2014లో మోదీ నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత సరిగ్గా నాలుగు నెలలకు ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించిన నిఖిల్ చక్రవర్తి స్మారక కార్యక్రమంలో చరిత్రకారిణి రోమిలా థాపర్ ప్రసంగించారు. ఇప్పుడు ఆ ప్రసంగం భవిష్యవాణిలా అనిపిస్తున్నది. భారతదేశ ప్రజాస్వామ్య ఆలోచనలో ఒకప్పుడు కీలకంగా ఉన్న పబ్లిక్ ఇంటలెక్చువల్ (ప్రజా మేధావి) పాత్ర ఇప్పుడు ప్రమాదంలో ఉందని నాటి ప్రసంగంలో ఆమె హెచ్చరించారు. ‘మన చుట్టూ వివిధ రంగాల నిపుణులు ఉన్నారు. కానీ, వారిలో చాలామంది తమ తమ రంగాలపై అంతగా శ్రద్ధ చూపడం లేదు. వారు ప్రజా మేధావుల స్థానాన్ని భర్తీ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. కానీ, ఆ రెండూ పాత్రలు ఒకే రకమైనవి కావు. ఉదాహరణకు ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేనంతమంది విద్యావేత్తలు ఉన్నారు. కానీ, పాలకులు తమ స్వేచ్ఛాయుత ఆలోచనను హరించివేస్తున్నా వారిలో చాలామంది కనీసం ప్రశ్నించడం లేదు’ అని థాపర్ చెప్పారు.
రోమిలా థాపర్ ప్రసంగం అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత కూడా కొనసాగింది. అలాంటి ఆలోచనలతోనే ఆమె పలు వ్యాసాలు రాశారు. అవి ‘ది పబ్లిక్ ఇంటలెక్చువల్ ఇన్ ఇండియా’ పేరిట ఓ పుస్తకంగా వెలువడ్డాయి. ఇంటర్నెట్ అందుబాటులో ఉండి, ఎలాంటి సంకోచం లేకుండా తమ అభిప్రాయాలను పంచుకుంటున్న ప్రస్తుత కాలంలోనూ దశాబ్దం క్రితం చేసిన ఆమె ప్రసంగం.. రాజకీయాల్లో నేడు రచయితలు, ఆలోచనాపరులు, విద్యావేత్తలు, కళాకారుల పాత్రపై ప్రశ్నను లేవనెత్తుతుండటం విశేషం. థాపర్ తన ప్రసంగంలో 19వ శతాబ్దపు డ్రేఫస్ ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పారు. 1890లలో ఫ్రాన్స్‌లో యూదులపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. ఆ సమయంలో యూదు వర్గానికి చెందిన కెప్టెన్ ఆల్ఫ్రెడ్ డ్రేఫస్‌పై దేశద్రోహానికి పాల్పడినట్టు ఫ్రాన్స్ సైన్యాధికారులు ఆరోపించారు. జర్మనీకి రహస్య సమాచారాన్ని అందించాడనే తప్పుడు అభియోగాలపై అతన్ని శిక్షించారు. కానీ, ఆ తర్వాతి కాలంలో అతను నిర్దోషి అని తేలింది. ‘జే అక్యూజ్’ (ఐ అక్యూజ్- నేను ఆరోపిస్తున్నాను) పేరిట ఎమిలీ జోలా అనే రచయిత రాసిన బహిరంగ లేఖ ఈ దర్యాప్తునకు దోహదపడటం గమనార్హం. ఫ్రెంచ్ సైన్యం, పాలకులు, అధికారులపై ఆయన ఆ లేఖలో తీవ్ర విమర్శలు చేశారు. జోలా లేఖకు రచయితలు, కళాకారులు, విద్యావేత్తలు మద్దతు తెలిపారు. వారి నిరసనలు, ప్రజల నుంచి విమర్శల నేపథ్యంలో స్వతంత్ర విచారణ జరిపి, డ్రేఫస్ నిర్దోషి అని నిర్ధారించారు. ప్రజా మేధావి అంటే అన్యాయాన్ని ఎదిరించే వ్యక్తి అని, సమాజం ముందుకు సత్యాన్ని చెప్పే ధైర్యం అతనికి ఉండాలని థాపర్ ఈ ఉదాహరణ ద్వారా చెప్పదలుచుకున్నారు.
నాటి ఆ బృందం ‘ప్రజా మేధావి’ అనే ఆలోచనకు బలమైన రూపమిచ్చింది. ప్రజా మేధావి అనేవాడు విద్యావేత్త కావాల్సిన అవసరం లేదు, కానీ తన రంగంలో గౌరవప్రదమైన స్థానం కలిగి, ప్రజా బాధ్యతను తెలిసిన వ్యక్తి అయితే చాలు. పాలనాశక్తిని అటువంటి వ్యక్తి ప్రశ్నించాలి, భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. ముఖ్యంగా రోమిలా థాపర్ చెప్పినట్టుగా పౌరుల హక్కులు ఏమిటి?, సామాజిక న్యాయం ఎలా సాధ్యపడుతుంది? లాంటి అంశాలపై చర్చను లేవనెత్తాలి.
భారత్‌లో ప్రజా మేధావి సంస్కృతిని పెంపొందించడం అంత సులభం కాదు. వర్గాలు, కులవ్యవస్థల ఆధారిత అసమానతలు, మీడియాకు స్పష్టమైన అవగాహన లేకపోవడం లాంటి సమస్యలు ప్రజా చర్చలను మొదటినుంచీ కట్టడి చేశాయి. అయినా అంబేద్కర్ వంటి ఆలోచనాపరులు సామాజిక చర్చను ముందుకు తీసుకెళ్లారు. 2000 దశకంలోనూ అరుంధతీరాయ్, రామచంద్ర గుహ లాంటి రచయితలు బహిరంగ వేదికలపై చర్చలు జరిపారు. బుకర్ పురస్కారం పొందిన తర్వాత అరుంధతీ రాయ్ రాజకీయ వ్యవస్థపై విమర్శనాత్మక వ్యాసాలు రాయడం ప్రారంభించారు. కశ్మీర్, ఛత్తీస్‌గఢ్‌లలో రాజ్యహింసను ఆమె విమర్శించారు. ‘నర్మదా బచావో ఆందోళన్’ వంటి ఉద్యమాలకు మద్దతు తెలిపారు. ఆమె రచనలు, పుస్తకాల్లోనే కాదు; ప్రసంగాలు, నిరసనలు, నిరాహార దీక్షల రూపంలో కూడా ఈ మద్దతు కనిపించింది. మరోవైపు ‘ది హిందూ’ వంటి పత్రికల్లో చరిత్రకారుడు రామచంద్ర గుహ వ్యాసాలు రాస్తూ రాయ్ అభిప్రాయాలను వ్యతిరేకించారు. పెద్ద ప్రాజెక్టుల అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. వ్యాసాలు, ఇంటర్వ్యూలు, సదస్సులు వంటి వేదికలపై నాడు ఇలాంటి మేధోచర్చలు తరచుగా జరిగేవి. 2013లో జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో సోషియాలజిస్ట్ ఆశిష్ నందీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కొన్ని వారాల పాటు టీవీల్లో ఆ వ్యాఖ్యలపై చర్చ జరిగింది. 2016లో పలువురు జేఎన్‌యూ విద్యార్థులపై దేశద్రోహం ఆరోపణలు వచ్చినప్పుడు పలు మీడియా సంస్థలు యాంటీ ఇండియా నినాదాల వీడియోలను ప్రసారం చేశాయి. రోహిత్ వేముల ఆత్మహత్య, జేఎన్‌యూ విద్యార్థి ఉద్యమం లాంటి సంఘటనలు జరిగి దాదాపు దశాబ్దం అయ్యింది. అలాంటి ఉద్యమాలు ఇప్పుడు జరగడం అసాధ్యమనే చెప్పాలి.
ఒకప్పుడు భారత్‌లో మేధావులు, ఆలోచనాపరులు, విద్యావేత్తలకు ప్రజా జీవితంలో ప్రత్యేక స్థానం ఉండేది. అమర్త్యసేన్, అరుంధతీ రాయ్, రామచంద్ర గుహ, ఇర్ఫాన్ హబీబ్, రోమిలా థాపర్ లాంటివారు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వంటి అంశాలపై చర్చించేందుకు దిశానిర్దేశం చేసేవారు. సంపాదకీయాలు, టీవీలు, విశ్వవిద్యాలయ సదస్సుల్లో వారి ఆలోచనలు చర్చకు వచ్చేవి. మన దేశ రాజకీయ, నైతిక దిశను విమర్శనాత్మక ఆలోచనలతో మలచాలని నమ్మిన ఒక ప్రభావవంతమైన వర్గం అప్పట్లో ఉండేది. అయితే, ఆ ప్రపంచం నేడు నిశ్శబ్దంగా నిర్వీర్యమైపోయింది. ప్రజా వేదికలు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లుగా మారిపోయాయి.
ప్రింట్ మీడియా ప్రభావం తగ్గడంతో నేడు పాడ్కాస్టర్లు, మోటివేషనల్ స్పీకర్లు, లైఫ్‌ైస్టెల్ కామెంటేటర్లు, రైట్‌వింగ్ సిద్ధాంతకర్తలు తదితరులు ప్రజా మేధావుల స్థానాన్ని ఆక్రమించారు. యూట్యూబర్లు, పాప్ చరిత్రకారులు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఒకనాడు విద్యావేత్తలు, రచయితలు, మేధావులు పంచుకున్న వేదికలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇవాళ ఇన్ఫ్లుయెన్సర్ మేధావులు అనే కొత్త వర్గం పుట్టుకొచ్చింది. వాదన, స్వతంత్ర ఆలోచన ద్వారా కాదు; ఫాలోవర్ల సంఖ్య, ఆకర్షణ, డిజిటల్ నైపుణ్యం ద్వారా వీరి ఆధిపత్యం కొనసాగుతున్నది. నేడు వైరల్ క్లిప్‌లు, మీమ్ లాంటివి వాస్తవ చర్చలను, లోతైన విశ్లేషణాత్మక వ్యాసాల స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి.
‘అమ్యూజింగ్ అవర్సెల్వ్స్ టు డెత్: పబ్లిక్ డిస్కోర్స్ ఇన్ ది ఏజ్ ఆఫ్ షో బిజినెస్’ అనే పుస్తకం 1985లో వెలువడింది. దీన్ని అమెరికన్ మీడియా సిద్ధాంతకర్త నీల్ పోస్ట్‌మన్ రాశారు. ఆయన ఆ కాలంలోనే మీడియా, వినోద సంస్కృతి, ప్రజా చర్చల మార్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. పుస్తకాలను నిషేధించే సమాజాన్ని, పుస్తకాలను చదవాలనే ఆసక్తి లేని సమాజాన్ని చూసి భయపడుతున్నట్టు అందులో పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన మాటలే నిజమయ్యాయి. నేడు మన చుట్టూ బోలెడు సమాచారం అందుబాటులో ఉన్నా, మన ఆలోచన మాత్రం తగ్గిపోయింది. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో సుచింతన్ దాస్ రాసినట్టుగా.. ‘సమాజం ఇప్పుడు సామూహిక ప్రయోజనాల గురించి ఆలోచించడం మానేసింది. అందుకే మనకు నేడు ఇంకా ఎక్కువమంది ప్రజా మేధావుల అవసరం ఉన్నది.’
గత కొన్ని దశాబ్దాల భారత చరిత్రను గమనిస్తే, రాజకీయ లేదా సామాజిక వ్యవస్థలను ప్రశ్నించే, ప్రజా వేదికలపై మాట్లాడే వ్యక్తులు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. సమాజ మార్పు కోసం మాట్లాడేవారి స్థానంలో మేధావుల ముసుగు వేసుకున్న టీవీ వ్యాఖ్యాతలు, సాంస్కృతిక విశ్లేషకులు ముందుకువచ్చారు. దశాబ్దాలుగా సుహేల్ సేఠ్, ఆనంద్ రంగనాథన్ వంటి వారిని భారతీయ టీవీ మీడియా వివిధ అంశాలపై చర్చలకు ఆహ్వానిస్తున్నది. వీరు తమ తమ రంగాల్లో నిపుణులు కాకపోయినా, టీవీ సెలబ్రిటీలుగా మారిపోయారు. జ్ఞానం, సమాజం మధ్య వారధిగా ఉండాల్సిన వ్యక్తులు ఇప్పుడు వ్యాఖ్యాతలుగా, విశ్లేషకులుగా, కుహనా చరిత్రకారులుగా మారిపోయారు. మీడియా ఈ తరహా ‘నిపుణులను’ సృష్టించింది.
2000, 2010 దశకాల్లో టీవీ మీడియా ప్రారంభించిన ఈ ధోరణిని డిజిటల్ మీడియా (యూట్యూబ్, పాడ్‌కాస్ట్ మొదలైనవి) మరింత వేగవంతం చేసింది. పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూల పేరిట లోతైన ప్రశ్నల చర్చలు ఇప్పుడు స్నేహపూర్వక చిట్‌చాట్‌గా, వినోదంగా మారిపోయాయి. రాజకీయాలకు సంబంధించి చేసిన ఇంటర్వ్యూలలో సాంప్రదాయ టీవీ లేదా డిజిటల్ న్యూస్ ఛానళ్ల కంటే యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కువ ప్రాచుర్యం పొందినట్టు అమెరికాకు చెందిన పరిశోధకులు ధ్రువ్ రాఘవన్, జోయోజీత్ పాల్ చేసిన ఓ అధ్యయనంలో ఇటీవల తేలింది.
ఇప్పుడు ప్రధాని స్వయంగా నిఖిల్ కామత్ అనే వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడితో డబ్ల్యూటీఎఫ్ పేరిట జరిగే పాడ్‌కాస్ట్‌లో పాల్గొంటున్నారు. ఒకప్పుడు జర్నలిస్టు కరణ్ థాపర్‌తో జరిగిన వాడీవేడీ ఇంటర్వ్యూకి పూర్తి విరుద్ధంగా ఈ ఇంటర్వ్యూ స్నేహపూర్వకంగా ఉంటుంది. ఇక మీడియా రంగానికి చెందిన స్మితా ప్రకాష్ మొదలుకొని ప్రఖర్ గుప్తా, బీర్‌బైసెప్స్, సందీశ్ భాటియా లాంటి పాడ్కాస్ట్ర్లు సామాజిక, రాజకీయ ప్రముఖులతో ఇం టర్వ్యూలు చేస్తున్నారు. వారిలో భాటియా కొంతమేరకు విమర్శనాత్మక ప్రశ్నలను సంధిస్తున్నా, ప్రధానమైన సమస్యలను ప్రస్తావించడం లేదు.
నిజానికి, మంచి జర్నలిజమంటే ఇబ్బంది కలిగించే ప్రశ్నలు అడగడం. కానీ, నేటి ఇంటర్వ్యూలు ‘కాఫీ విత్ కరణ్’ తరహాలో స్నేహపూర్వకంగా సాగుతున్నాయి. ఇంటర్వ్యూలను ప్రచార సాధనాలుగా, మిత్రులతో మాట్లాడినట్టుగా తయారుచేయడం జర్నలిజం ఉద్దేశాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ‘ది న్యూ యార్క్ టైమ్స్’ వంటి అంతర్జాతీయ పత్రికలే కాకుండా, భారత్‌లోని ప్రధాన మీడియా సంస్థలు కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్, పాడ్‌కాస్ట్‌లు వంటి తక్కువ నిడివి గల వీడి యో ఫార్మాట్ల వైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ కొ త్త మాధ్యమాలు లోతైన చర్చలకు అవకాశం ఇవ్వవన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే పుస్తకాలు, వ్యాసాలు, ఉపన్యాసాలు.. అన్నీ క్రమం గా 30 సెకన్ల క్లిప్‌లుగా కుదించబడుతున్నాయి.
గతేడాది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఐడియా ఎక్చేంజ్ కార్యక్రమంలో చరిత్రకారుడు విలియమ్ డాల్రింపిల్ ఒక పెద్ద చర్చను లేవనెత్తారు. ప్రజలతో మాట్లాడడంలో, రాయడంలో విఫలమైన విద్యావేత్తల వల్లే భారత్‌లో ‘వాట్సాప్ హిస్టరీ’ అనే తప్పుడు ధోరణి పురుడుపోసుకున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన అభిప్రాయం పూర్తిగా తప్పేమీ కాదు. ఎందుకంటే చాలామంది చరిత్రకారులు, విద్యావేత్తలు క్లిష్టమైన భాషలో, సాధారణ పాఠకుడికి అర్థం కాని విధంగా, ఒక వర్గం కోసం మాత్రమే రాస్తున్నారు. అయితే, స్క్రోల్ పొలిటికల్ ఎడిటర్ షోయబ్ డానియల్ చెప్పినట్టుగా.. ఈ వాట్సాప్ హిస్టరీ అనేది రాజకీయ, సామాజిక శక్తుల సృష్టి అని చెప్పడంలో సందేహం లేదు. నెహ్రూ కాలంలో ఇలాంటి నకిలీ చరిత్రలు ఎక్కువ ప్రాచుర్యం పొందలేకపోయాయని షోయబ్ అంటున్నారు. ఎందుకంటే, ఆ కాలపు రాజకీయాలు వాస్తవ ఆధారిత పరిశోధనను ప్రోత్సహించేవి.
ప్రపంచవ్యాప్తంగా నేడు యాంటీ -ఇంటెలెక్చువలిజం (మేధావితత్వం పట్ల వ్యతిరేక ధోరణి) పెరుగుతున్నది. అతివాద రైట్‌వింగ్ రాజకీయాలు బలపడుతున్నాయి. మేధావులను, విమర్శనాత్మక ఆలోచనలను పాలకులు పక్కన పెడుతున్నారు. అంతేకాదు, ఆలోచించే వర్గం నుంచి మాట్లాడే వర్గం వైపునకు జరుగుతున్న మార్పును ప్రతి సమాజం చవిచూస్తున్నది. ఇది కేవలం సాంకేతిక మార్పు కాదు, నైతిక మార్పు.
వాదన, చర్చల స్థానాన్ని చరిష్మా ఆక్రమిస్తున్నది. లోతైన పఠనం, విమర్శనాత్మక ఆలోచనలు, చర్చలు క్రమంగా తగ్గిపోయాయి. అంతేకాకుండా ప్రదర్శన, వినోదం ప్రధానంగా మారిపోయాయి. ఈ కారణంగానే జె.సాయి దీపక్, ఆనంద్ రంగనాథన్, విక్రమ్ సంపత్ వంటి వ్యక్తులు కొత్త తరహా రైట్ వింగ్ మేధావుల భావనను తెరపైకి తీసుకొచ్చారు. ముఖ్యంగా పాడ్‌కాస్ట్‌లు, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వారు చర్చా వేదికలను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద టెక్ కంపెనీలు సైతం ప్రైవసీ కంటే లాభాలకు, సమాజ నిర్మాణం కంటే విభజనకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ వేదికలు మోసపూరిత ఆలోచనలకు చోటు కల్పిస్తూ, స్వయం ప్రకటిత మేధావులు, ఇన్ఫ్లుయెన్సర్లు ఎదిగేలా చేశాయి.
నేడు మీడియా సంస్థలూ కార్పొరేట్, రాజకీయ ప్రయోజనాల కోసం రాజీపడుతున్నాయి. దాంతో ఎక్కువమంది జర్నలిస్టులు యూట్యూబ్ చానెల్ లేదా రీల్స్ వైపు మళ్లుతున్నారు. తత్ఫలితంగా పత్రికా విలేకరి, కంటెంట్ క్రియేటర్ మధ్య తేడా గుర్తించడం కష్టమైపోయింది. సుస్థిరమైన ఆర్థిక మద్దతు లేకపోవడం, సెన్సార్షిప్ పెరగడం, నిధులు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఎడిటర్లు సైతం పరిశోధనాత్మక గ్రౌండ్ రిపోర్టింగ్ కంటే అభిప్రాయ వ్యాసాలను ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే అవి తక్కువ ఖర్చుతో, తక్కువ ప్రమాదంతో ఉంటాయి.
ఇర్ఫాన్ హబీబ్, ఆనంద్ తేల్తుంబ్డే వంటి విద్యావేత్తల ఆలోచనలకూ నేడు యూనివర్సిటీల్లో చోటు లేకుండాపోయింది. పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉన్న నిఖిల్ చక్రవర్తి, సిద్ధార్థ వరదరాజన్ వంటి జర్నలిస్టులు నేడు ఉండి ఉంటే, వారి మీద కూడా ఎఫ్ఐఆర్లు నమోదయ్యేవి. వారికీ వేధింపులు తప్పేవి కాదు. ఇప్పుడు వారి స్థానంలో పాడ్కాస్టర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు తిష్టవేశారు. భారత ప్రజా మేధావిత్వానికి రూపమిచ్చిన రోమిలా థాపర్ కూడా ఈ మార్పు బాధను చవిచూశారు. ఒకప్పుడు విశ్వవిద్యాలయాలు, ప్రజా వేదికల్లో స్వరం వినిపించిన ఆమెపై, తర్వాత అదే వ్యవస్థ దేశద్రోహి అని ముద్రవేసింది. ఆమెను అణగదొక్కడమనేది వ్యక్తిగత విషయం కాదు. అది ఆలోచనను కాదు, అంగీకారాన్ని మాత్రమే కోరుకునే పాలకుల విధాన లక్షణం. ఇలాంటి వాతావరణంలోనే విమర్శనాత్మక ఆలోచన ఒక తిరుగుబాటుగా మారుతుంది. అయినా, కొన్ని సానుకూల మార్పులు కూడా జరిగాయి. నేటి యువ స్త్రీవాదులు, కుల వ్యతిరేక యాక్టివిస్టులు సమాజంలో విమర్శ, చర్చ, ప్రజా ఆలోచనను తిరిగి ప్రేరేపిస్తున్నారు. పాత గోడలను ఇంటర్నెట్, ఆధునిక సంస్కృతి చెరిపేసినందున నేడు ఇన్స్టాగ్రామ్, స్వతంత్ర న్యూస్లెటర్లు, యూట్యూబ్ మోనోలాగ్లు వారికి కొత్త వేదికలుగా మారాయి. ఈ పరిస్థితుల నేఫథ్యంలో నేడు ఉమర్ ఖాలిద్, గౌతమ్ నవ్లఖా, ఆనంద్ తేల్తుంబ్డే వంటి విద్యావేత్తలు యూట్యూబ్ వీడియోలు, రీల్స్‌లో కంటే జైలు గోడల వెనుకే ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం.
భారతదేశంలో పబ్లిక్ యూనివర్సిటీలు ఎప్పటి నుంచో విమర్శలు, చర్చలకు కేంద్రంగా ఉన్నాయి. కానీ, నేడు ఉన్నత విద్య ప్రైవేటీకరణ కారణంగా ఆ వేదిక కూడా లేకుండాపోయింది. విశ్వవిద్యాలయాలు ఇప్పుడు సైద్ధాంతిక యుద్ధరంగాలుగా మారిపోయాయి. ‘స్కాలర్స్ ఎట్ రిస్క్’ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారతదేశం అకాడమిక్ స్వేచ్ఛ క్షీణిస్తున్న దేశాల జాబితాలో ముందు వరుసలో ఉన్నది.