ఆదివారం 05 జూలై 2020
Editorial - Jul 01, 2020 , 00:05:04

బాధ్యత మరిచిన బీజేపీ

బాధ్యత మరిచిన బీజేపీ

ఒక దేశ ధర్మం ఆ దేశ అసంఖ్యాక ప్రజల ఆచరణ నుంచి పుట్టాలి. అలాగే పుడుతుంది. అది ఆ దేశ ప్రజల సామూహిక సృష్టి. కానీ కొందరు ధర్మం తమ సొంత సృష్టి అనుకుంటారు. గ్రామాల్లో కంటే నగరాల్లో కరోనా బారినపడే అవకాశం 1.09 రెట్లు అధికంగా ఉందని మురికివాడల్లో ఇది 1.89 రెట్లు అధికమని భారతీయ వైద్య పరిశోధన మండలి విశ్లేషించింది. ఈ సర్వే కేంద్ర ప్రభుత్వ ప్రణాళికరహిత చర్యలను బయటపెట్టింది. ప్రేమలోనైనా, యుద్ధంలోనైనా పరిపక్వత అవసరం. రాజకీయ పరిపక్వత ఉన్న నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ విపత్తు చుట్టుముట్టిన వేళ మోదీని సమర్థించారు. అందరికంటే ముందుగా లాక్‌డౌన్‌ ప్రకటించి దేశానికి దారి చూపెట్టారు.

సైకాలజీ అంటే ఏమిటనే చర్చ వచ్చిన తొలిరోజుల్లో ప్లేటో, అరిస్టాటిల్‌ లాంటి తత్వవేత్తలు ‘ఆత్మను చదవటం’ అన్నారు. ఆత్మ మూర్తపదార్థం కాదు. అమూర్తం కాబట్టి ఇది మనసుకు సంబంధించిన శాస్త్రం అనే ప్రతిపాదన ముందుకువచ్చింది. చేతలను అధ్యయనం చేసే శాస్త్రంగా కొంతకాలం ఉండిపోయింది. 20వ శతాబ్ది ప్రారంభంలో జాన్‌ బి వాట్సన్‌ ‘ప్రవర్తనావాదం’ వచ్చింది. ప్రవర్తనలో ఆత్మ నిబిడీకృతమై ఉంది. ఆత్మ హృదయంలో ఉంటుందంటారు. ఆత్మ మానవ సత్సంకల్పానికి, నిస్సహాయులను ఆదుకునే తత్త్వానికి ఓ అమూర్త సంకేతం. శారీరక సుఖాలకు, బాధలకు అతీతంగా ఆత్మ జిమెదారి అన్న మాట. ఇక్కడ ఎవరి ఆత్మ వారికి జవాబుదారీ. కాబట్టే ఎవరైనా తమ ఆత్మనే తప్ప ఇతరుల ఆత్మను అస్సలు పట్టించుకోరు. 

విపత్తు వచ్చిన వేళ కరోనా కమాండ్‌ కేంద్రాల మీదికి దాడికి పోవటం బాధ్యత లేనితనం. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ఎటుపోయిందో ధర్నాలు చేస్తున్న వాళ్లకు తెలుసా? 

ప్రధాని మోదీ కరోనా వైరస్‌ సంక్షోభం నడుమ ‘ఆత్మనిర్భర్‌' (భారత స్వావలంబన) అనే ఆర్థిక ఎజెండాను ప్రకటించారు. దీనికి 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీని జోడించారు. ఈ ఉద్దీపన అర్ధరాత్రి దేశవ్యాప్తంగా పనిస్థలాలను మూసివేసిన నేపథ్యంలో కూడు, గూడు, నీరు లేని స్థితిలో నెత్తురు చిమ్మిన పాదాలతో వందలు, వేల మైళ్ళకు మైళ్ళు నడిచిన దేశంలోని 20 కోట్ల మంది వలస కార్మికులకు కనీసం కొత్త చెప్పుల జోడు ఇవ్వలేకపోయింది. కానీ కార్పొరేట్‌ మల్టీనేషనల్‌ సంస్థల లాభమే పరమావధిగా ఆర్థికవ్యవస్థను మరింతగా ప్రైవేటీకరించాలనుకునే మోదీజీ ఆత్మను మాత్రం ప్రతిబింబించింది. ‘సైకాలజీ మొదట తన ఆత్మను, తర్వాత మనసును చేతనత్వాన్ని పోగొట్టుకొని, ప్రవర్తనను మాత్రం నిలుపుకొంది’ అని ఉడ్‌వర్త్‌ అనే శాస్త్రవేత్త నవ్వుకుంటాడు. మోదీజీ ఆత్మనిర్భర్‌ పథకంతో మొదట తన ప్రవర్తనను ఆ తర్వాత మనసును పోగొట్టుకుని ఆత్మను మాత్రం నిలబెట్టుకున్నారు. దేశానికి తండ్రి స్థానంలో ఉన్న మోదీజీ తన ప్రేమనంతా దేశ ప్రజలపై కాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మీద చూపించి, దేశాన్ని ఇబ్బంది పెట్టారు. అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రవాస భారతీయుల ఆలోచనలను ట్రంప్‌కు అనుకూలంగా మార్చడం కోసం భారతీయ పేదల జీవితాలను నరేంద్ర మోదీ పణంగా పెట్టారు. 

చైనాలో ఈ ఏడాది జనవరి 11న తొలి కరోనా కేసు వెలుగుచూసింది. వుహాన్‌ నగరంలో మహమ్మారి విజృంభిస్తున్న తీరును, మరణాల గణాంకాలు, కరోనా నియంత్రణపై చైనాలో పరిణామాలను ఎప్పటికప్పుడు చైనాలోని భారతీయ దౌత్య కార్యాలయం, భారత ఇంటెలిజెన్స్‌ పసిగడుతూ ప్రధాని మోదీకి ఉప్పందిస్తూ హెచ్చరించాయి. చైనా అష్టదిగ్బంధం చేసింది. మనం కూడా అష్టదిగ్బంధం అమలుపరుచాల్సిన అవసరం ఉందని దౌత్య కార్యాలయం గట్టిగా హెచ్చరించింది. అలాంటప్పుడు బీజేపీ ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దుచేసి ఉంటే ఈ రోజు దేశానికి ఈ గతి పట్టేదే కాదు. కానీ ఫిబ్రవరి 24-25 తేదీల్లో వచ్చే ట్రంప్‌కు ఆహ్వానం పలుకటం కోసం కొవిడ్‌ వైరస్‌ ప్రబలే అంశాన్ని విస్మరిస్తూ అంతర్జాతీయ విమానాశ్రయాలను తెరిచి ఉంచారు. దీంతో వైరస్‌ శరవేగంగా విస్తరించింది. ‘నమస్తే మోదీ’ పేరుతో గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో లక్షల మందిని సమీకరించారు. కిక్కిరిసిపోయిన సభా ప్రాంగణంలోనే వైరస్‌ విశృంఖలమైంది. జూన్‌ 13 నాటికి గుజరాత్‌లో 16343 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1000 మంది చనిపోయారు. అహ్మదాబాద్‌లోనే దాదాపు 800 మరణాలు సంభవించాయి. జాతీయ మరణాల రేటు సగటున 2.8 శాతం ఉంటే గుజరాత్‌లో 6.14 శాతం ఉన్నది. 

ఇంకోవైపు వలస కార్మికుల పట్ల కూడా ప్రభు త్వం అన్యాయంగా వ్యవహరించింది. వలస కార్మికుల సంఖ్యను తక్కువచేసి చూపటానికి ప్రయత్నించింది. ట్రంప్‌ పర్యటనలో ఆయనకు కనిపించకుండా ఉండటం కోసం మురికివాడల చుట్టూ గోడలు కట్టించారు.యావత్‌ ప్రపంచం లాక్‌డౌన్‌లో ఉంటున్న కాలంలోనే, తనను మించినవారు లేరని గర్విస్తున్న జాతీయవాద పార్టీ పాలిస్తున్న దేశంలో రహదారులన్నీ వలసకూలీల పాదాలతో రక్తమోడాయి. వాస్తవం ఇలా ఉంటే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్‌ప్రకాశ్‌ నడ్డా తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశపూరితమైనవి. కరోనా మహమ్మారి మింగిన ప్రాణాల మీది రాజకీయంతో భవిష్యత్‌ ఓట్లు ఏరుకునే ప్రయత్నం. రాజకీయ పరిణతి లేని వ్యక్తికి ఏకంగా రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే వచ్చే పర్యవసానాలు ఏమిటో కండ్లకు కనిపిస్తున్నాయి. విపత్తు వచ్చినవేళ కరోనా కమాండ్‌ కేంద్రాల మీదికి దాడికి పోవటం బాధ్యత లేనితనం. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ఎటుపోయిందో ధర్నాలు చేస్తున్న వాళ్లకు తెలుసా? వీళ్లకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఢిల్లీకి వెళ్లి అక్కడ ధర్నాలు చేసి రాష్ర్టానికి రావాల్సిన నిధులను తీసుకురావాలి. విపత్తు వేళ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాలి.

(వ్యాసకర్త: దుబ్బాక ఎమ్మెల్యే)
logo