e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home News ప్రకంపనలు సృష్టిస్తున్న కేసీఆర్‌ ప్రకటనలు

ప్రకంపనలు సృష్టిస్తున్న కేసీఆర్‌ ప్రకటనలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొన్నఅసెంబ్లీలో మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘రాబోయే కేంద్ర ప్రభుత్వంలో మనమే కీలకం కావచ్చు, టీఆర్‌ఎస్‌ శాసించే ప్రభుత్వమే రావచ్చు. దేశ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే..’ అంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు విశ్లేషకుల మెదళ్ళకు బోలెడంత పని కల్పించాయి.

గత మూడు దశాబ్దాలుగా కేసీఆర్‌ మాటల శైలిని గమనిస్తున్న వారెవరికైనా ఆయన ఏ విషయమైనా ఆషామాషీగా మాట్లాడేవారు కాదని గ్రహించగలరు. ఆచితూచి మాట్లాడటం, మాట్లాడేముందు ఆ అంశం మీద కసరత్తు చేయడం, ఫలితాలు ఆలోచించుకోవడం, ఆ తర్వాత బహిరంగపర్చడం కేసీఆర్‌ శైలి.

- Advertisement -

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో కేసీఆర్‌ చెప్పిన అనేక మాటలు, చేసిన ప్రకటనలు వాస్తవరూపం దాల్చడం మనందరికీ తెలుసు. ‘కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడబోతున్నది. మనకు అనుకూలంగా ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళ్తున్నాను, తిరిగి అడుగుపెట్టేది తెలంగాణ రాష్ట్రంలోనే’ అని కేసీఆర్‌ ప్రకటించినపుడు చాలామంది నమ్మలేదు. చివరికి ఆయన మాటలే నిజమయ్యాయి! తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాతనే ఆయన హైదరాబాద్‌లో అడుగుపెట్టారు.

కేసీఆర్‌ను మొదట్లో అపార్థం చేసుకున్న అనేకమంది విపక్ష నాయకులు ఆ తర్వాత ఆయన చిత్తశుద్ధిని, తెలంగాణ అభివృద్ధి పట్ల అంకితభావాన్ని అర్థం చేసుకొని టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడమే గాక, తమ పరిపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు.‘కొత్తగా మతం పుచ్చుకున్నవాడికి నామాలెక్కువ’ అన్నట్లు కొందరు కుర్ర నాయకులు ఎంత అతి చేస్తున్నప్పటికీ, వారికి కౌంటర్లు ఇస్తూ విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా తెలంగాణ నిర్మాణంలో భాగం పంచుకోమని మాత్రమే అభ్యర్థిస్తున్నారు.

కేసీఆర్‌ రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు తలపండిన రాజకీయవేత్తలకు సైతం ఓ పట్టాన అర్థం కావని చాలామంది మేధావులు సైతం అభిప్రాయపడుతుంటారు. అనేకసార్లు విపక్ష నాయకులు ఆయన పన్నిన పద్మవ్యూహంలో ఇరుక్కుపోయి తేరుకునేలోగానే అనుకున్న పథకాలను అమల్లో పెడ్తారు. కేసీఆర్‌ వ్యూహ చతురతకు నిదర్శనాలెన్నో. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటుకు అడుగడుగునా అడ్డుపడిన శక్తులను సైతం ఆదరణతో అక్కున చేర్చుకొని తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుగా చేసిన ఔదార్యం కేసీఆర్‌ది.

ఇక మొన్న.. కేసీఆర్‌ అసెంబ్లీలో చేసిన ప్రసంగం విషయానికి వస్తే.. రాబోయే కేంద్ర ప్రభుత్వంలో మనదే కీలకపాత్ర అవుతుందని ఏ ఉద్దేశంతో అన్నారని ఆలోచిస్తే, ఒకరకంగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారేమో అని తోస్తున్నది. మొన్నామధ్య ప్రధానిని కలిసినప్పుడు పద్మ పురస్కారాల గురించి, ఎయిర్‌ స్ట్రిప్పుల గురించి ప్రస్తావించానని, ఆయన ముందే తన అసహనాన్ని వ్యక్తం చేశానని కేసీఆర్‌ చెప్పడం గమనిస్తే కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల దేశంలో వ్యతిరేకత మొదలైందని, ముఖ్యంగా రైతులు మోదీ ప్రభుత్వ విధానాల పట్ల ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం మళ్లీ గెలిచే అవకాశం లేదని కేసీఆర్‌ అభిప్రాయంగా ఉన్నదనుకోవాలి.

ఆ మేరకు ఆయనకు విశ్వసనీయమైన సమాచారం ఉండే ఉంటుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలిచినా బీజేపీకి సొంతంగా మెజారిటీ రాదని, అధికారం కోసం ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి వస్తుందని కేసీఆర్‌ అంచనా. ఒకవేళ యూపీఏ ఎక్కువ సీట్లు దక్కించుకున్నప్పటికీ దానికి కావల్సిన మెజారిటీ అందనంత దూరం ఉంటుందనడంలో సందేహం లేదు. అలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినపుడు తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఏపీలో వైఎస్సార్సీపీ, తమిళనాడులో డీఎంకే, బెంగాల్‌ నుంచి టీఎంసీ కీలకమవుతాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితిని బట్టి అంచనా వేస్తే.. 15 సీట్లు టీఆర్‌ఎస్‌, 23 సీట్లు వైఎస్సార్సీపీ, 40 సీట్లు డీఎంకే, 30 సీట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ గెలిచే అవకాశం ఉన్నది. కర్ణాటకలో కుమారస్వామి పార్టీ డజను సీట్లు సులభంగా గెలుచుకుంటుంది. ఈ నాలుగు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడితే వందకు పైగా స్థానాలతో బలమైన శక్తి అవుతుంది. అప్పుడు ఎన్డీయే అయినా, యూపీఏ అయినా ఈ కూటమిని విస్మరించడానికి వీలుండదు. ఏపీకి కావలసింది ప్రత్యేక హోదా. ఆ హోదా ఏ కూటమి ఇస్తామంటే ఆ కూటమికి మద్దతు ఇస్తామని జగన్మోహన్‌ రెడ్డి ఏనాడో ప్రకటించారు. వీరందరిలో దక్షిణ భారతదేశం నుంచి కేసీఆర్‌ సీనియర్‌. పశ్చిమబెంగాల్‌ నుంచి మమతా బెనర్జీ రంగంలో ఉంటారు. వీరు ప్రధాని పదవికి పోటీపడినా పడకపోయినా, తమ రాష్ర్టాల ప్రయోజనాల కోసమైతే ఎంతకైనా తెగించగలిన సాహసం, సత్తా కలిగిన నాయకులు వీరిద్దరూ.

రాష్ట్రం ఏర్పాటయ్యేంతవరకు తమది ఉద్యమపార్టీ అని, రాష్ట్రం ఏర్పాటయ్యాక తమది అచ్చమైన రాజకీయ పార్టీ, సన్నాసుల మఠం కాదని ధైర్యంగా చాటిన నాయకుడు కేసీఆర్‌. పైకొకటి లోపలొకటి అనే తత్వం ఆయనది కాదు. కాబట్టే తనను గతంలో దూషించిన వారు వచ్చినా ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు. పగలు, ప్రతీకారాలు, కక్షాకార్పణ్యాలు కేసీఆర్‌లో లేవు. కాబట్టే కాంగ్రెస్‌, కమ్యూనిస్టు నాయకులు కూడా కేసీఆర్‌ పథకాలను ప్రశంసిస్తున్నారు.

బీజేపీ పాలన నానాటికీ తీసికట్టు నాగంభొట్లుగా ఉన్నది. ఇంధన ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిరుపేదలు వినియోగించే గ్యాస్‌ ధర కూడా వెయ్యికి చేరింది. కేంద్రం నుంచి ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాలు ఏవీ అందకపోవడం, నిరుద్యోగ సమస్య, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం, వ్యవసాయదారులకు వ్యతిరేకంగా చట్టాలు చేయడం, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అరాచకాలు, మతపరంగా ప్రజల సెంటిమెంట్ల మీద దెబ్బకొట్టే రాజకీయాలు లాంటి అనేక అంశాలు ప్రజలను అసంతృప్తికి గురిచేస్తున్నాయి. ఇన్ని వ్యతిరేకతలు ఉండగా రాబోయే ఎన్నికల్లో ఏ కూటమికీ మెజారిటీ రాదని, రాష్ర్టాల్లో బలంగా ఉన్న తమ లాంటి ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడక తప్పదని కేసీఆర్‌ భావన. కేసీఆర్‌ సొంతంగా చేయించే సర్వేలు, విశ్లేషణల ఆధారంగానే ఆయన అలాంటి ప్రకటనలు చేసి ఉంటారని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.

ఇలపావులూరి మురళీమోహనరావు
(వ్యాసకర్త: సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement