వాషింగ్టన్/బీజింగ్: ప్రపంచంలోని అగ్ర దేశాల శాస్త్రవేత్తలకు ఏదో జరుగుతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైపర్సోనిక్ ఆయుధాలు, అణు పరిశోధన, అంతరిక్ష రక్షణతో సహా అత్యాధునిక సైనిక సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న సైంటిస్టులు చైనాలో మరణిస్తున్నారు. (Scientists Mysterious Deaths) అమెరికాలో అదృశ్యమవుతున్నారు. దీంతో ఈ సైంటిస్టుల మరణాలు, అదృశ్యం యాదృచ్ఛికమా లేక ఏదైనా ప్రణాళికతో పన్నిన కుట్రా? అన్నది అంతుపట్టడం లేదు.
కాగా, అమెరికాకు చెందిన 11 మంది శాస్త్రవేత్తల్లో కొందరు అదృశ్యం కాగా మరికొందరు అనూహ్యంగా మరణించారు. అణు సాంకేతికత, అంతరిక్ష పరిశోధన, అధునాతన ఆయుధాలు వంటి రంగాలకు చెందిన ఈ సైంటిస్టుల డెత్, మిస్సింగ్ మిస్టరీగా మారింది. 2022 నుంచి ఇప్పటి వరకు 11 మంది అమెరికా సైంటిస్టులు మరణించడం లేదా అదృశ్యం కావడంపై ఆ దేశ రాజకీయ వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ‘విదేశీ ఆపరేషన్’ కావచ్చని రిపబ్లికన్ ప్రతినిధి ఎరిక్ బర్లిసన్ అనుమానం వ్యక్తం చేశారు. ఇది చాలా తీవ్రమైన విషయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఎఫ్‌బీఐ దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

Us Scientists
మరోవైపు చైనాలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. రక్షణ రంగంలో ఏఐ, హైపర్సోనిక్ ఆయుధాలు, అణు పరిశోధన, అంతరిక్ష రక్షణతో సహా అత్యాధునిక సైనిక సాంకేతిక విభాగాల్లో పనిచేస్తున్న సైంటిస్టులు అనూహ్యంగా మరణిస్తున్నారు. ప్రమాదాలు, ఆకస్మిక అనారోగ్యాల వల్ల 9 మంది శాస్త్రవేత్తలు చనిపోయారు. చైనాలో మరణించిన శాస్త్రవేత్తల వయస్సు 26 నుంచి 68 సంవత్సరాల మధ్య ఉంది.
కాగా, 2023 జూలైలో బీజింగ్‌లో జరిగిన కారు ప్రమాదంలో నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీకి చెందిన 38 ఏళ్ల ప్రొఫెసర్ ఫెంగ్ యాంగ్హే మరణించారు. తైవాన్‌కు సంబంధించిన ఏఐ సిమ్యులేషన్పై ఆయన పరిశోధన చేస్తున్నారు. ‘అధికారిక విధులు నిర్వర్తిస్తూ బలిదానం పొందారు’ అని చైనా ప్రభుత్వ అనుబంధ సైన్స్ వేదిక పేర్కొనడం చర్చనీయాంశమైంది.
మరోవైపు గత కొన్నేళ్లుగా పలు కీలక రంగాలకు చెందిన చైనా శాస్త్రవేత్తలు మరణించడం మిస్టరీగా మారింది. 2018లో ఇలాంటి రోడ్డు ప్రమాదంలో మైక్రోఎలక్ట్రానిక్స్ నిపుణుడైన 57 ఏళ్ల చెన్ షుమింగ్ మరణించారు. 2023 జూలైలో జరిగిన కారు ప్రమాదంలో సైనిక ఏఐ నిపుణుడైన ఫెంగ్ యాంగ్హే చనిపోయారు. 2023 డిసెంబర్లో రసాయన శాస్త్రవేత్త అయిన జౌ గ్వాంగ్యువాన్ తెలియని కారణంతో మరణించారు.

China Scientists Deaths
కాగా, 2024 మార్చిలో డేటా శాస్త్రవేత్త అయిన లియు డోంగ్హావో ఒక ప్రమాదం తర్వాత చనిపోయారు. 2024 డిసెంబర్లో జరిగిన కారు ప్రమాదంలో అంతరిక్ష నిపుణురాలైన 62 ఏళ్ల జాంగ్ జియాక్సిన్ మరణించారు. 2025 జనవరిలో డ్రోన్ నిపుణుడైన 47 ఏళ్ల జాంగ్ డైబింగ్ తెలియని కారణంతో చనిపోయారు. 2025 నవంబర్‌లో బయోమెడికల్ కెమిస్ట్ అయిన లీ మిన్యాంగ్ ఆకస్మిక అనారోగ్యంతో మరణించారు.
అయితే కొత్త ఏడాదిలో కూడా చైనా సైంటిస్టుల మరణాలు కొనసాగాయి. 2026 ఫిబ్రవరిలో
హైపర్‌సోనిక్స్ నిపుణుడైన ఫాంగ్ డైనింగ్, వైద్యపరమైన సమస్య కారణంగా విదేశాల్లో మరణించారు. 2026 మార్చిలో హైపర్‌సోనిక్స్ పరిశోధకుడైన యాన్ హాంగ్ అనారోగ్యంతో చనిపోయారు.
ఇలా రోడ్డు ప్రమాదాలు లేదా అనారోగ్యంతో మరణించిన చైనా శాస్త్రవేత్తలలో చాలామంది వ్యూహాత్మకంగా ముఖ్యమైన సైనిక ఏఐ, హైపర్‌సోనిక్స్, అధునాతన ఆయుధ వ్యవస్థల రంగాలలో పనిచేస్తున్న వారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో అమెరికా, చైనాలో కీలక రంగాల సైంటిస్టుల మరణాలు, అదృశ్యం మిస్టరీగా మారింది. ఇది యాదృచ్ఛికమా లేక ఏదైనా ప్రణాళికతో కూడిన కుట్రా? అన్నది అంతుపట్టడం లేదు.