Saif Ali Khan – Salman Khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మీద దాడి జరిగిన విషయం తెలిసిందే. అతడిపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు. దీంతో ఆయన ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన లీలావతి దవాఖానకు తరలించారు. సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. వెన్నెముక పక్కన కూడా కత్తి పోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో దుండగుడు దొంగతనానికి యత్నించాడని, ఈ క్రమంలోనే సైఫ్‌పై దాడి జరిగినట్లు వెల్లడించారు. 3.30 గంటలకు ఆయనను దవాఖానకు తరలించారని చెప్పారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు సర్జరీ చేస్తున్నారు. శస్త్ర చికిత్స తర్వాతే సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రానుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన ముంబై క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారైన దొంగ కోసం గాలిస్తున్నారు.
అయితే సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన అనంతరం అతడు ఉంటున్న బాంద్రా ప్రాంతం సురక్షితమేనా అని ఇప్పుడు సందేహలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతంలో నివసిస్తున్న బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్‌పై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దాడి జరగడమే కాకుండా.. అతడి మిత్రుడు మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని ఇటీవలే కాల్చి చంపింది. అయితే ఈ ఘటనలతో ఇప్పటికే బాంద్రా ఏరియా హై అలర్ట్ అవ్వగా.. తాజా ఘటన షాక్‌కి గురిచేసింది.
ముంబైలోని బాంద్రా ఏరియా బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ప్రముఖుల నివాసాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీఖాన్‌తో పాటు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, సంజయ్ దత్, రేఖ, జీనత్ అమన్, అనన్య పాండే, ఫర్హాన్ అక్తర్ తదితరులు ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. అయితే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్‌పై బెదిరింపులతో పాటు ఇప్పుడు సైఫ్‌ఫై జరిగిన ఘటనలు చూస్తుంటే.. బాంద్రా ప్రాంతం సురక్షితమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఈ ఘటనలు సీరియస్‌గా తీసుకోకపోతే.. భవిష్యత్తులో మరిన్ని సంఘటనలు జరుగనున్నట్లు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.