న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర హోంశాఖ సమగ్రమైన కొత్త విధానాన్ని డెవలప్ చేసింది. ప్రహార్ పేరుతో యాంటీ టెర్రర్ పాలసీని రూపొందించింది. ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొనే రీతిలో ఆ విధానాన్ని తయారు చేశారు. సీమాంతర ఉగ్రవాదం, సైబర్ దాడులు, డ్రోన్ల దుర్వినియోగం, సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ పాలసీని రూపొదించింనట్లు తెలుస్తోంది. కేవలం సీమాంతర ఉగ్రవాదమే కాదు.. ఇతర దేశాల నుంచి భారత్‌పై సైబర్ దాడులకు పాల్పడుతున్న నేరాలను అడ్డుకునేందుకు ఈ ప్రహార్ పాలసీలో ప్రణాళికలు పొందుపరిచారు.
కేంద్ర హోంశాఖ ఇవాళ తన వెబ్సైట్లో ప్రహార్ డాక్యుమెంట్‌ను అప్లోడ్ చేసింది. ఉగ్రవాదాన్ని ఓ మతానికి, ప్రాంతానికి, నాగరికతకు ఆపాదించబోమని ఆ డాక్యుమెంట్లో హోంశాఖ పేర్కొన్నది. స్పాన్సర్ టెర్రరిజం ద్వారా భారత్‌పై ప్రభావం పడిందని, జిహాదీ ఉగ్రవాద సంస్థలు కూడా తమ ప్లాన్‌ను అలాగే అమలు చేస్తున్నాయని ప్రహార్‌లో పేర్కొన్నారు. ఆల్‌ఖయిదా, ఇస్లామిక్ స్టేట్ లాంటి సంస్థలు స్లీపర్ సెల్స్ ద్వారా భారత్‌లో హింసకు ప్రేరేపిస్తున్నాయని పాలసీలో ప్రస్తావించారు.పంజాబ్, జమ్మూకశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో ఉగ్రసంస్థలు డ్రోన్లు వాడి తమ నెట్‌వర్క్‌ను పెంచే ప్రయత్నం చేస్తున్నాయని ఆ పాలసీ డాక్యుమెంట్లో వెల్లడించారు. డిజిటల్ వేదికగా కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు కూడా ప్లాన్ చేశారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విధానంలో భాగంగా కేంద్ర హోంశాఖ ఓ రోడ్‌మ్యాప్ తయారు చేసింది. దర్యాప్తు జరిగే ప్రతి దశలోనూ లీగల్ నిపుణుల సలహా తీసుకోవాలన్నది. ఎఫ్ఐఆర్ల రిజిస్ట్రేషన్, కేసులను బలంగా నమోదు చేయడం అవసరమని ప్రహార్‌లో చెప్పింది. భారతీయ యువతను ఉగ్ర గ్రూపులు రిక్రూట్ చేసుకుంటున్నాయని, అలాంటి వ్యక్తులపై న్యాయపరమైన కఠిన చర్యలను తీసుకోవాలన్నది. తీవ్ర హింసకు పాల్పడినా, యువతను ప్రలోబ పెట్టినా.. ఆ తర్వాత జరిగే పరిణామాల గురించి ఎన్జీవోలో, మతపరమైన నేతలకు వివరించనున్నారు. భద్రతా సమస్యలను ఓ సహకార పద్ధతిలో, సాంకేతికంగా, కమ్యూనిటీ స్థాయిలో పరిష్కరించే రీతిలో సూచనలు చేస్తూ ప్రహార్ డాక్యుమెంట్‌ను రూపొందించారు.
ప్రహార్(PRAHAAR)ను ఈ రకంగా హోంశాఖ విశదీకరించింది.
P ఫర్ ప్రివెన్షన్.. భారత పౌరులను, వారి ప్రయోజనాలను కాపాడేందుకు ఉగ్రవాద దాడులను నిర్మూలించడం
R ఫర్ రెస్పాన్స్.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమయంలో సక్రమ రీతిలో, వేగంగా స్పందించడం
A ఫర్ అగ్రివేటింగ్.. ప్రభుత్వంలోని అంతర్గత సామర్థ్యాన్ని ఒక్కటిగా చేసి సమస్యను పరిష్కరించడం
H ఫర్ హ్యూమన్ రైట్స్.. మానవ హక్కులు, చట్టం ఆధారంగా సమస్యలను తొలగించే ప్రక్రియ
A ఫర్ అట్యునేటింగ్.. ఉగ్రవాదం, రాడికలైషేన్ను నిర్వీర్యం చేసే పరిస్థితుల్ని ఏర్పర్చడం
A ఫర్ అలైనింగ్.. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ ప్రయత్నాలు చేపట్టడం
R ఫర్ రికవరీ.. అందర్నీ కలుపుకుని స్థిరంగా రికవరీ కావడం