుకు ప్రతిపక్షాల సలహాలను స్వీకరించేందుకు కూడా శాసనసభా సమావేశాలు ఉపయోగపడతాయి. అవి సాధించేందుకు ఉన్నవే హౌస్ కమిటీలు. ఇందుకోసం 16 హౌస్ కమిటీలు ఉండాలి. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ), పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ (పీయూసీ), అంచనాల కమిటీ మాత్రమే వేసింది. సాధారంగా పీఏసీలో విపక్ష నేత చైర్మన్గా ఉంటారు. లేదా ప్రధాన ప్రతిపక్ష నేత సూచించిన వ్యక్తి చైర్మన్గా ఉంటారు. కానీ, బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువా కంపుకున్న ఆరికెపూడి గాంధీని పాలక పెద్దలు పీఏసీ చైర్మన్గా నియమించారు. ఈ మూడు కమిటీలు కూడా ఒకటి రెండుసార్లు మాత్రమే సమావేశమయ్యాయి. ఆ తర్వాత వాటి ఊసే లేకుండా పోయింది. ఏటా ఆయా కమిటీలను నియమించాలి లేదా నియమించిన కమిటీలను రెన్యూవల్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ, రెండున్నరేండ్లయినా వాటి ప్రస్తావన లేకుండా పోయింది.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నుంచి అంచనాల కమిటీ వరకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ కమిటీల వరకు ఇవన్నీ ప్రభుత్వానికి మార్గదర్శకాలుగా ఉండాలి. కానీ, విచిత్రమేమిటంటే ఇప్పటివరకు ఒక కమిటీని కూడా వేయలేదు. కమిటీలు లేకపోవడం అంటే ప్రభుత్వ జవాబుదారీతనాన్ని గాలికొదిలేయడమే. ‘కంచే చేను మేసినట్టు’ పర్యవేక్షణే లేకపోతే పాలనలో పారదర్శకత ఎకడి నుంచి వస్తుంది? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ లేకపోతే ప్రజాధనం ఖర్చును ఆడిట్ చేసేదెవరు? అయితే, ప్రభుత్వానికి సభలో కీలకమైన పదవుల భర్తీపై అస్సలు ధ్యాస లేదు. ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్ లేరు. సభలో సభ్యులను సమన్వయపరచాల్సిన చీఫ్ విప్ లేరు. సభలో ఆ బాధ్యత ఎవరిదో తెలియదు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నో ఆశలతో అసెంబ్లీకి వచ్చారు. వారిని హౌస్ కమిటీల్లో నియమిస్తే బాధ్యతలు తెలిసివస్తాయి. కానీ, కమిటీలు లేక, వారికి పదవులు లేక సగం కాలం ఎలాంటి బాధ్యతలు లేకుండానే ముగిసిపోయింది. ఇప్పుడు వారి పరిస్థితి ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టుగా తయారైంది. వారి నియోజకవర్గ సమస్యలను సభా వేదికల ద్వారా పరిషరించే అవకాశం లేకుండా పోతున్నది.
శాసనసభలో ఉండే 16 హౌస్ కమిటీలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాల వంటివి. అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో కూడా ప్రభుత్వం చేసే ఖర్చులు, ఇచ్చే హామీలు, పథకాల అమలును ఈ కమిటీలు నిశితంగా పరిశీలిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక కమిటీలు, ఇతర స్టాండింగ్ కమిటీలు, సభ నిర్వహణ కమిటీలు కీలకపాత్ర పోషిస్తాయి. ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా ఇవి కాపలా కాస్తాయి. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఈ కమిటీలు ఉన్నతంగా పనిచేశాయి. ప్రభుత్వ ఖాతాల కమిటీ కాగ్ నివేదికలను పరిశీలిస్తుంది. ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి రూపాయి సరైన పద్ధతిలో ఖర్చయిందో లేదో తనిఖీ చేస్తుంది. దీనికి సాధారణంగా విపక్ష నేత చైర్మన్గా ఉంటారు. అంచనాల కమిటీ బడ్జెట్ అంచనాలను పరిశీలించి, పరిపాలనలో పొదుపును, సమర్థతను ఎలా పెంచాలో సూచిస్తుంది. ఇతర కమిటీలు కూడా శాసనసభ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి. సభ ఏ రోజు ఏ అంశంపై చర్చించాలో స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయిస్తుంది. శాసనసభ కేవలం సంవత్సరానికి కొన్ని రోజులు హడావుడి చేసి మూతపడే భవనంలా మారిపోతున్నది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనైనా హౌస్ కమిటీలు అంటే కీలకంగా పని చేశాయి. గతంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి విపక్ష నేత చైర్మన్గా ఉండేవారు. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఆధారంగా కోట్లాది రూపాయల నిధుల మళ్లింపును ఈ కమిటీ ప్రశ్నించే అవకాశం ఉండేది. కమిటీ ముందు హాజరవ్వాలంటే అధికారులు వణికిపోయేవారు. ప్రస్తుతం పీఏసీని కూడా రెన్యూవల్ చేయలేదు. దీంతో ప్రభుత్వ ఖర్చులపై ఆడిట్ చేసే నాథులే కరువయ్యారు. గతంలో అసెంబ్లీలో ఒక మంత్రి ఏదైనా హామీ ఇచ్చారంటే, దానిని అస్యూరెన్స్ కమిటీ రికార్డు చేసేది. ఆ హామీ ఏ దశలో ఉన్నదో 3 నెలలకోసారి రిపోర్ట్ అడిగేది.
ప్రస్తుతం హామీల కమిటీ లేకపోవడంతో సభలో మంత్రులు ఇచ్చే మాటలు నీటి మీద రాతలుగా మిగిలిపోతున్నాయి. రైతు రుణమాఫీ నుంచి నిరుద్యోగ భృతి వరకు ఏ హామీ ఎంతవరకు నెరవేరిందో అడిగే రాజ్యాంగబద్ధమైన వేదిక లేదు. గతంలో సంక్షేమ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి హాస్టళ్ల పరిస్థితిని, నిధుల వినియోగాన్ని పరిశీలించేవి. ప్రభుత్వానికి కీలక సూచనలు చేసేవి. ప్రస్తుతం ఈ కమిటీల నియామకం జరగకపోవడంతో అట్టడుగు వర్గాల నిధులు ఏ పథకాలకు మళ్లుతున్నాయో, గ్రౌండింగ్ ఎందుకు కావడం లేదో విశ్లేషించే వారే లేరు. గతంలో అసెంబ్లీ లైబ్రరీ కమిటీ సూచనల మేరకు అరుదైన పుస్తకాలు, డాక్యుమెంటరీలను భద్రపరిచేవారు. ఎమ్మెల్యేలకు కావాల్సిన రిఫరెన్స్ డేటా అకడే దొరికేది. ప్రస్తుతం కమిటీ లేకపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తమైంది. తక్షణమే 16 హౌస్ కమిటీలను నియమించాలి. ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేసి ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించాలి. లేదంటే ప్రజలు తమ ఓటు ద్వారా ఇచ్చిన అధికారాన్ని అవమానించినట్లే అవుతుంది. సభ గౌరవం గాలిలో దీపం కాకూడదు.
– లట్టుపల్లి విక్రమ్
97015 87979
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

