న్యూఢిల్లీ, వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి అనుమతి కోసం భారత్ ఎప్పుడూ ఏ దేశంపై ఆధారపడలేదని, ఇటీవలి అమెరికా ఆంక్షల మినహాయింపు భారతదేశ ఇంధన విధానాన్ని నిర్ణయించేదిగా కాకుండా కేవలం కొన్ని అడ్డంకులను మాత్రమే తొలగిస్తుందని కేంద్ర ఉన్నతాధికారి ఒకరు శనివారం తెలిపారు. ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో హొర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన ప్రతిష్ఠంభనతో భారత్ తాత్కాలికంగా 30 రోజుల పాటు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవచ్చునని అమెరికా ఉదారంగా ప్రకటించిన క్రమంలో మోదీ ప్రభుత్వంపై విపక్షాలు, నిపుణులు, మేధావుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో సదరు కేంద్ర ఉన్నతాధికారి స్పందిస్తూ భారత్‌కు ఇచ్చిన మినహాయింపుపై విపక్షాల విమర్శలను తిరస్కరించారు. భారత ఇంధన కొనుగోళ్లు జాతీయ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. ‘ఎక్కడ చమురు లభ్యమైతే అక్కడి నుంచి భారత్ కొనుగోలు చేస్తుంది. ఇతర దేశాల అనుమతిపై భారత్ ఆధారపడ లేదు’ అని ఆ అధికారి స్పష్టం చేశారు.
పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సరఫరాను సులభతరం చేసే ఉద్దేశంతో జల మార్గాలపై ఇప్పటికే పయనిస్తున్న ఓడల్లోని రష్యన్ చమురును కొనుగోలు చేయడానికి భారత్‌కు అనుమతి ఇచ్చినట్లు అమెరికా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా సజావుగా జరుగుతున్నదని, ఇప్పటికే సముద్ర జలాలపై ఉన్న రష్యన్ ఓడల్లోని చమురును తమ మిత్రదేశమైన భారత్ కొనుగోలు చేయడానికి తమ ఆర్థిక శాఖ గురువారం అంగీకరించినట్లు ఆ శాఖ మంత్రి స్కాట్ బెస్సెంట్ శుక్రవారం ఫాక్స్ బిజినెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
భారతీయులు చాలా మంచి నటులు. ఆంక్షలు విధించిన రష్యన్ చమురు కొనుగోలును ఆపాల్సిందిగా భారత్‌ను కోరాం. వారు ఆ పని చేశారు. దాన్ని అమెరికా చమురుతో భారత్ భర్తీ చేయనున్నది. కాని, ప్రపంచవ్యాప్తంగా తాత్కాలిక చమురు అంతరాయాన్ని తగ్గించడానికి రష్యా చమురును కొనుగోలు చేయడానికి భారత్‌కు అనుమతించాము. రష్యాకు చెందిన ఇతర చమురుపై కూడా ఆంక్షలను మేము రద్దు చేయవచ్చు అని బ్రెస్సెంట్ అన్నారు.
న్యూఢిల్లీ: ఇటీవల శ్రీలంక సముద్ర జలాల్లో ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనాను అమెరికా నావికా దళానికి చెందిన సబ్‌మెరైన్ దాడి చేసి ముంచివేసిన క్రమంలో ఇరాన్‌కు చెందిన అలాంటి మరో నౌక ఐరిస్ లావన్‌ను తమ కొచ్చి పోర్టుకు అనుమతించిన విషయాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ శనివారం నిర్ధారించారు.
ఆ నౌకను మానవతా దృక్పథంతో, చట్టపరమైన పరిశీలనతో అనుమతించామని, ఈ విషయంలో భారత్ సరైన పనే చేసిందని ఆయన రైజినా వార్షిక సదస్సులో చెప్పారు. ఇటీవల విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు వచ్చిన పలు ఇరాన్ యుద్ధ నౌకలను యుద్ధ వివాదంలోకి లాగారన్నారు. వాస్తవానికి అవి యుద్ధంలో పాల్గొనేందుకు రాకపోయినా ఫ్లీట్‌లో పాల్గొని తిరిగి వెళ్తుండగా చిక్కుల్లో పడ్డాయన్నారు.