హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): కార్మిక శాఖలో దొంగలు పడ్డారని ‘నమస్తే తెలంగాణ’ రాసిన కథనం నిజమైంది. పేద భవన నిర్మాణ కార్మికుల సొమ్ము దళారులు, అధికారుల పాలైందని, ఆగస్టు 14న చెప్పింది అక్షర సత్యమని తేలింది. రూ.150 కోట్ల స్కామ్ జరిగిందంటూ ప్రచురితమైన కథనంపై ‘తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్’ స్పందించింది.
వరంగల్ జిల్లా జాయింట్ లేబర్ కమిషనర్ విచారణ జరిపారు. నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన కథనాలు వాస్తవం అని ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. స్కామ్‌తో సంబంధం ఉన్న మంచిర్యాల అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, మంచిర్యాల అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. ఈ స్కామ్‌పై విచారణ చేపట్టాలని ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు జీవోఆర్టీ 363 జారీ చేశారు.
ప్రాథమిక విచారణలో తీవ్రమైన ఉల్లంఘనలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. మంచిర్యాల జిల్లా పరిధిలో 15మందికి శా శ్వత వైకల్యం కింద బీమా సొమ్ము అందింది. అయితే 15మంది కూడా అనర్హులేనని తేలిం ది. మొత్తం 91మంది భవన నిర్మాణ కార్మికులు మరణించినట్టు క్లెయిమ్ చేసుకోగా, వీరి లో 80 నకిలీ క్లెయిమ్‌లుగా గుర్తించారు. భవ న నిర్మాణ కార్మికుల బీమా కోసం ఎంతలా తెగించారంటే.. చివరకు పోలీసు కేసులు, ఎఫ్ఐఆర్లను కూడా ఫోర్జరీవి సృష్టించారు. ఇదే విషయాన్ని నమస్తే తెలంగాణ తన కథనాల్లో కూడా పేర్కొనగా విచారణలో నిజమని తేలింది.
కార్మికులు మరణించిన తర్వాత వారి పేరుతో బీమా కార్డులను డూప్లికేట్వి తయా రు చేయించి రిజిస్ట్రేషన్ చేయించినట్టు నిర్ధారించారు. నకిలీ చలాన్లు, పాత తేదీలతో రెన్యువల్స్ చేసినట్టు తేలింది. ఇక నామినీలకు కాకుండా ఇతరుల పేర్లను చేర్చి క్లెయిమ్‌ల మొత్తాలను దిగమింగారన్న నమస్తే తెలంగాణ కథనాన్ని ప్రభుత్వం కూడా బలపరిచింది. కాగా మొత్తం రికార్డులను తక్షణం స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు ఆదేశించారు. డిజిటల్ పోర్ట ల్స్, భౌతిక రిజిస్టర్లు, క్లెయిమ్ ఫైళ్లను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అందజేయాలని కార్మిక శాఖను ఆదేశించారు.