హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఎన్నికల కుట్ర కలకలం రేపింది. మూడు నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల ఓట్లను మాయం చేసేందుకు ఒక జాతీయ పార్టీ తెరవెనుక భారీ కుట్రకు తెరలేపింది. గుర్తుతెలియని వ్యక్తులతో గుట్టుచప్పుడు కాకుండా ఫారం-7 దరఖాస్తులను సమర్పించి, సామూహికంగా ఓట్లను తొలగించేందుకు పకా సెచ్ వేసింది. ముషీరాబాద్‌లో స్వయంగా ఒక బీఎల్వో కుటుంబానికే చెందిన ఓట్లను గల్లంతు చేయడంతో ఈ గుట్టురట్టయింది. సదరు జాతీయ పార్టీ ఈ వ్యవహారంలో ప్రత్యర్థి వర్గాలను లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టమవుతున్నది. తమకు రాజకీయంగా ప్రతికూలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లను తొలగిస్తున్నట్టు చెప్తున్నారు.
ఫారం-7 అనేది ఓటును తొలగించడానికి ఓటరు స్వయంగా ఇచ్చే పత్రం. సాధారణంగా ఫారం-7ను సంబంధిత వ్యక్తులు లేదా అభ్యంతరాలు తెలిపేవారు సమర్పిస్తారు. కానీ, సదరు ఓటర్లకు తెలియకుండానే మరొకరు దరఖాస్తులు సమర్పించినట్టు తేలింది. ఈ అక్రమ వ్యవహారం మొదటగా ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో వెలుగుచూసింది. పోలింగ్ స్టేషన్ నంబర్ 210 పరిధిలో ఒక బీఎల్వో కుటుంబానికి చెందిన సుమారు 30 మంది ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించారు. బాధితులకు ఎలాంటి సమాచారం లేకుండానే ఫారం-7 దరఖాస్తులు సమర్పించారు. రహస్యంగా ప్రింటెడ్ ఫారాలతో దరఖాస్తులు దాఖలు చేశారు. దీంతో స్థానిక ఓటర్లలో తీవ్ర ఆందోళన మొదలైంది. అదృష్టవశాత్తు ఎన్నికల అధికారులు ముషీరాబాద్ పరిధిలోని ఈ అనుమానాస్పద దరఖాస్తులను గుర్తించి తిరసరించారు. దీంతో నిజమైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా సురక్షితంగా నిలిచాయి. ఈ కుట్ర వెనుక ఒక జాతీయ పార్టీ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముషీరాబాద్‌లో తనతోపాటు తన కుటుంబంలోని 30 ఓట్లను తొలగించినట్టు గుర్తించిన సదరు బీఎల్వో పోలీసులను ఆశ్రయించారని తెలిసింది. చికడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలింగ్ బూత్ ఏజెంట్, ఆయన కుటుంబ సభ్యుల వివరాలను ఎవరు సేకరించారో తేల్చాలని కోరారు. దరఖాస్తులను ఎవరు ముద్రించారు? ఎవరు సమర్పించారనే దానిపై విచారణ జరుపాలని విజ్ఞప్తి చేశారు. ఎలాగైనా గెలువాలన్న లక్ష్యంతో ప్రత్యర్థి సామాజిక వర్గాలను, ముఖ్యంగా ఒక వర్గానికి చెందిన ఓటర్లను లక్ష్యంగా చేసుకొని ఈ తొలగింపు వ్యూహం పన్నిన్నట్టు స్థానికులు చెప్తున్నారు. తమకు ప్రతికూలంగా ఉండే ప్రాంతాల్లో భారీగా ఓట్లను గల్లంతు చేయడమే ప్రధాన ఎజెండాగా మారిందని మండిపడుతున్నారు. ఈ అక్రమాలపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా అధికారికంగా ఫిర్యాదు చేశారు.
సదరు జాతీయ పార్టీ గతంలో కర్ణాటకతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఈ తరహా కుట్రను విజయవంతంగా అమలు చేసిందనే ఆరోపణలున్నాయి. ప్రింటెడ్ ఫారాలతో ప్రత్యర్థి పక్షాలకు చెందిన ఓట్లను నిర్దాక్షిణ్యంగా తొలగించి, లబ్ధిపొందే పన్నాగాన్ని తెలంగాణలో కూడా ప్రారంభించారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇప్పటికే సదరు పార్టీ పెద్దఎత్తున ఫారం-7 దరఖాస్తులను ముద్రించడంతోపాటు బోగస్ దరఖాస్తులను సమర్పించి ఎన్నికల్లో లబ్ధి పొందినట్టు ప్రత్యర్థి పార్టీలు ఆరోపించాయి. కోర్టులను సైతం ఆశ్రయించాయి.
తెలంగాణలో ఎన్నికల కమిషన్ ‘సర్’ ప్రక్రియ చేపట్టిప్పటి నుంచే భారీఎత్తున ఓట్ల తొలగింపు జరుగుతున్నదని బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఏ ఒక్కరి ఓటు హక్కు కూడా పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే హెచ్చరించారు. తాజాగా వెలుగు చూసిన ఫారం-7 వ్యవహారంపై బీఆర్ఎస్ ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆధారాలతో ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఫారం-7 వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అత్యంత తీవ్రంగా స్పందించింది. బోగస్ ఫారం-7 దరఖాస్తులను ఎవరు సమర్పించారు? దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనేదానిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. విచారణలో కుట్రదారులను గుర్తించి అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తప్పుడు పత్రాలతో మోసానికి పాల్పడిన నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.