హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు వివినియోగదారులపై వచ్చేనెల నుంచి రూ.5,420.23 కోట్ల అదనపు భారం పడనుంది. ట్రూఅప్ చార్జీల రూపంలో ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతినిచ్చింది.
2022-23 విద్యు త్తు కొనుగోలు వ్యయాలు, 2023-24 ఆదా య లోటు (రెవెన్యూ ట్రూ అప్) కింద మొత్తం రూ.7,635.22 కోట్ల బకాయిలను వసూలు చేయడానికి ఈఆర్సీ అనుమతినిస్తూ సోమవారం ఆర్డర్ పాస్ చేసింది. ఇందులో వ్యవసాయ రంగానికి చెందినవి రూ.2,214.99 కోట్లున్నాయి. అయితే వ్యవసాయ వినియోగదారులపై ఎలాంటి ట్రూ-అప్ చార్జీలు విధించకూడదని ఈఆర్సీ స్పష్టం చేసింది. ఈ బకాయిలను ప్రభుత్వం నుంచే డిస్కమ్‌లు రాబట్టుకోవాలని స్పష్టంచేసింది.
వచ్చే నవంబర్ నుంచి జారీ చేసే బిల్లుల నుంచే అదనపు బిల్లుల వాత ప్రారంభం కానుంది. దక్షిణ డిస్కమ్ పరిధిలో 29 నెలలు.. ఉత్తర డిస్కమ్ పరిధిలో 26 నెలల పాటు ఈ రికవరీ కొనసాగుతుంది. నవంబర్‌లో ఒక యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి ఒక యూనిట్‌కు 50 పైసల చొప్పున ఇప్పుడున్న టారిఫ్‌కు అదనంగా వసూలు చేస్తారు. మొదట 2022-23, 2023-24 సంవత్సరాల్లో వినియోగదారులు వాడిన వార్షిక విద్యుత్తు ఆధారంగా సగటు నెలవారీ వినియోగాన్ని లెకిస్తారు. సగటు వినియోగానికి అదనపు రేటును గుణించి నెలవారీ బిల్లులో ప్రత్యేకంగా చూపుతారు.