BCCI : భారత జట్టుకు మరో కోచ్‌గా సాయిరాజ్ బహతులే (Sairaj Bahatule) నియమితులయ్యాడు. మాజీ ఆటగాడైన బహతులేకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ (BCCI). ఐపీఎల్లో పలు జట్ల స్పిన్నర్లను రాటుదేల్చిన ఈ మాజీ ఆటగాడు ఇకపై టీమిండియా స్పిన్ యూనిట్‌ను సానబెడుతాని మంగళవారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. టీమిండియా పురుషుల సీనియర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు బహతులే తెలిపాడు.
ఐపీఎల్ ముగియడమే ఆలస్యం.. భారత జట్టుకు కొత్తకోచ్‌ను ఖరారు చేసింది బీసీసీఐ. అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టు, వన్డే సిరీస్ ఆరంభానికి ముందే స్పిన్ బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహతులేను నియమించింది. దేశవాళీ క్రికెట్ దిగ్గజమైన ఆయన అంతర్జాతీయ క్రికెట్లోనూ గొప్పగా రాణించాడు సాయిరాజ్ బహతులే. ఆటగాడిగా, కోచ్‌గా ఆయన అనుభవం భారత జట్టుకు ఎంతగానో ఉపయోగపడనుంది.
🚨 News 🚨
BCCI appoints Sairaj Bahutule as India’s Spin Bowling Coach.
More Details 🔽 | #TeamIndiahttps://t.co/DYgHNIX7E5
— BCCI (@BCCI) June 2, 2026
ఏళ్లుగా దేశవాళీలో, ఫ్రాంచైజీ క్రికెట్లో స్పిన్నర్లను సానబెట్టడంలో బహతులే విజయవంతమయ్యాడు. అందుకని బహతులేను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించాం అని బీసీసీఐ వెల్లడించింది. ఐపీఎల్లో మెరిసే అటగాళ్లకే కాదు బౌలర్లను సానబెట్టే కోచ్‌లకు బీసీసీఐ అవకాశాలు కల్పిస్తోంది అనడానికి బహతులే నియామకమే తాజా ఉదాహరణ.
టీమిండియా కోచ్‌గా నియమితులవ్వడం పట్ల బహతులే సంతోషం వ్యక్తం చేశాడు. ‘భారత జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమితులవ్వడం నిజంగా గొప్ప గౌరవం. ఆటగాడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వకారణం. ఇప్పుడు కోచ్‌గా భారత క్రికెట్ విజయాల్లో భాగమయ్యే అవకాశం దక్కడం ఎంతో ప్రత్యేకం. అన్ని ఫార్మాట్లలో విజయవంతమవ్వడానికి ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’ అని వెల్లడించిన బహతులే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా సేవలందించాడు.

మహారాష్ట్రకు చెందిన సాయిరాజ్ బహతులే ఫస్ట్ క్లాస్ కెరీర్లో రెండు దశాబ్దాలు మెరిశాడు. ముంబై, మహారాష్ట్ర, అస్సాం, ఆంధ్ర, విదర్భ జట్లకు ప్రాతినిధ్యం వహించిన బహతులే 188 మ్యాచులు ఆడాడు. తన స్పిన్ మ్యాజిక్‌తో 188 వికెట్లు తీయడమే కాకుండా.. బ్యాట్‌తోనూ రాణించి 6,176 పరుగులు సాధించాడు. దేశవాళీలో ఆల్‌రౌండర్ అనిపించుకున్న అతడికి దేశం తరఫున ఎక్కువ అవకాశాలు దక్కలేదు. టీమిండియా తరఫున బహతులే రెండు టెస్టులు, 8 వన్డేలు మాత్రమే ఆడాడు.