e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home ఎడిట్‌ పేజీ దేశానికే జీవనాడిని అమ్మేస్తారా?

దేశానికే జీవనాడిని అమ్మేస్తారా?

భారతీయ రైల్వే దేశానికి జీవనాడి. సామాన్య ప్రజలకు తక్కువ ధరకు రవాణా సౌకర్యాన్ని అందిస్తున్న సంస్థ. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ మన దేశానిది. రోజూ 2 కోట్లకు పైగా ప్రజలు రైల్వే సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే సంస్థ ఇది. దీన్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రైవేటుకు అప్పజెప్పటం ద్వారా ఈ ప్రభుత్వం కేవలం కార్పొరేట్‌ సంస్థల ప్రభుత్వం అని అర్థమవుతున్నది.

దేశంలోనే అతిపెద్ద ప్రజాసంస్థలోని రైల్వే స్టేషన్లు, ప్రొడక్షన్‌ యూనిట్లు, ప్యాసింజర్‌ రైళ్లు, డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్లు, కాంకోర్‌, ఐఆర్‌సిటిసి, ఖాళీగా ఉన్న రైల్వే భూములతో సహా ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. గత మూడు దశాబ్దాలనుంచి మన ప్రభుత్వాలు లాభదాయకమైన ప్రభుత్వ రంగసంస్థలను సైతం ప్రైవేటుకు అప్పగిస్తూ వస్తున్నాయి. అందుకు తగ్గ విధానాలు రూపొందిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా భారతీయ రైల్వేను అన్యులకు అప్పగించాలని చూస్తున్నది.

- Advertisement -

2014లోనే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం బిబెక్‌ డెబ్రాయ్‌ నేతృత్వంలో ‘హై లెవల్‌ కమిటీ’ని ఏర్పాటుచేసి రైల్వేను ఆధునికీకరించడానికి, వరల్డ్‌ క్లాస్‌ స్థాయికి తేవడానికి అనే నెపంతో రైల్వేను ప్రైవేటీకరించడానికి రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయించింది. వేదాలను, భగవద్గీతలను అనువదించిన బిబెక్‌ డెబ్రాయ్‌ రైల్వేను ముక్కలుగా చేసి కార్పొరేట్లకు అప్పగించాలని సిఫారసు చేశాడు. దీంతో భారతీయ రైల్వేలు చేసే అన్ని కార్యకలాపాల్లో 100 ఎఫ్‌డీఐలకు అనుమతిని ప్రభుత్వం ప్రకటించింది. ఇదంతా ఎందుకంటే.. ప్రజలకు మరింత మెరుగైన సేవలందించటానికేనని చెప్పుకొంటున్నది.

అనేక దేశాల్లో ప్రైవేటీకరణ ఘోరంగా విఫలమైంది. కానీ, ప్రైవేటు, కార్పొరేట్‌ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్న ఈ ప్రభుత్వం ప్రయాణీకుల భద్రతకు, దేశ ప్రయోజనాలకు హాని కలిగించేలా రైళ్లను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. ప్రైవేటీకరణ వల్ల పేద ప్రజలపై పడబోయే భారాన్ని పూర్తిగా విస్మరించింది. ఈ ప్రైవేటీకరణ, అమ్మకపు వికృత చేష్టలకు అనుకూలంగా ప్రభుత్వం చెప్తున్నదేమంటే, ప్రైవేటీకరణ వల్ల ప్రపంచస్థాయి ప్రయాణ అనుభవం, సామర్థ్యం, తక్కువ ప్రయాణ సమయం, ప్రమాణాలతో కూడిన సేవలు సాధ్యమవుతాయంటున్నది. అలాగే అదనంగా ప్రైవేటీకరణ వల్ల ఉపాధి లభిస్తుందని, లావాదేవీల ఛార్జీలు, ఇంధనఛార్జీల ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని పొందగలదని చెప్తున్నది. ఇవన్నీ తప్పుడు వాదనలని ప్రపంచ అనుభవాలన్నీ చెప్తున్నాయి. లాభాల అత్యాశ గల ప్రైవేట్‌ యజమానులు కార్మిక, ప్రజా భద్రతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారనటంలో సందేహం లేదు. అది వారి నైజం. ప్రైవేటు యాజమాన్యం కింద రైల్వేలలో భద్రత ఉంటుందని చెప్పడం ప్రజలను మోసగించడం, క్రూరమైన జోక్‌ తప్ప మరొకటి కాదు.

పంక్చువాలిటీ, ఎఫిషియేన్సీలను సాధించడం ఎవరి ఆధిపత్యంలో రైల్వే నడుస్తున్నదన్న దానిమీద ఆధారపడదు. వీటి సాధనకు ట్రాక్‌ల సమర్థ నిర్వహణ, మెరుగైన సిగ్నలింగ్‌ వ్యవస్థ, రోలింగ్‌ స్టాక్‌ మొదలైన వాటితోపాటు తగిన సంఖ్యలో నైపుణ్యం గల సిబ్బందిని నియమించడం, రైల్వేలోని వివిధ విధుల మధ్య సమన్వయం ఉండాలి. ప్రభుత్వాలు వీటన్నింటినీ నిర్లక్ష్యం చేశాయి. 2017 నాటి టాస్క్‌ఫోర్స్‌ ఆన్‌ సేఫ్టీ లేదా 2015 రైల్వే మంత్రిత్వ శాఖ ‘వైట్‌ పేపర్‌’ సిఫారసులను ఏ ప్రభుత్వమూ అమలుచేయలేదు. ఏటా 4500 కిలోమీటర్ల పాత ట్రాక్‌ను మార్చాల్సిన అవసరం ఉన్నదని అంచనా వేశారు. కానీ ఆర్థిక వనరుల కొరత అనే సాకుతో అది మార్చటం లేదు. ఉత్పత్తి యూనిట్లు అనేవి ‘భారతీయ రైల్వే రత్నాలు’. భారతీయ రైల్వేలో 600 డీజిల్‌, ఎలక్ట్రిక్‌ లోకోలు 3000కి పైగా బోగీలను 6 ఉత్పత్తి యూనిట్లు తయారుచేస్తాయి. వీటన్నింటినీ అమ్మటానికి ఈ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. దేశంలోని రైల్వే ప్రింటింగ్‌ ప్రెస్‌లన్నింటిని మూసివేయాలని నిర్ణయించింది.

ప్రస్తుతం, ప్రయాణీకులపై ఛార్జీలు 53% ఖర్చుతో, 47% సబ్సిడీతో ఇస్తున్నారు. ప్రైవేట్‌పరం అయితే ఈ రా యితీ చెల్లిపోవటమే కాదు, ఛార్జీలు దాదాపు రెట్టింపవుతా యి. రైల్వే ఇప్పటిదాకా ప్రజలకు సరసమైన రవాణా విధా నం. ఇకపై అలా ఉండే అవకాశం లేదు. రైల్వేల ప్రైవేటీకరణతో పనిచేస్తున్న 12 లక్షల మంది రైల్వే కార్మికులతో పాటు రైళ్లలో రోజుకు ప్రయాణించే 2 లక్షల మంది సాధారణ ప్రజలు కష్టాల పాలవుతారు. గత 25 ఏండ్లుగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించడాన్ని ఒక విధానంగా అమలు చేస్తూ, 18 లక్షలుగా ఉండిన కార్మికుల సంఖ్యను 12 లక్షలకు తగ్గించారు. కానీ రైళ్ల సంఖ్యను మాత్రం 100% పెంచారు. ఇది ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై పనిభారాన్ని పెంచింది.

రైల్వేలను ప్రైవేటీకరించి నాశనమైన గ్రేట్‌ బ్రిటన్‌ లాంటి దేశాల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవటానికి మన ప్రభుత్వం సిద్ధంగా లేదు. మోదీ ప్రభుత్వ చర్యలన్నీ తీవ్రమైన జాతి వ్యతిరేక, విధ్వంసక విధానాలు. ఇలాంటి వినాశకర విధానాలను పోరాటాలతో ఎదిరించిన చరిత్ర భారతీయ రైల్వే కార్మికులకు ఉన్నది. ఆ పోరాట వారసత్వంతో విధ్వంసక విధానాలను ఎదిరించాల్సిన అవసరం ఉన్నది. ఈ పోరాటంలో దేశ ప్రజలంతా కదలాలి.

(వ్యాసకర్త: సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి)
శంకరరావు చోడవరపు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement