దేశంలో గవర్నర్ల పాత్ర దశాబ్దాలుగా వివాదాస్పదమే. వారికి రాజ్యాంగం ప్రసాదించిన విచక్షణాధికారాలు వికటించి ఇష్టారాజ్యాలుగా యథేచ్ఛగా వికృత రూపం దాల్చాయి. కేంద్రంలో గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఏవైనా గవర్నర్ల వ్యవస్థకు రాజకీయాల బురదలంటించాయి. విపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టే కపటనాటకాలకు రాజభవన్లు రంగస్థలాలయ్యాయి. 70 ఏండ్ల క్రితం నాటి కేరళ ముఖ్యమంత్రి నంబూద్రిపాద్ మొదలుకొని ఎన్టీఆర్, కేసీఆర్ సహా నేటి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దాకా ఎందరో రాష్ర్టాధినేతలు గవర్నర్ల కర్ర పెత్తనాన్ని ఎదిరించినవారే. ఈ నేపథ్యంలో గవర్నర్ల విశేషాధికారాలపై ఇటీవల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పు గవర్నర్ రూపంలో చెలామణి అవుతున్న కేంద్ర ఆధిపత్య వ్యవస్థను పరోక్షంగా సుస్థిరం చేసింది. బిల్లులపై గవర్నర్ల నిర్ణయకాలం ఎంతో చట్టబద్ధంగా తేలేంత వరకు బాధిత రాష్ర్టాల పోరాటం ఇంకా మిగిలే ఉంటుంది.
దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి, శాసనసభ, శాసనమండళ్ల చైర్మన్లు ఎన్నికవుతారు. న్యాయశాస్త్రజ్ఞులు, అనుభవజ్ఞులు సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులుగా నియమితులవుతారు. వివిధ పరీక్షల్లో ప్రతిభను కనబరిచినవాళ్లు ఉద్యోగులు, వృత్తినిపుణులవుతారు. గవర్నర్ల నియామకానికి ఇలా ప్రక్రియలు, కొలమానాలూ లేవు. చట్టసభలో సభ్యత్వం, లాభదాయకమైన పదవుల్లేని భారతీయ పౌరుడై 35 ఏండ్ల కనీస వయసు దాటిన ఎవరినైనా కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్ర గవర్నర్‌గా రాష్ట్రపతి నియమించవచ్చు. అంతే. ఆ వెసులుబాటు కేంద్రానికి వరంగా మారింది. స్వాతంత్య్రం వచ్చిన తొలి, మలి దశాబ్దాల్లో గవర్నర్ల వివాదాలు తలెత్తలేదు. నాడు కేంద్రంలో, రాష్ర్టాల్లో ఒకే పార్టీ ప్రభుత్వాలు కొలువుదీరడమే అందుకు కారణం. 1967 నుంచి దేశ రాజకీయాలు మారుతూ వచ్చాయి. చాలా రాష్ర్టాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. తదాదిగా తరచుగా గవర్నర్ల వ్యవస్థతో, కేంద్రంతో రాజకీయంగా పొసగని రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి, ఘర్షణ పడుతున్నాయి. రాజ్యాంగ విలువలకు భిన్నంగా ఫక్తు రాజకీయ నాయకులు గవర్నర్లుగా నియమితులు కావడంతో ఈ సమస్య రావణకాష్ఠంలా రగులుతూనే ఉన్నది. రాజకీయ పునరావాస కేంద్రాలుగా రాజ్భవన్లు మారిపోయాయన్న విమర్శ ఉన్నది. గవర్నర్ల వ్యవస్థ అవసరమా? అని ప్రశ్నించే వారూ ఉన్నారు. కేంద్రంతో సంకీర్ణంగానో, సవినయంగానో ఉన్న పార్టీల పాలిత రాష్ర్టాలకు ఇబ్బంది లేదు. కానీ, హక్కుల కోసం, వాటాల కోసం, అస్తిత్వం కోసం ప్రశ్నించిన, నిలదీసిన వైరిపక్ష ప్రభుత్వాలకు చుక్కలు చూపించడానికి గవర్నర్లను కేంద్రం వాడుకోవడం పరిపాటి అయిపోయింది. తటస్థులను, మేధావులను, వివిధ రంగాల్లో ప్రసిద్ధి చెందిన పెద్దమనుషులను కాదని సొంత పార్టీ నేతలను ప్రమాణాలకు, విలువలకు భిన్నంగా గవర్నర్లుగా నియమించడం కేంద్రానికి అలవాటు అయిపోయింది. ఈ విషయంలో పార్టీలేవైనా కేంద్ర ప్రభుత్వాలన్నీ ఒక్క గూటి పక్షులే.
వర్తమాన దశాబ్దంలో ఈ వైరుధ్యాలు తారస్థాయికి చేరుకున్నాయి. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి వ్యతిరేకంగా నాటి గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ను కాదని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సొంత నిర్ణయాలు తీసుకున్నారు. నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ కోషియారి అదే పనిగా కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టారు. తెలంగాణలో ఉభయ చట్టసభలు ఆమోదించి పంపిన బిల్లులను అప్పటి గవర్నర్ తమిళి సై నొక్కిపెట్టారు. బిల్లులను ఆమోదించడం లేదా వెనక్కి పంపడం, అంతిమంగా రాష్ట్రపతికి నివేదించడం చట్టం పేర్కొన్న మూడు దారులివే. వీటిని మూసేసి నాలుగో దారిని ఎంచుకున్నారు గవర్నర్లు. అదే అవధులు లేని కాలయాపన. ఈ విషయం మీదే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. దానిపై గత ఏప్రిల్‌లో ద్విసభ్య ధర్మాసనం బిల్లుల ఆమోదానికి గవర్నర్‌కు మూడు నెలల కాలపరిమితి విధించగా ఇటీవల రాజ్యాంగ ధర్మాసనం ఆ తీర్పును సవరించింది.
‘బిల్లుల ఆమోదంలో గవర్నర్‌కు కాలపరిమితి విధించలేం కానీ, అసమంజసమైన, నిర్హేతుకమైన కాలయాపన విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటుంది’ అని స్పష్టం చేసింది. అది ఎన్నాళ్లో, ఎన్నేళ్లో చెప్పలేదు. దీంతో బంతి తిరిగి రాజ్‌భవన్ ప్రాంగణంలో పడింది.
గవర్నర్ల విచక్షణాధికారాలు పారదర్శకంగా, స్వపరభేదం లేకుండా అన్ని రాష్ర్టాల్లో ఏకీకృతంగా ఉంటే సమస్య ఉండదు. రాజ్యాంగం ఒకటే అయినా, వ్యవస్థ ఒకే రకంగా ఉన్నా గవర్నర్లు విచక్షణ ముసుగులో వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతున్నది. 2017లో గోవాలో అతిపెద్ద పార్టీగా గెలిచిన కాంగ్రెస్‌ను కాదని బీజేపీ సంకీర్ణానికి నాటి గవర్నర్ మృదులాసిన్హా అవకాశమిచ్చారు. అందుకు భిన్నంగా 2018లో కర్ణాటకలో కాంగ్రెస్ సంకీర్ణానికి ఆధిక్యం ఉన్నా అతిపెద్ద పార్టీగా అవతరించిందన్న సాకుతో నాటి గవర్నర్ విజుభాయ్వాలా బీజేపీకి అవకాశమిచ్చారు. ఈ గవర్నర్లు ఇద్దరూ బీజేపీ నుంచి వచ్చినవారే. ఇంకా వెనక్కి వెళ్తే 1957లో కేరళలో ఏర్పడ్డ తొలి కాంగ్రెసేతర నంబూద్రిపాద్ ప్రభుత్వం నాటి గవర్నర్ బూర్గుల రామకృష్ణారావు నివేదిక ఆధారంగా రద్దయింది. 1984లో సమైక్యాంధ్రప్రదేశ్‌లో మెజారిటీ ఉన్నా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గవర్నర్ రామ్‌లాల్ బర్తరఫ్ చేశారు.
1989లో కర్ణాటకలో మెజారిటీ లేదన్న సాకుతో ఎస్సార్ బొమ్మై ప్రభుత్వం రద్దుకు సిఫారసు చేశారు నాటి గవర్నర్ పెండేకంటి వెంకటసుబ్బయ్య. ఈ ముగ్గురూ పూర్వాశ్రమంలో కాంగ్రెస్ నేతలు. రద్దయినవి కాంగ్రెసేతర ప్రభుత్వాలు. సంఘ్ పరివార్ నేపథ్యమున్న బీహార్ గవర్నర్ సుందర్‌సింగ్ భండారి 1999లో శాంతిభద్రతల సాకుతో అప్పటి ముఖ్యమంత్రి రబ్రీదేవిని తప్పించడానికి రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. ఇలా ఎన్నో ఉదంతాలు గవర్నర్ల చరిత్రలో చీకటి అధ్యాయాలుగా మిగిలిపోయాయి.
రాజ్యాంగంలోని 356 ఆర్టికల్ ప్రకారం సంక్రమించిన అధికారంతో కేంద్రం ఎడాపెడా రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసిన సందర్భాల్లో గవర్నర్ల నివేదికలు యథాశక్తి ఆజ్యం పోశాయి. ఇటీవల సంచలనం సృష్టించిన గవర్నర్ వివాదానికి కేంద్ర బిందువైన తమిళనాడు గవర్నర్ రవి పూర్వాశ్రమంలో ఏ రాజకీయాలతో సంబంధం లేకున్నా అంతకంటే మిన్నగా గతంలో ‘ఘనత’ వహించిన గవర్నర్లను తలదన్నేంతగా స్టాలిన్ ప్రభుత్వాన్ని బిల్లుల ఆమోదం విషయంలో ముప్పుతిప్పలు పెట్టారు. కేంద్రం గవర్నర్‌కే వంతపాడింది. విధి లేని పరిస్థితుల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వీపీ సింగ్, పీవీ నరసింహారావు, దేవెగౌడ, ప్రధానులు కాక మునుపు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించినవారే. ఆ సాధక బాధకాలు వారికి తెలియనివి కావు. కానీ, గవర్నర్ల విచక్షణాధికార వివాదాలకు ముగింపు పలికే ప్రయత్నం చేయలేదు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ల రాజకీయ పక్షపాతంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేపథ్యమున్న గవర్నర్ కమలా బెణీవాల్ తమ లోకాయుక్త బిల్లును తిరస్కరించడంతో తీవ్రంగా స్పందించారు. ఇది 2013 నాటి మాట. మోదీ ప్రధాని అయ్యాక అంతకుముందున్న ప్రధానుల లాగే గతం మరచి విపక్ష పాలిత రాష్ర్టాలను ఇబ్బంది పెట్టడానికి గవర్నర్లను ఉపయోగించే ఫార్ములాను కొనసాగించారు. గవర్నర్ నియామకం విధివిధానాల్లో పాటించవలసిన ప్రమాణాలను సూచించిన సర్కారియా, పూంచి, రాజమన్నారు కమిషన్ల సిఫారసులను మోదీ కూడా పక్కన పెట్టేశారు. ఫక్తు రాజకీయ నాయకులను గవర్నర్లుగా నియమించడాన్ని ముఖ్యమంత్రిగా వ్యతిరేకించిన మోదీ ప్రధాని అయ్యాక సంఘ్ పరివార్ నేతలను గవర్నర్లుగా నియమిస్తూ వస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అడుగడుగునా అడ్డు తగిలిన తమిళి సై తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో ఎంపీగా పోటీచేసి ఓడిపోయి, వేలు కంటించిన సిరాచుక్క ఆరకముందే తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆమె హయాంలో తెలంగాణ రాజ్‌భవన్ బీజేపీ కార్యాలయంగా మారిపోయిందన్న విమర్శలు వచ్చాయి. ఇంత జరిగినా ప్రస్తుత భారతదేశంలోని 28 రాష్ర్టాల్లో 22 రాష్ర్టాల గవర్నర్లు పూర్వాశ్రమంలో బీజేపీ లేదా దాని మిత్రపక్షాల అగ్రనేతలే. గవర్నర్ నియామకాల్లో కేంద్రం, విచక్షణాధికారాలతో గవర్నర్లు, రాజ్యాంగం వారిపై ఉంచిన నమ్మకాన్ని, ఇచ్చిన వెసులుబాటును దుర్వినియోగం చేస్తున్న వైనాన్ని రోజూ మనం చూస్తున్నదే. కంచే చేను మేస్తున్న కలికాలం ఇది.