న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Kejriwal)కు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో ఉన్న మరో 22 మందిపై నమోదు అయిన అభియోగాలన్నీ ప్రత్యేక జడ్జి జితేంద్ర సింగ్ కొట్టిపారేశారు. ఇవాళ తీర్పు వెలుబడిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కంట కన్నీళ్లు ఆగలేదు. లిక్కర్ కేసులో నిందితులు అందరికీ కోర్టు విముక్తి కల్పించిందని, సత్యం గెలుస్తుందని మేం ఎప్పుడూ చెబుతూ వచ్చామని, భారతీయ న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని కేజ్రీవాల్ అన్నారు.
కేంద్ర మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీ కలిసి అతిపెద్ద రాజకీయ కుట్రపన్నినట్లు ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఆ పార్టీలోని అయిదుగురు ముఖ్య నేతలను జైలులో బంధించారని, సిట్టింగ్ సీఎంను ఇంటి నుంచి లాక్కెళ్లారని, జైల్లో పెట్టారని అన్నారు. కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదు అని, తన జీవితంలో కేవలం నిజాయితీగా మాత్రం వ్యవహరించానని, కోర్టు కూడా ఇవాళే ఇదే విషయాన్ని చెప్పినట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు.