Lemon grass Tea | తేనీటిని మించిన స్నేహశీలి మరోటి లేదని పలువురి నిశ్చితాభిప్రాయం. ఖండాంతరాల్లో అఖండమైన ఘనత వహించిన పానీయంగా మాత్రమే కాదు, ఉప ఖండంలో టీని ఉపయోగించిన వైనం పై వాదనకు మరింత పదును తెస్తుంది. టీని టిఫినీగానూ ఆస్వాదించిన మనవారి ఘనతకు చాయ్ కూడా ఎంతలా వంత పాడిందంటే.. అన్నిటినీ తన సొంతమని భావించింది. అతిథి సత్కారంలో టీకి తోడుగా బిస్కెట్లు ఇవ్వడం మన సంప్రదాయంగా మారింది. ఏ అతిథి రాకున్నా.. సాయంత్రం చాయ్‌లో నంజుకోవడానికి వంటింట్లో డబ్బాలు వెతకడం మనవాళ్ల రివాజు! ఒంట్లో నలతగా ఉందా.. టీ కావాలి! అందులో మెత్తగా ముంచుకొని తినడానికి బ్రెడ్ ఉండాలి!! విభిన్న రుచులు ఆస్వాదించే గుణం ఉన్నవాళ్లు.. ఉష్ణోదక ద్రావకానికి ఘనమైన ఘన పదార్థాలను జతచేర్చి ఆకలిని పరిమార్చుకుంటారు. వేడి తగలగానే చిటపటలాడే అటుకులను ఏకాక్షరితో సంప్రోక్షణ చేసి సాయం సంధ్య వేళ కలిగే చిరు ఆకలిని మాయం చేస్తారు మనవాళ్లు. పిండివంటల్లో ప్రత్యేకత చాటుకున్న చేగోడీలు సైతం తేనీటిలో దూరి, పంటికింద చేరి, గొంతు నుంచి జారి.. జఠరాగ్నిని చల్లబరుస్తాయి. చాయ్‌లో తడిసి ముద్దయిన చపాతీ ఆకలికి చెక్ పెట్టేస్తుంది. ఇరానీ కేఫ్‌లలో టీలోకి నంజుకోవడానికి డజన్ రకాల వెరైటీలు దర్శనమిస్తాయి. ఫుల్ టీలో సింగిల్ బన్ను ముంచేసి తింటే.. ఆ రోజు మళ్లీ ఆకలి వేస్తే ఒట్టు! చక్కెరతో తళతళ మెరిసిపోయే ఫైన్ బిస్కెట్ టీతో పసందుగా ఉంటుంది. కప్పులో ముంచీముంచగానే టీని అంతా లాగేసే.. ఉస్మానియా బిస్కెట్ల కన్నా.. రుచికరమైన ‘టీ’ఫినీ మరేముంటుంది చెప్పండి! ఈ పసందైన ‘టీ’ఫిన్‌లను మనమూ ఆస్వాదిద్దాం!!
కావాల్సినవి: నీళ్లు: నాలుగు కప్పులు, నిమ్మగడ్డి: మూడు కాడలు (పచ్చివి), తేనె: మూడు చెంచాలు (బెల్లం కూడా వేసుకోవచ్చు)
తయారీ: ముందుగా గిన్నెలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి బాగా మరిగించుకోవాలి. అందులో నిమ్మగడ్డి వేసి మరో పది నిమిషాలు మరిగించి, ఆవిరి బయటికి రాకుండా మూతపెట్టేయాలి. కప్పులో తేనె వేసుకొని, తేనీటిని అందులోకి వడకట్టుకోవాలి. చక్కటి పరిమళంతో పసందైన నిమ్మగడ్డి టీ రెడీ!
నిజమైన సైనికుడు తేనీటి వంటివాడు! వేణ్నీళ్లలో తేయాకు సత్తా బయటపడ్డట్టు, యుద్ధంలో సైనికుడి వీరత్వం వెలుగుచూస్తుంది.
– చైనా నానుడి
“Tea | విషం తిన్న వ్యక్తిని కాపాడిన ఛాయ్.. ఎక్స్పైరీ అయిన టీపొడి కూడా ఆరోగ్యమే !”
Bostan Tea Party | అమెరికాకు స్వాతంత్య్రం రావడానికి టీనే కారణమని తెలుసా
Tea History | వాళ్లే చాలా తెలివిగా మనకు ఛాయ్‌ను అలవాటు చేశారు !!
“Green Tea | జుట్టు ఎక్కువగా రాలిపోతున్నప్పుడు గ్రీన్ టీ తాగొచ్చా?”