Pregnant Women | గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే ఆహారం పిండం ఎదుగుదలపై నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే ఈ కాలంలో ఏ ఆహారాలు తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదనే విషయంపై సరైన అవగాహన ఉండడం చాలా ముఖ్యం. పోషకాహారం లోపించినా, అవసరానికి మించి కొన్ని పదార్థాలు తీసుకున్నా తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బొప్పాయి, గుడ్ల గురించి అనేక అపోహలు ఉండటంతో వాటి గురించి స్పష్టంగా తెలుసుకోవడం అవసరం. బొప్పాయి పోషకాలతో నిండిన పండు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, గాయాలు త్వరగా మానేందుకు సహాయపడడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా వైద్యుల సలహాతో బొప్పాయిని ఆహారంలో భాగంగా తీసుకుంటుంటారు.
అయితే గర్భిణులు, అలాగే గర్భం దాల్చాలని ప్రయత్నిస్తున్న మహిళలు పచ్చి లేదా పూర్తిగా పండని బొప్పాయిని తీసుకోకూడదని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీనికి కారణం పచ్చి బొప్పాయిలో ఉండే పెపైన్ (Papain) అనే ఎంజైమ్. ఇది శరీరంలో ప్రసవాన్ని ప్రేరేపించే ప్రోస్టాగ్లాండిన్, ఆక్సిటోసిన్ హార్మోన్ల మాదిరిగా పనిచేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫలితంగా గర్భాశయంలో సంకోచాలు ఏర్పడి గర్భస్రావం జరిగే ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు. కొన్ని పరిశోధనల ప్రకారం పచ్చి బొప్పాయిలో ఉండే ఎంజైములు, లేటెక్స్ వంటి పదార్థాలు గర్భాశయాన్ని ఉత్తేజపరచి నొప్పులు, సంకోచాలను కలిగించే అవకాశం ఉంటుంది. ఇవి గర్భం ప్రారంభ దశల్లో ఉన్న మహిళలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే పూర్తిగా పండిన బొప్పాయిని గర్భిణులు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.
పండిన బొప్పాయిలో పచ్చి బొప్పాయిలో ఉండే లేటెక్స్, పెపైన్ ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి వైద్యుల సలహా మేరకు పరిమిత మోతాదులో తీసుకోవచ్చు. పచ్చి బొప్పాయిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది మహిళల రుతుచక్రాన్ని ప్రభావితం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శరీరంలో హార్మోన్ల సమతుల్యతపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో గతంలో కొన్ని ఆసియా దేశాల్లో దీనిని సహజ గర్భనిరోధకంగా ఉపయోగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే దీనిని కుటుంబ నియంత్రణ పద్ధతిగా ఉపయోగించడం శాస్త్రీయంగా నిర్ధారించిన సురక్షిత విధానం కాదని గుర్తుంచుకోవాలి.
పచ్చి బొప్పాయిలో ఉండే పెపైన్ ఎంజైమ్ ప్రొజెస్టిరాన్ ఉత్పత్తిపై ప్రభావం చూపి గర్భాశయంలోని ఎండోమెట్రియం అభివృద్ధిని దెబ్బతీస్తుంది. దీంతో పిండం ఎదుగుదలకు అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం దెబ్బ తింటుందని కొన్ని పరిశోధనలు పేర్కొన్నాయి. అలాగే లేటెక్స్ కూడా గర్భాశయ సంకోచాలను ప్రేరేపించి గర్భస్రావ ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడించాయి. గుడ్ల విషయంలో కూడా అపోహలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రధానంగా పూర్తిగా ఉడకని లేదా పచ్చి గుడ్లను గర్భిణులు తీసుకోకూడదు. పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉండడంతో ఆహార సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల గుడ్లను పూర్తిగా ఉడికించి మాత్రమే తీసుకోవడం సురక్షితం. ఇంట్లో తయారు చేసిన పచ్చి గుడ్లతో కూడిన మయోనైస్ వంటి పదార్థాలను కూడా గర్భిణులు దూరంగా ఉంచాలి. గర్భధారణ సమయంలో పచ్చి బొప్పాయి, పూర్తిగా ఉడకని గుడ్లు వంటి ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. గర్భిణులు ఏ ఆహారాన్ని తీసుకోవాలన్నా వైద్యుల సలహా మేరకు నిర్ణయం తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు.