e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News Farmers protest | రైతేడ్చిన దేశం పేరుకొస్తదా?

Farmers protest | రైతేడ్చిన దేశం పేరుకొస్తదా?

farmers protest | ఆకలి తీర్చి మనిషిని బతికిస్తున్నది అన్నం! అన్నాన్ని పండించి దేశంలోని మనుషుల్ని బతికిస్తున్నది అన్నదాత! ఆ అన్నదాత కన్నీరు దేశానికే అరిష్టం! అన్నదాత ఆత్మహత్య మానవజాతికే అవమానం! అట్టి అన్నదాతల హత్య సదరు ప్రభుత్వాలకే వినాశదాయకమన్నది వాస్తవం. బెంగాల్‌లో సింగూరు వద్ద రైతులపై కాల్పలు జరిపించిన కమ్యూనిస్టు ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బషీర్‌బాగ్‌ వద్ద విద్యుత్‌ ఉద్యమకారులపై కాల్పులు జరిపించిన చంద్రబాబు ప్రభుత్వం అందుకు నిదర్శనం. కాల్పులు జరుపకున్నా, ఆయా సందర్భాలలో అన్నదాతలపై దాష్టీకం ప్రదర్శించిన కాంగ్రెస్‌కూ అదేగతి పట్టింది. లఖింపూర్‌ వద్ద అన్నదాతల్ని కారుతో తొక్కించి నేడు బీజేపీ అదే దారి పట్టింది!

farmers protest

రామరాజ్యాన్ని నెలకొల్పుతారన్న ఆశతో, రామజపం చేస్తున్న పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు. ‘వినమ్రంగా తాగటానికి బదులు, అహంతో కాలితో లాగి పాలకుండను దొర్లించుకుంటుంది బలిసిన పిల్లి’ అలా వుంది నేటి బీజేపీ ప్రభుత్వ తీరు. ‘నా కారు కింద కుక్కపిల్ల పడ్డా, చలించిపోతా’ అని చెప్పిన మీరు సాక్షాత్తు మీ మంత్రి కొడుకు కారుతో తొక్కించి అన్నదాతల్ని హత్యజేస్తే, కనీసం అయ్యోపాపం అనలేదు, మంత్రిని మందలించనూ లేదు, మీ ధీమాకు కారణమేమిటి? ప్రజలు మీకిచ్చిన భారీ మెజారిటీయే కదా మోదీజీ!

- Advertisement -

మమ్మల్ని కూలీలుగా మార్చేసే వ్యవసాయ చట్టాలను రద్దుచేయండి, మహాప్రభో అంటూ పది నెలలుగా అభ్యర్థిస్తున్న అన్నదాతలను ఎండా, వానా, చలీ, కరోనాల బారిన పడేయటం భావ్యమా మోదీజీ? భోంచేసేటప్పుడైనా అది అన్నదాతల కష్టఫలమేనన్న వాస్తవం గుర్తుకురావటం లేదా? ‘పాలకులు సత్యవ్రతులైనప్పుడే ప్రజలు వారిని విశ్వసిస్తారు. సత్యనిష్ఠ మినహా మరేది ప్రజావిశ్వాసాన్ని సాధించలేదు’- బీష్ముడు ధర్మరాజుకు చేసిన హితబోధ ఇది. పాలకులెన్నటికీ విస్మరించరాని నిత్య సత్యమిది!


మరి మీ సత్యనిష్ఠ ఏ పాటిదో దయచేసి ఆత్మవిమర్శ చేసుకోండి మోదీజీ!

 1. విదేశాల్లోని నల్లధనం నిల్వలను తెచ్చి ప్రతి సామాన్య భారతీయుని ఖాతాలో లక్షల రూపాయలు జమచేస్తామన్నారు. ఆ హామీ ఏమైంది?
 2. అవినీతిపరుల ఆట కట్టిస్తామన్నారు. కానీ, వేల కోట్ల మేర బ్యాంకు రుణాలెగ్గొట్టిన వారిని మీ పార్టీలో చేర్చుకుంటున్నారు.
 3. కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కానీ, కరోనా తోడై కొత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న ఉద్యోగాలూ ఊడింది మీ హయాంలోనే.
 4. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారు, తిరుపతి సభలో హామీ యిచ్చారు. ఎన్నికల ఏరు దాటగానే, హోదాను హుష్‌కాకి అన్నారు.
 5. ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నా సరే, ‘పెద్దనోట్ల రద్దుతో నల్లధనమంతా బయటికొస్తుంది. ఉగ్రవాదుల ఆటకడుతుంది’ అంటూ రద్దుచేశారు. దానివల్ల నాటి యూపీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు దెబ్బతిన్నాయి తప్ప, నల్లధనం వెలికిరాలేదు, ఉగ్రవాదుల ఆగడాలు ఆగనూ లేదు.
 6. మీ తొలి హయాంలోనే, ‘పనామా’-‘ప్యారడైజ్‌’ పేపర్లు ప్రముఖ భారతీయుల విదేశీ అక్రమాస్తుల చిట్టాలను బయటపెట్టినయి. వాళ్ళు దాచిన ధనాన్నంతా దేశానికి రప్పిస్తామంటూ సిట్‌ను నియమించారు. నేటికీ అతీ గతీ లేదు.
 7. మీ రెండో హయాంలోనే, పన్నులేని విదేశాలలో సూట్‌కేస్‌ కంపెనీలలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన 380 మంది భారతీయుల పేర్లను ప్రకటించినయి ‘పండోరా పేపర్లు’. వాళ్ళపై ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏజెన్సీ బృందాలతో దర్యాప్తు చేయిస్తామని మీరెంత గంభీరంగా ప్రకటించినా పనామా, ప్యారడైజ్‌ పేపర్ల గతే, పండోరా పేపర్లకూ పడుతుందిలే అనుకుంటున్నారు ప్రజలు.
 8. స్వామినాథన్‌ సూచనలను తు.చ. తప్పక పాటిస్తామని చెప్పిన మీ ప్రభుత్వం కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించలేకపోయింది గదా మోదీజీ! ఇప్పటిదాకా మీరేం చేసినా మంచి కోసమే చేస్తున్నారని ప్రగాఢంగా విశ్వసించారు ప్రజలు. రెండో దఫా మీకు మరింత మెజారిటీని అందించటమే అందుకు నిదర్శనం.

ఈ ఘన విజయానంతరం మీరు చేసిన ఘన కార్యాలేమిటి?

 1. కార్పొరేట్లకు పన్నురాయితీ, రుణమాఫీల ద్వారా లక్షల కోట్లు మిగిల్చి వారిని ప్రపంచ కుబేరులను చేశారు.
 2. అదేసమయంలో నాన్‌స్టాప్‌గా పెట్రోధరలు, తద్వారా నిత్యావసరాల ధరలు పెంచేస్తూ కోట్లాదిప్రజలను దారిద్య్రరేఖ దిగువకు నెట్టేశారు.
 3. చిన్న, పెద్ద ప్రభుత్వరంగసంస్థల్ని తెగనమ్మటానికి తెరతీశారు.

కరోనా సంక్షోభ సమయాన పార్లమెంట్‌లో చర్చకు పెట్టకుండానే రూపొందించిన వ్యవసాయ చట్టాలను చూసి హతాశులయ్యారు వ్యవసాయ నిపుణులు. విపక్షాలేగాక మీ మిత్రపక్షాలు కూడా ఆ చట్టాలను ఖండించాయి. వ్యవసాయరంగంలో కార్పొరేట్లకు రెడ్‌కార్పెట్‌ పరుస్తున్న ఈ చట్టాలను ఉపసంహరించుకోమంటూ, పది నెలలుగా మీకు మొరపెట్టుకుంటున్న అన్నదాతలను ఎన్నో వేధింపులకు గురి చేయటమేగాక ఏకంగా కారుతో తొక్కించటం దేనికి సంకేతమో ఆలోచించండి మోదీజీ! మీరు చేసిన ఈ పెద్ద పాపాన్ని కడిగేసుకోవటానికైనా సరే, తక్షణం వ్యవసాయ, కార్మిక చట్టాలను ఉపసంహరించుకోండి. ఇప్పటికైనా సరే మీరా పని చేయకుంటే ప్రజలే కాదు, భగవంతుడు కూడా శిక్షిస్తాడు. తస్మాత్‌ జాగ్రత్త మోదీజీ!

కార్పొరేట్‌ పన్ను పెంపు ద్వారా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, కార్పొరేట్ల నుంచి భారీ విరాళాల సేకరణ ద్వారా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పేదల స్థితిగతులను మెరుగుపరిచేందుకు నిధులు వెచ్చిస్తున్నారు. పెరుగుతున్న ఆర్థిక అసమానతలను కొంతైనా తగ్గించకపోతే వ్యవస్థకే ప్రమాదం ముంచుకొస్తుందన్న వాస్తవాన్ని వారు గ్రహించారు. మీ ముందు కూడా అటువంటి అవకాశం ఉంది మోదీజీ.

1. వ్యవసాయ, కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవటం

2. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెప్పించటం.

3. బైడెన్‌, జిన్‌పింగ్‌ల మార్గాన పయనించటం.

భగవంతుడు మీ ముందుంచిన మూడు మార్గాలివే! అందిపుచ్చుకుంటారో, జారవిడుచుకుంటారో, ఛాయిస్‌ మీదే మోదీజీ!

పాతూరి వేంకటేశ్వరరావు
98490 81889

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Dalit bandhu | బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నిజ‌స్వరూపం బ‌య‌ట‌ప‌డింది

Narendra modi | ప్రజలంటే మోదీకి ఇంత ఈసడింపా?

Dalit bandhu | మది నిండా దళిత బంధువు కేసీఆర్‌

KCR | ప్రకంపనలు సృష్టిస్తున్న కేసీఆర్‌ ప్రకటనలు

Indian Railways | దేశానికే జీవనాడిని అమ్మేస్తారా?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement