IPL 2026 Records : రెండు నెలలకుపైగా వేసవి వినోదాన్ని పంచిన ఐపీఎల్ 19వ సీజన్ ముగిసింది. వరసగా రెండో ట్రోఫీతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) రికార్డు నెలకొల్పగా.. విధ్వంసక ఆటతో మరిపించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఏకంగా ఐదు అవార్డులు తన్నుకుపోయాడు. ఉత్కంఠ పోరాటాలు, భారీ ఛేదనలతో రంజుగా సాగిన పంతొమ్మిదో సీజన్‌ను ఓసారి అంకెల్లో గమనిస్తే ఎన్నో ఆసక్తికర, అబ్బురపరిచే విషయాలు, రికార్డులున్నాయి. అవేంటంటే..
పొట్టి క్రికెట్‌కు ఎనలేని క్రేజ్ తెచ్చిన ఐపీఎల్ సీజన్ సీజన్‌కు రికార్డులు సృష్టిస్తూనే ఉంది. 19వ సీజన్లో వైభవ్ సూర్యవంశీ ఆట, ముంబై ఇండియన్స్ ఘోర ప్రదర్శన వంటివి చర్చనీయాంశంగా మారాయి. కెప్టెన్లుగా విఫలమైన హార్దిక్ పాండ్యా(Hardik Pandya), రిషభ్ పంత్ నెట్టింట వైరలవ్వగా.. అరంగేట్రంలోనే అదరగొట్టిన పేసర్లు షకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగేలు సన్‌రైజర్స్‌కు మేమున్నామని భవిష్యత్ భరోసానిచ్చారు. ఇలా చెబుతూ పోతే.. పలు అంశాలున్నాయి.

చిన్నవయసులోనే.. ఒకే సీజన్లో ఐదు అవార్డులు అందుకున్న తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. 19వ సీజన్ ఊచకోతను తలపించే ఇన్నింగ్స్‌లు, కళ్లు చెదిరే సిక్సర్లు బాదిన వైభవ్.. అత్యంత విలువైన ఆటగాడు, వర్ధమాన క్రికెటర్, ఆరెంజ్ క్యాప్ విజేత, సూపర్ సిక్సర్లు, సూపర్ స్ట్రయికర్ అవార్డులు సాధించాడు. ఈ అవార్డులు గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా 15 ఏళ్ల వైభవ్ రికార్డు నెలకొల్పాడు.

115 బంతులు.. ప్రతి సీజన్లో వికెట్ల వేటతో ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలకమయ్యే బుమ్రా(Bumrah) ఈసారి తేలిపోయాడు. పంతొమ్మిదో సీజన్లో తొలి వికెట్ కోసం యార్కర్ కింగ్ 115 బంతులు తీసుకున్నాడు. ఐపీఎల్లో విజయవంతమైన బౌలర్‌గా పేరొందిన బుమ్రా.. దురదృష్టవశాత్తూ 19వ సీజన్లో నాలుగు వికెట్లే తీశాడు.

ఐపీఎల్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రఫుల్ హింగే (Praful Hinge) రికార్డు నెలకొల్పాడు. ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌పై నిప్పులు చెరిగిన ప్రఫుల్ మొదటి ఓవర్లోనే వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, ప్రిటోరియస్‌లను వెనక్కి పంపాడు. అతడి విజృంభణతో సన్‌రైజర్స్ 57 పరుగులతో జయభేరి మోగించింది.
14 సీజన్ల తర్వాత .. ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) ప్రతి సీజన్ ఆరంభంలో తడబడడం తెలిసిందే. అయితే.. 14 ఏళ్ల తర్వాత ముంబై మొదటి మ్యాచ్‌లో గెలిచింది. కానీ, సారథిగా హార్దిక్ పాండ్యా తేలిపోవడం, సీనియర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, పేసర్ బుమ్రా వైఫల్యంతో ఆ జట్టును ముంచాయి. దాంతో, ముంబై ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది.

986 పరుగులు.. పంతొమ్మిదో సీజన్ ఒకే రోజు 986 పరుగులు నమోదయ్యాయి. ఏప్రిల్ 25న కేఎల్ రాహుల్ అజేయ శతకంతో ఢిల్లీ క్యాపిటల్స్ 264 రన్స్ కొట్టగా.. పంజాబ్ కింగ్స్ ఆ రికార్డు లక్ష్యాన్ని ఉఫ్‌మనిపించింది. అదేరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్.. 229 రన్స్‌ను ఛేదించి రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. దాంతో.. ఐపీఎల్ చరిత్రలో ఒకేరోజు 900లకు పైగా రన్స్ రికార్డయ్యాయి.
ఆరెంజ్ క్యాప్.. అత్యధిక పరుగుల వీరులకు లభించే ఆరెంజ్ క్యాప్ ఈసారి ఒకరిద్దరిపై కాదు ఏకంగా 15 మంది తలపై వాలింది. 2018లో పన్నెండ్ మంది ఆరెంజ్ క్యాప్‌ను ధరించారు. కానీ, ఒక్క ఆటగాడు కూడా వారం పాటు కూడా ఈ క్యాప్‌ను తమ వద్ద ఉంచుకోలేదు. చివరకు ఒక సెంచరీ, మూడు అర్ధ శతకాలు బాది.. 776 రన్స్‌తో వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు.
Sai Sudharsan’s insane form ends in the most unfortunate way possible.
14(9) with 3 boundaries and the bat just betrays him
Streak of five 50+ scores snapped like that. Cricket is cruel sometimes! #TATAIPL #RCBvGT— CricketPulse (@Saadkayani24599) May 26, 2026
హిట్ వికెట్టైన సుదర్శన్.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్(Sai Sudarshan) అనూహ్యంగా రెండుసార్లు హిట్ వికెటైన తొలి ఆటగాడిగా నిలిచాడు. క్వాలిఫయర్ 1లో ఆర్సీబీతో మ్యాచ్‌లో బ్యాట్‌ను వికెట్లపై పడేసి వెనుదిరిగిన సుదర్శన్.. క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్పైనా అలానే హిట్ వికెటయ్యాడు.

కోహ్లీకి 19 సీజన్లు.. ఐపీఎల్‌లోనూ ఛేజ్ మాస్టర్‌గా అవతరిచిన విరాట్ కోహ్లీ(Virat Kohli) టన్నులకొద్దీ పరుగులున్నాయి. పలుమార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుపొందిన కోహ్లీ.. ప్లే ఆఫ్స్‌లో ఈ అవార్డు కోసం 19 సీజన్లు నిరీక్షించాడు. ఎట్టకేలకు ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై అర్ధ శతకంతో మెరిసినందుకు విరాట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకున్నాడు.
పంత్ ఫెయిల్.. 19వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్(Rishabh Pant) రివ్యూల్లోనూ ఫెయిలయ్యాడు. ఫీల్డింగ్ సమయంలో అతడు 9 రివ్యూలు తీసుకోగా.. వీటిలో ఎనిమిది రివ్యూలు అనుకూలంగా రాలేదు.
మూడు జెర్సీలతో శతకం.. ఐపీఎల్లో మూడు జట్ల తరఫున శతకాలు బాదిన ఆటగాళ్లుగా సంజూ శాంసన్ (Sanju Samson), కేఎల్ రాహుల్(KL Rahul), క్వింటన్ డికాక్(Quinton de Kock)లు రికార్డు సృష్టించారు. 19వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రెండు సెంచరీలు కొట్టిన సంజూ.. గతంలో ఢిల్లీ, రాజస్థాన్ రాయల్స్ జెర్సీతోనూ వంద బాదేశాడు.

ఇదివరకు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడిగా శతక్కొట్టిన రాహుల్ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్‌గా సెంచరీ సాధించాడు. డికాక్ సైతం.. ఢిల్లీ, లక్నో, ముంబై ఇండియన్స్ ప్లేయర్‌గా వందతో చెలరేగాడు.

తొలి బంతికే సిక్సర్.. ఐపీఎల్ 19వ సీజన్లో తొలి బంతిని 32 సార్లు సిక్సర్‌గా మలిచారు. రాజస్థాన్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ, ఆర్సీబీ హీరో దేవదత్ పడిక్కల్ మూడుసార్లు తాము ఎదర్కొన్న మొదటి బంతినే స్టాండ్స్‌లోకి పంపారు. అలానే.. వరసగా మూడు మ్యాచుల్లో మొదటి బంతికే వికెట్ తీసిన బౌలర్‌గా జోఫ్రా ఆర్చర్(రాజస్థాన్ రాయల్స్) అరుదైన ఘనత సాధించాడు.