ముంబై: ముంబైలోని తన ఇంట్లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై కత్తితో దాడి చేశాడు ఓ దుండగడు. ఇవాళ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో అతనిపై అటాక్ జరిగింది. దొంగతనం కోసం వచ్చిన వ్యక్తి.. హీరో సైఫ్ అలీఖాన్‌పై వాగ్వాదానికి దిగాడని, ఆ తర్వాత కత్తితో అటాక్ చేసినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. సైఫ్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో హీరోను పొడిచాడు. సుమారు ఆరు చోట్ల బలమైన కత్తిపోట్లు ఉన్నట్లు లీలావతి ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు. రెండు చోట్ల మాత్రం ఆ కత్తి పోట్లు చాలా డీప్‌గా ఉన్నట్లు వెల్లడించారు.
తెల్లవారుజామున 2 గంటలకు ఇంట్లో దాడి జరగ్గా.. అతన్ని 3.30 నిమిషాలకు లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారం క్రితం అతను స్విట్జర్లాండ్ నుంచి తిరిగి వచ్చాడు. భార్య కరీనా కపూర్, ఇద్దరు పిల్లలతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు యూరోప్ వెళ్లాడు. ఒక కత్తిపోటు సైఫ్ వెన్నుపూస సమీపంలో డీప్‌గా దిగినట్లు డాక్టర్లు చెప్పారు. మెడ, చేయి, వెన్నులో ఓ పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు డాక్టర్లు తెలిపారు. వెన్నులో దిగిన వస్తువును సర్జరీ ద్వారా తొలగించినట్లు డాక్టర్లు వెల్లడించారు.
న్యూరోసర్జన్ నితిన్ దంగే, కాస్మిటిక్ సర్జన్ లీనా జైయిన్, అనస్థటిస్ట్ నిషా గాంధీ.. ప్రస్తుతం సైఫ్‌కు చికిత్స అందించినట్లు లీలావతి ఆస్పత్రి డాక్టర్ నీరజ్ ఉత్తమని తెలిపారు. సైఫ్ ఇంట్లో పనిచేసే పనిమనిషి చేయికి కూడా కత్తి గాయాలు అయ్యాయి. పోలీసులు ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు. రెండున్నర గంటల పాటు సైఫ్‌కు సర్జరీ చేశారు. ప్రస్తుతం అతను ఆపరేషన్ థియేటర్ రూంలోని రికవరీ రూమ్‌లో ఉన్నాడు.