బిజినేపల్లి, ఆగస్టు 6 : గతవారం రోజులుగా నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో హాట్ టాపిక్‌గా మారిన నకిలీ 500 నోట్ల వ్యవహారాన్ని పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఎట్టకేలకు గురువారం ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక బిజినేపల్లి పోలీస్‌స్టేషన్‌లో నాగర్‌కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈనెల 1వ తేదీన మండలంలోని మంగనూర్లో వంగ నవీన్‌గౌడ్, బొల్ల కురుమూ ర్తి అనే ఇద్దరు యువకులు కనకదుర్గా వైన్స్ షాపులో రెండు రూ.500 నకిలీ నోట్లు ఇచ్చి డబ్బులకు సరిపడా బీర్లు కొనుగోలు చేశారు.
ఆ నోట్లపై అనుమానం రాగా క్యాష్ మిషన్ వేయడంలో నకిలీ నోట్లుగా గుర్తించాడని, వెంటనే కౌంటర్లో ఉన్న స్వామి అనే వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడన్నారు. దీంతో గురువారం అప్రమత్తమైన పోలీసులు మంగ నూర్‌కు చెందిన కురుమూర్తి ఇంటికి వెళ్లి నకిలీ నోట్లు తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సై షంషోద్ధీన్లు తనిఖీ చేయగా ఏడుగురు గుమిగూడి ఉండడంతో వారిని విచారణ చేపట్టామన్నారు. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లాలో మీసేవ సెంటర్ నడుపుతున్న నాగరాజు ఆర్థిక ఇబ్బందుల కారణంగా అక్రమమార్గం ద్వారా డబ్బు సంపాదించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఈక్రమంలో అదే జిల్లాకు చెందిన శివవెంకట ధర్మరాజు, అశోక్‌కుమార్, ఏలూరు జిల్లాకు చెందిన సతీశ్‌కుమార్, బిజినేపల్లి మండలం మంగనూర్‌కు చెందిన నవీన్‌గౌడ్‌తో కలిసి నకిలీ నోట్ల తయారీకి సంబంధించిన సామగ్రి సమకూర్చుకొని రూ.2 లక్షల విలువగల నకిలీ 500 నోట్లను తయారు చేసుకున్నారు. గతంలో శివవెంకట ధర్మరాజుకు మంగనూర్‌కు చెందిన నవీన్‌గౌడ్ ఇస్ట్రాగ్రామ్లో పరిచయమై వెయ్యి రూపాయల అసలు నోట్లకు 4 వేల నకిలీ నోట్ల చొప్పున 500 నకిలీ నోట్లను సరఫరా చేయడానికి ఒప్పుకున్నారన్నారు. దీని ప్రకారం నవీన్‌గౌడ్ భీమవరానికి వెళ్లి శివ, నాగరాజు నుంచి రూ.80 వేల విలువగల 500 నకిలీ నోట్లను అసలు రూ.20 వేల ఒరిజినల్ నోట్లు ఇచ్చి తెచ్చుకున్నారు. తీసుకువచ్చిన 80 వేల నకిలీ నోట్లలో కురుమూర్తికి రూ.10 వేలు ఇచ్చారు.
ఇదేక్రమంలో పరారీలో ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన సత్యనారాయణ కూడా మరో రూ.70 వేల నకిలీ 500 నోట్లను ఇవ్వడమే కాకుంగా రూ.30 వేలను నాగరాజు తన వద్దే ఉంచుకున్నాడన్నారు. నకిలీ నోట్లను ప్రజలు గుర్తించ లేరని భావించిన కురుమూర్తి తన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవాలనే ఉద్దేశంతో గ్రామంలోని దాబాలు, మద్యం దుకాణాలు, కిరాణా దుకాణాలు, పెట్రోల్ బంకుల్లో ఉద్దేశ పూర్వకంగా ఈ డబ్బులను చెల్లించాడు. ఈక్రమంలో మంగనూర్ మద్యం దుకాణంలో నకిలీ నోట్లను ఇచ్చిన విషయం బయటపడడంతో ఏడుగురి ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. వీరి వద్ద రూ.68 వేల నకిలీ 500 నోట్లతోపాటు ఏడు సెల్ఫోన్లు, కలర్ జిరాక్స్ మిషన్, కౌంటింగ్ మిషన్, నోట్లు ముద్రించేందుకు ఉపయోగించిన పేపర్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సై షంషోద్ధీన్, సిబ్బంది భీముడు, ప్రవీణ్, రమేశ్, శివ తదితరులు ఉన్నారు.