రీతూవర్మ, సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ‘దేవిక అండ్ డానీ’ వెబ్ సిరీస్ ఈ నెల 6 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరోయిన్ రీతువర్మ మాట్లాడుతూ ‘వెబ్ సిరీస్‌లో నటించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. కాకపోతే ఔట్ ఆఫ్ ది బాక్స్‌గా కాన్సెప్ట్ ఉండాలని కోరుకున్నా. కరెక్ట్‌గా అలాంటి కథే నా దగ్గరకు వచ్చింది. అదే ‘దేవిక అండ్ డానీ’. కథకు తగ్గట్టు సరైన టీమ్ కూడా కుదిరింది. అమ్మాయిలను ‘నువ్వు ఇది చేయలేవ్.. అది చేయలేవ్..’ అని చాలామంది డిస్కరేజ్ చేస్తుంటారు.
అలాంటివారికి ఈ సిరీస్ ఓ పాఠం. అందరూ చూడదగ్గ సిరీస్ ఇది.’ అన్నారు. వినోదం, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన ఈ సిరీస్ ఏడు ఎపిసోడ్స్ ఉంటుందని, దర్శకుడు కిశోర్ అద్భుతంగా తెరకెక్కించాడని, ఓ పల్లెటూరి అమ్మాయి కార్యదీక్షతో ఎలా ఎదిగింది? అనే ప్రశ్నకు సమాధానమే ఈ సిరీస్ అని, రీతువర్మ అద్భుతంగా నటించిందని నిర్మాత సుధాకర్ చాగంటి చెప్పారు. స్క్రిప్ట్ పరంగానే కాక, సాంకేతికంగా కూడా సిరీస్ అద్భుతంగా ఉంటుందని దర్శకుడు బి.కిశోర్ తెలిపారు. ఇంకా మౌనిక, నందిని, డీవోపీ వెంకట్ సి.దిలీప్, సంగీత దర్శకుడు జైక్రిష్, ఎడిటర్ కార్తీక్ కూడా మాట్లాడారు.