శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jul 15, 2020 , 23:28:53

అన్యోన్యతే సంసారం

అన్యోన్యతే సంసారం

భార్యాభర్తలు కలిసిమెలిసి ఒకరినొకరు గౌరవించుకోవడమే దాంపత్య ధర్మంగా రామాయణం ఎన్నో సందర్భాలలో నిరూపించింది. ఆలుమగలు అణకువతో పరస్పరం సహకారం, సహనం, సర్దుబాటు కలిగి ముందుకుసాగాలని వాల్మీకి సూచించిన ప్రతిపాదనలు తరతరాలకూ ఆదర్శం. భర్త మాట భార్య కానీ, భార్య మాట భర్త కానీ పెడచెవిన పెడితే వారిరువురికీ కష్ట నష్టాలు తప్పవని మనం గ్రహించాలి.

ఆపత్కాలంలో ఒకానొక యుద్ధరంగంలో దశరథ మహారాజు రథచక్రం చీల ఊడిపోయినప్పుడు కైకేయి తన చేతి చిటికెన వేలు అడ్డుపెట్టి ప్రమాదం జరక్కుండా రక్షిస్తుంది. అప్పుడే భార్య సమయోచిత ప్రజ్ఞకు మెచ్చి దశరథుడు ఆమెకు రెండు వరాలు ఇస్తాడు. వాటిని రామ పట్టాభిషేకం నిర్ణయ తరుణంలో మంథర ప్రోత్సాహంతో ఆమె దశరథుడిని కోరుతుంది. ‘రాముని వనవాసం, భరతుని పట్టాభిషేకం’. భర్తగా భార్యకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు దశరథుడు. రాముని వెంట అడవులకు వెళ్ళటానికి సీతమ్మ సిద్ధమైంది. ‘భర్తకు మాత్రమే వరాలు వర్తిస్తాయని, సీతమ్మ వెళ్ళవలసిన పనిలేదనీ’ వశిష్టుడు కూడా ధర్మసూక్ష్మం చెప్తాడు. రాముడూ భార్యపై అనురాగాన్నీ చూపి, ‘అడవికి వద్దని’ వారిస్తాడు. అప్పుడు తీవ్రంగా స్పందించిన సీతమ్మ, ‘భార్యాభర్తల బంధం’ గురించి విపులంగా మాట్లాడుతుంది. ‘చావైనా, రేవైనా భార్యకు భర్తతోడిదే లోకం, దైవం’ అంటుంది.

సతీ సావిత్రి, అనసూయ, అరుంధతి, అహల్య వంటి ఎందరో పతివ్రతలు ఆచరించిన దాంపత్య ధర్మాలు రామాయణంలో మనకు బోధపడతాయి. రాముని వనవాసం, కైకేయి వరాలను విన్న కౌసల్య, తీవ్ర మానసిక వేదన చెందినప్పుడు సుమిత్ర ఓదారుస్తుంది. తాను ఒక భార్యగా భర్త ఇరకాటంలో ఉన్న వేళ అనుకూల వైఖరితో ఉండాలని ధర్మసూక్ష్మాలను వెల్లడిస్తుంది. అత్రి మహర్షి ఆశ్రమాన్ని సీతా రామలక్ష్మణులు సందర్శించిన సమయంలో వృద్ధ పతివ్రత అనసూయ, వైదేహిల మధ్య సంభాషణలో ‘ఆలుమగల అన్యోన్యత’ చర్చకు వస్తుంది. దంపతుల నివాస స్థానం నగరం, పల్లె, అడవి, గుడిసె ఏదైనా ఉభయులూ ఐక్యంగా ఉండాలని అనసూయ సూచిస్తుందని, షట్కర్మ ఫలాలనూ చెబుతుంది.

దానికి స్పందించిన జానకి, ‘తన రాముడు ప్రతి పరస్త్రీ లో తల్లిని చూడటమే కాక గౌరవిస్తాడనీ, అందుకే కైకేయిని పల్లెత్తు మాట అనలేదని’ భర్తను సమర్థిస్తుంది. ‘ప్రతి స్త్రీ భర్తలో గురువును, స్నేహితుడిని చూడాలి. ఇంటిని ఆనందాల హరివిల్లుగా, పూల తోటలో బొమ్మరిల్లుగా, పండ్ల చెట్ల పొదరిల్లుగా చూడాలి. ఈ ధర్మాన్నే నేనూ నమ్ముతాను’ అని అంటుంది. ‘ఎవరైతే అరుంధతీ వసిష్టుల వలె, రోహిణి చంద్రుని వలె, పార్వతీ పరమేశ్వరుల వలె ఉంటారో వారు పుణ్య స్త్రీలుగా స్వర్గంలోనూ పూజింబడతారని’ దాంపత్య సాఫల్యతను సీతమ్మ తల్లి వివరిస్తుంది.

సీతమ్మ ‘బంగరు లేడి కావాలని’ రాముడిని కోరుతుంది. అది రాక్షసుల మాయగా రాముడు చెప్పినా ఆమె పట్టు వదలదు. అన్నీ తెలిసీ భార్యపై ఉన్న మక్కువతో మాయలేడి కోసం వెళతాడు. దాంతో రావణుడు సీతమ్మను అపహరిస్తాడు. అలాగే, వాలి రెండోసారి యుద్ధానికి వెళ్లేపుడు తార వారిస్తుంది. ఆమె మాట వినక ప్రాణం పోగొట్టుకుంటాడతను. లంకలో సీతమ్మను చూసిన హనుమ, ‘ఆ తల్లిని తన భుజాలపై తీసుకెళతా’నంటాడు. దానికి సీతమ్మ సున్నితంగా తిరస్కరిస్తుంది. రాముని గొప్పదనాన్ని చెప్పి భర్తపై తనకుగల అపార నమ్మకాన్ని చాటుతుంది. మండోదరి కూడా రావణునికి మంచి చెప్పినా వినక చివరకు ప్రాణాలు కోల్పోతాడు. సీతమ్మ అగ్నిప్రవేశం, అడవికి పంపే వేళల్లోనూ ఆ ఆదర్శ దంపతులు ఒకరిపై ఒకరు గౌరవాన్నే పెంచుకుంటారు.


logo