Saif Ali Khan | బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడి జరిగిన బాంద్రా నివాసానికి చేరుకొని కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. నిందితుడి కోసం సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించారు. ఈ క్రమంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దాడి ఘటన జరగడానికి రెండు గంటల ముందు వరకూ సైఫ్ నివాసముంటున్న అపార్ట్మెంట్లోకి ఎవరూ ప్రవేశించలేదని తేలింది. సీసీటీవీ ఫుటేజ్‌లో ఎవరూ అనుమానాస్పదంగా కూడా కన్పించలేదు. దీంతో ఇంట్లో ఉన్న వారే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఒక డక్ట్ ఉందని, అది అతని బెడ్ రూమ్‌లో తెరుచుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిందితుడు అక్కడి నుంచే అతని ఇంట్లోకి ప్రవేశించి ఉండొచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
ఇక ఈ దాడిలో సైఫ్ అలీఖాన్‌తోపాటు అతని నివాసంలోని మహిళా సిబ్బంది కూడా కత్తిపోట్లకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సదరు మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు సైఫ్ అలీఖాన్ సిబ్బందిలోని ఐదుగురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మీద దాడి జరిగిన విషయం తెలిసిందే. అతడిపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు. దీంతో ఆయన ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన లీలావతి దవాఖానకు తరలించారు. సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. వెన్నెముక పక్కన కూడా కత్తి పోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో దుండగుడు దొంగతనానికి యత్నించాడని, ఈ క్రమంలోనే సైఫ్‌పై దాడి జరిగినట్లు వెల్లడించారు. 3.30 గంటలకు ఆయనను దవాఖానకు తరలించారని చెప్పారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు సర్జరీ చేస్తున్నారు. శస్త్ర చికిత్స తర్వాతే సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రానుంది.
Also Read..
Saif Ali Khan | బాంద్రాను టార్గెట్ చేస్తున్న దుండగులు.. మొన్న సల్మాన్.. నేడు సైఫ్.!
Saif Ali Khan | ఫ్యామిలీ అంతా సేఫ్‌గా ఉన్నారు.. దాడి ఘటనపై కరీనా టీమ్ స్పందన
Chiranjeevi | సైఫ్ అలీఖాన్‌పై దాడి.. మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారంటే?
Jr NTR | సైఫ్ సర్‌పై దాడి వార్త విని షాక్ అయ్యాను : ఎన్టీఆర్
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌ను ఎక్కడెక్కడ పొడిచాడు.. డాక్టర్లు ఏం చెప్పారంటే !
Saif Ali Khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి.. దవాఖానలో చికిత్స