ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Devotional - Sep 14, 2020 , 04:59:43

‘శ్రీ గణేశ ఋణంఛింధి వరేణ్యం హుం నమ: ఫట్‌'

‘శ్రీ గణేశ ఋణంఛింధి వరేణ్యం హుం నమ: ఫట్‌'

  • ‘సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్‌ పూజిత: ఫలసిద్ధయే
  • సదైవ పార్వతీ పుత్ర: ఋణనాశం కరోతుమే’

మానవ జీవితంలో ఏదో సందర్భంలో, ఏదో అవసరంతో అప్పు చేయడం తప్పనిసరి. అవసరానికి అప్పు తీసుకున్నా, మళ్ళీ తీర్చలేకపోయినప్పుడు పడే వేదన అందరికీ తెలిసిందే. ఎన్నో అవమానాలకు, ఆత్మన్యూనతలకు గురవుతుంటారు. ఈ రోజుల్లో అప్పు తీసుకోవడం మరీ అవసరంగా కూడా మారిపోయింది. వస్తువులు, వాహనాలు కొనడానికి, ఇల్లు కట్టుకోవడానికి, చదువులకు కూడా బ్యాంకులు, సంస్థలు అధికంగా అప్పులు ఇచ్చి తగు మొత్తంలో మళ్ళీ వసూలు చేస్తూ ఉంటాయి. కానీ, మధ్యలో కొందరికి వేర్వేరు రకాల సమస్యల వల్ల అప్పు భారంగా పరిణమిస్తుంది. దీనిని తీర్చుకోవడానికి పలు రకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. తీర్చకుండా శరీరాన్ని వదిలితే కూడా పాపం కలుగుతుంది. లేదా రాబోయే జన్మలో కూడా అప్పులు తీర్చాల్సిన విధమైన జాతకం ఏర్పడి, అటువంటి కుటుంబంలో జన్మించాల్సిన అవసరం కలుగుతుంది. ఇదంతా ప్రకృతిలో జరుగుతున్న ఒకానొక నియంత్రిత చర్య. అందుకే, ఎప్పటి అప్పులు అప్పుడే తీర్చుకొంటే ఏ బాధా వుండదు.

అసలు భగవంతుని సృష్టి అయిన ఈ ప్రకృతిని మనం ప్రతి నిమిషం వినియోగించుకుంటున్నాం. అలా, ఉపయోగించు కోకుండా మనం జీవించలేం. గాలి, నీరు, వెలుతురు, వేడిమి, వృక్ష సంపద అన్నిటినీ వాడుకుంటున్నాం. ఇది కూడా ఒక రకంగా ఋణమే. భగవంతుడు మనకిచ్చిన సంతోషాదులు, ధనం, శారీరక బలాలను వినియోగించి సేవ, దానాదుల ద్వారా ఈ ఋణాలను మనం తీర్చుకుంటూనే ఉండాలి. వేర్వేరు రూపాల్లో ప్రతి ఒక్కరూ లోకానికి వినియోగపడుతూనే ఉండాలి. ఇలా, లేనప్పుడు వారు అప్పుల పాలు అయినట్లే. వీరినుండి పలు రూపాల్లో బలవంతంగా భగవంతుడు లాక్కునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందువల్ల అన్ని రకాల అప్పులు మనం తీర్చాలి. 

ఈ శక్తిని మనం పెంచుకోవడానికి గణపతిని ‘శ్రీ గణేశ ఋణం ఛింధి వరేణ్యం హుం నమ: ఫట్‌' అనే మంత్రంతో జపిస్తే మనం చేసిన ఋణాలన్నీ తీర్చుకునే అవకాశం కలుగుతుంది. దేవఋణం, పితృ ఋణం, ఋషి ఋణాదులను తీర్చుకునే అవకాశం కూడా దీనివల్ల మనకు పెరుగుతుంది. అప్పుల తీవ్రతనుబట్టి ప్రతిరోజూ ఒక గంట నుండి మూడు గంటల వరకూ ఈ మంత్రాన్ని ఉపాసించడం వల్ల శీఘ్ర ప్రయోజనం కలిగి తీరుతుంది. 

- సాగి కమలాకరశర్మ


logo