Bala Krishna | తెలుగు సినీ పరిశ్రమలో యాక్షన్ కొరియోగ్రఫీలో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న కవల సోదరులు రామ్–లక్ష్మణ్. ‘అఖండ 2: తాండవం’ కోసం మరింత భారీ స్థాయిలో యాక్షన్ డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఈ జంట గత రెండున్నర దశాబ్దాలుగా టాలీవుడ్లో అగ్రశ్రేణి ఫైట్ మాస్టర్లుగా రాణిస్తూ ఆరు సార్లు రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ‘అఖండ 2’ గురించి తాజా ఇంటర్వ్యూలో రామ్–లక్ష్మణ్ తమ అనుభవాలను పంచుకున్నారు. ‘‘బాలకృష్ణ గారితో మా అనుబంధం చాలా ఏళ్లది. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ తర్వాత ఈ సినిమా సెట్లో ఆయన చూపిన ఎనర్జీ మరింత దైవికంగా అనిపించింది’’ అని రామ్ తెలిపారు.
ఈసారి బాలయ్య మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నందున, ప్రతి రోల్‌కు సరిపోయేలా వేర్వేరు యాక్షన్ స్టైల్స్ రూపొందించామని లక్ష్మణ్ చెప్పారు. ‘‘బోయపాటి యాక్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని చెప్పడంతో ప్రతి ఫైట్ బ్లాక్‌ను భారీ స్థాయిలో తీర్చిదిద్దాం. అఘోరా పాత్ర ఈసారి విశ్వరూపాన్ని చూపనుంది’’ అని వారు వెల్లడించారు. హిమాలయాల్లో జరిగిన కీలక షూట్ గురించి మాట్లాడుతూ, ‘‘అక్కడ మేమంతా చలికి వణికిపోయినా, బాలయ్య మాత్రం భుజాలు బయట కనిపించే కాస్ట్యూమ్లోనే గంటల తరబడి షూట్ చేశారు. పాత్రపై ఆయనకు ఉన్న నిబద్ధత గొప్పది అని’’ అన్నారు.
‘అఖండ 2’లోని 99 శాతం యాక్షన్ సన్నివేశాలను బాలకృష్ణ స్వయంగా చేశారని వారు స్పష్టం చేశారు. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో కుంభమేళా నేపథ్యంలో తెరకెక్కిన ఎపిసోడ్ ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తుందని తెలిపారు. తమ తరువాత తరంగా రామ్ కుమారుడు రాహుల్ కూడా పరిశ్రమలోకి అడుగుపెడుతుండటం సంతోషంగా ఉందని రామ్–లక్ష్మణ్ తెలిపారు. ‘‘కొత్త ఆలోచనలతో రాహుల్ మాకు సలహాలు ఇస్తుంటాడు. త్వరలోనే అతడ్ని యాక్షన్ డైరెక్టర్‌గా పరిచయం చేస్తాం’’ అని అన్నారు. డిసెంబర్ 5న విడుదల కానున్న ‘అఖండ 2: తాండవం’ అఖండ విజయాన్ని అందిస్తుందన్న నమ్మకంతో అభిమానులు, సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.