శుకుడు పరీక్షిత్తుతో- రాజా! అంతట అయ్యిందు వదన రుక్మిణి ఇందీవర శ్యాముని- కృష్ణచంద్రుని ఎగ్గులు- అనాదరపు అమంగళ వాక్యాలు విని సిగ్గుపడి, మందహాసంతో కూడిన క్రీగంటి చూపులతో గోవిందుని అందమైన ముఖారవిందాన్ని సందర్శిస్తూ ఇలా పలికింది… మురహరా! నీవు నిరవధిక- అనంత తేజోమూర్తివి. నీవన్నమాట ఉన్నమాటే! సృష్టికే ఏకైక ఏలికవైన స్వామీ! ఏ దృష్టితో పరికించినా నీకు నాకు పోలిక లేనే లేదు. ఆపన్న శరణ్యా! వెలకట్టలేని జ్ఞాన, ఐశ్వర్య, సుఖ, బలాది సద్గుణాలన్నీ నీలోనే నెలకొని ఉన్నాయి. నీవు నలువ- బ్రహ్మాదులకు కూడా ఈశ్వరుడవు- పరబ్రహ్మవు. అగుణుడవు- గుణాతీతుడవు. సకల కళలకు ఆదిగురుడవు. జగద్గురుడవైన నీవెక్కడ? త్రిగుణ స్వభావ నగు ప్రకృతినైన నేనెక్కడ. విజ్ఞులు- వివేకవంతులు, భక్తులు… నీవే గతివని, నీ కొరకే, నీ యందే రతి- ప్రేమాభక్తి కోరి, నీ పదపద్మాలు వెతికి పట్టుకుంటారు. ‘సతాం గతిః’-
సత్పురుషులకు గతియైన వాడా! ఇక నా సంగతి? సకాములైన అజ్ఞులు సిరి సంపదలు కోరి నా పాద వారిజా (కమలా)లను ఆశ్రయిస్తారు. రూక్షమైన సామ్యబుద్ధిగల అనంత జీవకోటికి ఆరాధ్య- పూజనీయురాలనైన నేను, అకాముడవై, మోక్ష కాంక్షులచే ఆకాంక్షింపబడే నీకెలా సాటి రాగలను?
భద్ర పురుషా! క్షుద్ర రాజులకు భయపడి సముద్రాన్ని ఆశ్రయించానని అన్నావు కదా! అదేంటి స్వామీ? ‘యద్బిభేతి స్వయం భయం’- నువ్వంటే భయానికే భయమే! నీ స్వరూపమే ‘అభయం’ కదా! ఈ మీ భయం మాయా విడంబనం- నటన మాత్రమే..
సీ॥ ‘కోరి నీ మంగళ గుణభూతి దానంబు
సేయంగబడు నని చెందు భీతి’
తే॥ ‘నంబునిధి మధ్య భాగమందమృత ఫేన
పటల పాండురనిభమూర్తి! పన్నగేంద్ర
భోగశయ్యను బవ్వళింపుచును దనరు
నట్టి యున్నత లీల దివ్యంబు దలప’
మహాత్మా! మీ సద్గుణ భూతి- సంపద (అగుణులకు, అపాత్రులకు) దానం చేయబడుతుందనే భీతి- భయంతోనో లేక శంకతోనో కాబోలు, ఓ నిష్కలంకా! నువ్వు ఎవ్వరికీ అందకుండా పాల సంద్రంలో పులుగురేడు- పన్నగేంద్రు (గరుడు)ని శయ్యపై పవ్వళించి ఉన్నావు గదయ్యా! అపవర్గ- మోక్షస్వరూపా! ఇక దుర్గాశ్రయణం- ద్వారకలో కోటను ఆశ్రయించడమంటావా? (శబ్దస్పర్శరూప రసగంధ)- విషయాలనే రాజులకు వెరచినట్లుగ, వారధి (సాగరం) వంటి విషయాకార రహితమై, అగాధమైన హృదయమనే అంతస్సముద్రంలో గుణస్పర్శ లేకుండా అసంగివై చైతన్య ఘనుడవై అద్వితీయంగా నిశ్చలంగా ప్రకాశిస్తూ ఉంటావు. దివ్య తేజోమయా! రజో (గుణ) మూర్తులైన రాజులకు నిన్ను చేజిక్కించుకోవడం- భజించడం సాధ్యమవుతుందా? ఇక, బలవంతులతోడి పగ- విరోధమంటావా? నగధరా! బహిర్ముఖాలై బలవంతాలైన ఇంద్రియాలు కలిగిన వారికి, ఇంద్రియ వశులకు, ఓ అంతర్యామీ! నీవు గోచరించవు. అందుకే వారు నిన్ను ద్వేషిస్తూ నిందిస్తారు. ఇందులో వింత ఏముంది? పోతే, రాజ సింహాసన అర్హత- శాసన యోగ్యత లేదన్నావు. అదీ సమంజసమే!
కం॥ ‘శ్రీ పతియు యజ్ఞ పతియు బ్ర
జాపతియున్ బుద్ధిపతియు జగదధిపతియున్
భూపతియు యాదవ శ్రే
ణీ పతియున్ గతియునైన నిపుణు భజింతున్’
(ద్వితీయ స్కంధం, పోతన).. ‘శ్రీదేవికి, భూదేవికి, యజ్ఞానికి, ప్రజలకు, ప్రజ్ఞ- బుద్ధికి, యాదవ వర్గానికి, వెయ్యేల సర్వ జగత్తుకీ పతి, గతి అయిన భగవంతుని సేవిస్తా’. ‘పతిం విశ్వస్య ఆత్మేశ్వరం..’ ఈ విశ్వానికే మీరు అధిపతులైతే, వాసుదేవా! మీకు ఈ లోకంలోని క్షుద్ర, పరిచ్ఛిన్న- పరిమిత రాజ్య సింహాసనాలు ఉంటే ఏమి? లేకుంటే ఏమి? పూర్వం మీ కోసం ఎందరు ధాత్రీశులు- రాజులు తమ రాజ్యాలు త్యజించి అడవులను ఆశ్రయించి తపస్సుతో తరించలేదు? అయినా, భక్తుల హృదయాలే మీకు అనురక్తి కలిగిన సింహాసనాలు!
ప్రోడా (చతురా)! మా జాడలు ఎవరికీ తెలియవన్నారు- ‘గూఢో గభీరో గహనో గుప్తః చక్రగదా ధరః’ (విష్ణు సహస్ర నామాలు). బృందారక వంద్యా! అది కూడా యుక్తమే! మీ దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తులైన, మీ కొరకు నిత్తెమూ- నిరంతరం అన్వేషించు మునిసత్తములంత వారికే మీ మార్గం గూఢం- అగోచరం, అంతుపట్టనిది. కాగా, ఆపాద మస్తకం అజ్ఞానం నిండిన ద్విపాద పశువుల సంగతి చెప్పేదేముంది? మా భావం ఎఱుక పడదన్నారు. భూత భావనా! మీ భాగవతుల- భక్తుల ఊహలే అలౌకికాలు- అగమ్యగోచరాలు అయి ఉండగా, ఓ భగవంతా! మీ ఊహలు- సంకల్పాలు మా వంటి మోహావిష్టులకు, ఆహా! కేవలం అపోహలే- భ్రమలే కావా? తప్పుటూహలే అవుతాయి కదా!
ఘనాఘన సుందరా! ‘మేము అకించనులం, అకించన ప్రియులం. అందుకే గుణాఢ్యులు- సద్గుణాలలో అధికులు తప్ప ధనాఢ్యులు మమ్ము గణించరు- లెక్కపెట్టరు’ అన్నారు. ‘మత్తః పరతరం నాన్యత్కించి దస్తి’- (గీత)- మీకన్నా అన్యం- ఇతరంగా కించిత్తు కూడా లేదు కాన, మీరు నిజంగా అకించనులే- ఏమీ లేనివారే! పరమార్థంలో.. మీరు శ్రీపతులు, శ్రీనిధులు, శ్రీధరులు, శ్రీకరులు. బ్రహ్మాది దేవతలు లోకులచే బలులు గ్రహించి అవి మీకు సమర్పించుకుంటారు. కాన, మీ కన్నా ‘శ్రీమతాం వరః’ సృష్టిలో శ్రీమంతులలో శ్రేష్ఠుడు వేరొకడున్నాడా? అనాథ నాథా! దీనులు, అనాథలు- నిరుపేదలు నావారని అన్నారు. దయాసింధో! నిజమే, దిక్కులేని వారికి మీరు కదా ఆత్మ బంధువులు. కలిమి, బలిమి కలవారు మాతో చెలిమి చెయ్యరన్నారు. ఇదీ అక్షర సత్యమే. ధన బల మదాంధులకు ఇంద్రియ తృప్తే, ఏకైక లక్ష్యం. శక్తిమంతులమని విర్రవీగు అహంకారులు మిమ్ము ఆశ్రయించరు. జగత్తే సత్యమను చిత్తం కలవారు మిమ్ములను అర్చించరు. ‘ఇందువదనా! నన్నే ఎందుకు పొందాలని అనుకున్నావు’ అని అడిగారు. ఓ దేవాధిదేవా! నీ కనుబొమలు ముడిపడినంత మాత్రాన, సిరులు- వైభవాలు మసిబారి- పస చెడి, నల్దెసలు చెదిరి, బెదరిపోయే సురజ్యేష్ఠుడు- బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, అమరేంద్రుడు మొదలైన దేవతలందరినీ నా డెందం- హృదయం తిరస్కరించింది. అలాంటిది, ‘శిశుపాల జరాసంధ, దంతవక్త్ర, పౌండ్రకాది అధికార రోగ పూరిత బధిరాంధక’ శవాల గురించి చెప్పనేల?
కరి వరదా! నా మనసు మిమ్ము వరించింది. మీ ధనుసు టంకారంతోనే సకల అరి- శత్రు రాజులను జయించి, కేసరి- సింహం మృగాలను పారద్రోలి తన భాగాన్ని- వంతును సొంతం చేసుకున్నట్లు, తిరుగులేని పరాక్రమంతో, ఓ ఉరుక్రమా! మీరు నన్ను పరిగ్రహించారు. తమ అవ్యాజ- అకారణ కరుణ, నా అదృష్టం! వాసుదేవా! నన్ను తమ దాసీగా అంగీకరించారు. కంసారీ! సాంసారిక జీవులందరూ కాలాధీనులు, మృత్యుగ్రస్తులు. వారితో వివాహ బంధమేమిటి? అశరణ శరణా! మీ చరణ దాసీత్వం స్వీకరిస్తా. అంతేకాక, కరుణావరుణాలయా! మీ చరణారవింద మకరందాన్ని ఆనందంగా ఆస్వాదించే నేర్పుగల తేటి- తుమ్మెద వంటి తేటి కంటి (నల్లని కనురెప్పలు గల సుందరి), చర్మంతో కప్పబడిన, రక్తమాంస మల మూత్రాది దుర్గంధ పదార్థాల మూట లాంటి, కాటి పాలయ్యే జీవచ్ఛవం- అశివమైన నరాధముణ్ని- నడపీనుగుని ఏ వధూటి- భామిని అయినా ఏటికి కామిస్తుంది? పురుషోత్తమా! మీరు ఆత్మారాములు, పూర్ణకాములు- నిష్కాములు కనుకనే ఉదాసీనులు, అనాసక్తులు. భువన సుందరా! నా సౌందర్యం, గుణాల పట్ల మీ దృష్టిపోదు. ఆపన్న ప్రసన్నా! ‘నన్ను అనుసరించు వారు విపన్నులు- ఆపదల పాలవుతార’ని అన్నారు కదా! ప్రాచీనులైన పృథు, భరత, యయాతి, ప్రియవ్రత, గయాదులు మీకై భోజ్యా- భోగయోగ్యాలైన లౌకిక రాజ్యాలను త్యజించి, అరణ్యాలకు వెళ్లి తపస్సు గావించి, ఓ అమరపూజ్యా! సాయుజ్యం- మోక్షం పొందారే కానీ, వారు ఏ పాట్లూ పడలేదే! రమాపతీ! మరో ధరాపతి- రాజును పతిగా పొందమని అన్నావు..
సీ॥ ‘నీరదాగమ మేఘ నిర్యత్పయః పాన
చాతకంబేగునే చౌటి పడెకు?
బరిపక్వ మాకంద ఫలరసంబులు గ్రోలు
కీరంబు సనునె దుత్తూరములకు?
ఘనరవా కర్ణనోత్కలిక మయూరము,
గోరునే కఠిన ఝిల్లీరవంబు
గరికుంభ పిశిత సద్గ్రాస మోదిత సింహ
మరుగునే శునక మాంసాభిలాష’
తే॥ ‘బ్రవిమలాకార! భవదీయ పాదపద్మ
యుగ సమాశ్రయ నైపుణోద్యోగచిత్త
మన్యు జేరునె తన కుపాస్యంబు గాగ?
భక్త మందార! దుర్భర భవవిదూర!’
‘భక్త మందార (భక్తులకు కల్పవృక్షం వంటివాడా)! దుర్భర భవ విదూరా (భరింపరాని సంసార బంధాలను భగ్నమొనర్చు- తెగటార్చువాడా)! స్వాతి కార్తిలో కజ్జల- మేఘ జల బిందువులను నేల మీద పడకుండానే పానము చేసే- తాగే చాతక పక్షి- వాన కోయిల చౌటి (ఉప్పునీటి) గుంటలోని నీటి కోసం వెళుతుందా? బాగా పండిన చూత- మామిడి రసాన్ని గ్రోలే కీరం- చిలుక దుత్తూరాన్ని- ఉమ్మెత్తని చిత్తగిస్తుందా- ఇష్టపడుతుందా? నీల నీరన- కారుమబ్బుల గర్జన ధ్వని విని ఆనందించే కాలకంఠం- నెమలి ఈల పురుగు (కీచురాయి) ధ్వనులను ఏల కోరి ఆలకిస్తుంది? మదకరి- మదించిన ఏనుగు కుంభస్థలంలోని మాంసాన్ని తిని తనివి- తృప్తిపడే కేసరి (సింహం) కుక్క మాంసం కోసం కక్కుర్తి పడుతుందా? శుభాకారా! నీ చరణ కమలాలను ఆశ్రయించి ఆనందించే చిత్తం అన్యాయత్తం- అన్యమైన దానికి అధీనమవుతుందా? ఇతరాన్ని సుతరాం- బొత్తుగా (ఎంతమాత్రం) కోరదు గదా!’ మనసుకు ఇంపు- ఆనందం గొలిపే వినసొంపైన పై సీస పద్యం భక్త కవీశుడు పోతన పోత పోసి భావుక భక్తులకు తోరంపు- అందమైన ఆరగింపు (నైవేద్యం)గా అందించిన మరో ‘మందార మకరంద మాధుర్య’ విందు!
రస స్వరూపుడైన శ్రీకృష్ణుని ఈ ‘విరసం’ తరువాత వైదర్భి- రుక్మిణిలో వినయ విధేయతలు ఎంతగానో వికసించి విప్పారినాయి. భైష్మి మానినిగా ఉన్నప్పుడు మాధవుడు ‘దేవీ! నేను నీకు అయోగ్యుడను’ అన్నాడు. తన అభిమానం తొలగగా రుక్మిణి అంటున్నది- ‘మహానుభావా! నేను మీకు తగిన దానను కాదు. నేను పట్టమహిషి- రాణిని కాదు, ఒట్టి చేటిని- పనికత్తెని’. ఈ నమ్రత వచ్చిన తరువాతనే వాసుదేవుడు రుక్మిణిని సమ్మానించి, సంభావించాడు.
(సశేషం)
-తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006