ఆదివారం 24 జనవరి 2021
Devotional - Nov 30, 2020 , 01:49:04

సర్వకార్య నిర్వహణకు, ఆనంద జీవనానికి..

సర్వకార్య నిర్వహణకు, ఆనంద జీవనానికి..

హరేరామ హరేరామ! రామరామ హరేహరే!!


శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుబాహు మరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి॥

ఆనందం అందరూ కోరుకునేదే. నిరంతర దైవధ్యానంతో వ్యక్తికి శక్తి చేకూరుతుంది. తద్వారా పాంచభౌతికమైన మన దేహం పొందేది సుఖం. మన మనసు పొందేది సంతోషం. ఆత్మ ఎప్పటికీ పొందేది ఆనందం. ఆ ఆనందం ఉన్నప్పుడు సర్వకార్యక్రమాలు సంతృప్తిగా, శక్తివంతంగా నిర్వహించవచ్చు. మనలో పూర్ణమైన పరిశుద్ధత ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆనందం మన సొంతమవుతుంది. ఈ శుద్ధత లోపించినప్పుడు అటువంటి ఆనందం మనకు లభించదు. దానివల్ల మనసు, శరీరం శక్తి విహీనమవుతాయి. అప్పుడు ఏ పనీ పూర్తవక కర్మలూ పెరిగి సమస్యలు తీవ్రమవుతాయి. అనారోగ్యాలు, అసంతృప్తితో చికాకులు అధికమవుతాయి. గొప్ప శక్తి ఉన్న వ్యక్తులు సైతం ఒక్కోసారి తమ శక్తిని కోల్పోయి ఇబ్బందులకు గురవుతారు. 


ఆనంద స్వరూపుడు శ్రీరాముడు. మనలోనూ, మన చుట్టూ వున్న లోపాలన్నీ తొలగాలంటే సర్వానందమయ స్వరూపుడైన శ్రీరాముని ఆరాధించాల్సిందే. నిశాచర వినాశకరుడైన రాముడు మనలోని చీకట్లనుకూడా తొలగించగలడు. రాముడు లోకాభిరాముడు. అక్షర పరబ్రహ్మ స్వరూపం ‘రామ’మంత్రం. రామునికన్నా ‘రామనామాని’కి మరింత శక్తి ఉంటుందనేది హనుమ ఎన్నోసార్లు నిరూపించాడు. అక్షరాలలో ‘హ’కారం ఆకాశ బీజానికి సంబంధించింది. ‘రేఫ’ అగ్నితత్వానికి చెందింది. ‘హ’కార, ‘రేఫ’లతో కూడిన శ్రీరామ షోడశాక్షర మంత్రాన్ని మనం పఠించడం వల్ల వ్యక్తిలోకి ఆకాశ, అగ్ని శక్తుల ప్రవేశం జరుగుతుంది. ఆ తేజస్సుతో వ్యక్తి సాధించలేని కార్యక్రమం, పొందని సంతోషాలు ఉండవు. 

పరమ మంత్రమైన ‘హరేరామ హరేరామ! రామరామ హరేహరే!!’ అనే మంత్రజపంతో మనిషి నిరంతరానందాన్ని పొందుతాడు. శరీరంలోనూ, మనసులోనూ ఉన్న అన్ని మాలిన్యాలూ తొలగి, గొప్ప కార్యనిర్వహణకు తగినట్లుగా మనలను మనం తీర్చిదిద్దుకొనే శక్తి సమకూరుతుంది. దీనిని రోజూ వీలైనంత వరకు ఎక్కువ సమయం పాటు జపించి సర్వకార్యాల నిర్వహణను సాధించుకొంటూ, ఆనంద జీవితానికి బాటలు వేసుకొందాం.

-సాగి కమలాకరశర్మ


logo