హైదరాబాద్, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ) : అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాచౌక్‌లో ధర్నాలు చేస్తున్నారు. ముట్టడి పేరుతో రోడ్లపై పరుగులు పెడుతున్నారు. ప్రతిపక్ష నేతల ఇండ్లు, వ్యవసాయ క్షేత్రాలపై దాడులు చేస్తున్నారు. ‘ముట్టడించండి, రోడ్లపై ధర్నాలు చే యండి’ అంటూ కార్యకర్తలకు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ విధానాలు, అనుసరిస్తున్న పద్ధతుల పై రాజకీయ విశ్లేషకులు నిశ్చేష్టులవుతున్నా రు. వారి పిలుపులు, చేష్టలతో ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదా? ప్రతిపక్షంలో ఉన్నదా? అనే సందేహాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటికీ, ఇంకా ప్రతిపక్ష మైండ్‌సెట్ మారలేదనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. అధికారంలో ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషించడం ఒక్క కాంగ్రెస్ పార్టీకే చెల్లిందంటూ ఎద్దేవా చేస్తున్నారు.
అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష మైండ్‌సెట్ మారలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షంలో ఎలా వ్యవహరించిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అచ్చం అలాగే వ్యవహరిస్తున్నదనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదా పు మూడేండ్ల్లు కావస్తున్నా ఆ పార్టీ రాజకీయ శైలి మాత్రం మారలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో ప్రభుత్వాన్ని నిలదీయడానికి ధర్నాలు, నిరసనలు, ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం తమ చేతిలోపే ఉన్నప్పటికీ, అదే పనిని పార్టీ జెండా నీడలో కొనసాగిస్తున్నారన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుల్లెట్ ఫ్రూఫ్ బస్సులు వేసుకొని మరీ ప్రతిపక్ష నేతలైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఫామ్హౌస్లపైకి దాడులకు మాదిరిగా వెళ్లడం, అకడ నిజనిర్ధారణ పేరుతో హంగామా సృష్టించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలను నడిపించే వారే రోడ్డెకి రచ్చ రచ్చ చేస్తుంటే, ఇక వ్యవస్థలపై ప్రజలకు, అధికారులకు ఎలాంటి నమ్మకం ఉంటుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అకడ హైడ్రా పేరుతోనూ, మున్సిపల్ నిబంధనల ఉల్లంఘనల పేరుతోనూ నానా యాగీ చేయడం, అధికారులపై ఒత్తిడి తేవడం, అకడికకడే ప్రెస్మీట్లు పెట్టి విమర్శలు గుప్పించడం వంటి తంతు నడిచింది. ప్రభుత్వం వద్ద సమగ్రమైన రికార్డులు ఉంటే, నేరుగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారనే ప్రశ్నలకు పాలకుల వద్ద సమాధానం కరువైంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ప్రజల దృష్టిని ప్రధాన సమస్యల నుంచి మళ్లించడానికి, మీడియాలో రోజువారీ హైలైట్స్ కోసం మాత్రమే ఈ డ్రామాలు నడిపిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిసున్నాయి. ఒకవైపు అధికారాన్ని, అధికార యంత్రాంగాన్ని చేతులో పెట్టుకొని నిజనిర్ధారణ పేరుతో దండయాత్రలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పక్షమే నిజనిర్ధారణకు డిమాండ్ చేయడం ఏందని, ఇదేం విడ్డూరమనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ అక్రమాలను ప్రశ్నించడం, క్షేత్రస్థాయికి వెళ్లి నిలదీయడం రాజకీయాల్లో సహజం. కానీ, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలే స్వయంగా ప్రతిపక్ష పాత్రను భుజాన వేసుకుని ఫామ్‌హౌస్‌ల వెంట పడుతుండటం చూసి ఆ పార్టీ సొంత నాయకులే తలలు పట్టుకుంటున్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నామో.. అధికార పక్షంలో ఉన్నామో తెలియడం లేదని అంటున్నారు. అధికారం చేతులో పెట్టుకొని ఈ రోడ్లపై పరుగులు పెట్టడం ఏందో అర్థం కావడంలేదని అంటున్నారు. ‘మన చేతిలోనే ప్రభుత్వం ఉన్నది, అధికారులతో ఏ విచారణ అయినా చట్టబద్ధంగా చేయించవచ్చు. కానీ, ఇలా గుంపులుగా రోడ్డెకి రచ్చ చేయడం, రోడ్లపై పరుగులు పెట్టడం, దాడులు చేయడం పట్ల ప్రజల్లో ప్రభుత్వంపై, పార్టీపై విమర్శలొస్తున్నాయి. ప్రజల్లో పార్టీది, ప్రభుత్వానిది ఇజ్జత్ పోతున్నద’ని కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతర్గతంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వద్ద అన్ని రకాల అధికారాలు, ఫైళ్లు అందుబాటులో ఉన్నా, ఇలా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడం చేతకానితనానికి, పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పరిపాలన, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన పాలకులు, కేవలం ప్రతిపక్షంపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రజలు ఎదురొంటున్న అనేక సమస్యలను పరిషరించడం మానేసి, ప్రతిపక్ష నేతల ఆస్తులు, ఫామ్‌హౌస్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఏందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విద్యుత్తు సరఫరాలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సాగునీళ్లు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల, ప్రజల డిమాండ్లు పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన సర్కార్.. కక్ష రాజకీయాలకు పాల్పడుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఈ స్టంట్లు, హడావుడి రాజకీయాలు ఆపి, సమర్థవంతమైన పాలన, రాష్ట్ర ప్రగతిపై శ్రద్ధ పెట్టాలని, లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని విమర్శకులు హెచ్చరిసున్నారు.
పరిపాలనాపరంగా అక్రమాలు జరిగితే చట్టపరమైన విచారణకు ఆదేశించాలి. నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి, విచారణ జరిపి తప్పు తేలితే చర్యలు తీసుకోవాలి. అది బాధ్యత గల అధికార పక్షం చేసే పని. కానీ, దీనికి పూర్తి విరుద్ధంగా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రతిపక్షంపై ఉసిగొల్పుతున్నది. అధికారంలో ఉన్నామనే సోయి మరచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రోడ్లపై రచ్చ రచ్చ చేస్తున్నారు. పిచ్చోళ్ల మాదిరిగా రోడ్లపై పరుగులు తీస్తున్నారు. ప్రతిపక్ష నేతల వ్యవసాయ క్షేత్రాలపై దండయాత్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ గూండాలను వెంటపెట్టుకొని దాడులకు తెగబడుతున్నారు. ఇందుకు మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రం, సిద్దిపేటలోని రంగనాయకసాగర్ వద్ద ఉన్న హరీశ్‌రావు వ్యవసాయ క్షేత్రం, జన్వాడలోని కేటీఆర్ వ్యవసాయ క్షేత్రంపై కాంగ్రెస్ దండయాత్ర చేసింది. స్థాయిని మరచి వీధిరౌడీల్లా రోడ్లపై పరుగులు పెట్టారు. బాధ్యతాయుతమైన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నామనే కనీస స్పృహ లేకుండా ఆయా ప్రాంతాల్లో రచ్చకు దిగారు.
సాధారణంగా ప్రతిపక్ష నేతలు.. ప్రభుత్వాధినేతల అవినీతిపై నిజనిర్ధారణలు, ఆందోళనలు, ఇండ్లపై దాడులు, పరిశీలనకు పిలుపునిస్తుంటారు. కానీ, ఇదేం విచిత్రమో గానీ తెలంగాణలో ఇది పూర్తి రివర్స్‌గా ఉన్నది. అధికారపక్ష నేతనే ప్రతిపక్ష నేతపై ఆందోళనలకు పిలుపునిస్తుండటం గమనార్హం. ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని, ఆయన వ్యవసాయక్షేత్రంపై దాడులు చేయాలని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునివ్వడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.
ఇటీవల ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రాజీనామా డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ధర్నాచౌక్‌లో ప్రభుత్వ పెద్దలు ధర్నాకు దిగడం గమనార్హం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతిపక్ష నేత కేసీఆర్ రాజీనామా డిమాండ్ చేస్తూ ధర్నాచౌక్‌లో ధర్నా చేశారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంపై నిజనిర్ధారణ చేయాలని సీఎం పిలుపునిచ్చారు. అదే విధంగా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వద్ద చావు డప్పు మోగించాలంటూ దళితులను రెచ్చగొట్టి ఉసిగొల్పారు. ఇలా ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రిగా ఉంటూ దాడులు, ధర్నాల సంస్కృతిని ప్రోత్సహించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.