అనుమానాలే నిజమవుతున్నయ్. అనుకున్నదే జరుగుతున్నది. కాంగ్రెస్ భూదాహం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నది. తాజాగా హిల్ట్ ముసుగులో మరో భూదందా వ్యవహారం బయటపడింది. కాలుష్యకారక పరిశ్రమలను తరలించేందుకు ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీ.. రూ.లక్షలాది కోట్ల విలువైన సర్కారీ భూముల దందా కోసమేనని తేటతెల్లమైంది. గోపన్‌పల్లిలోని అల్యూనిమియం ఫ్యాక్టరీ భూముల వ్యవహారం చూస్తే పెద్దల భూబాగోతం ఇట్టే అర్థమవుతున్నది.
ఒకటీ రెండూ కాదు.. ఏకంగా రూ.10 వేల కోట్ల విలువైన 53.14 ఎకరాల విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధమైంది. పరిశ్రమల శాఖ నిబంధనలు, గత ప్రభుత్వం పెట్టిన షరతులకు విరుద్ధంగా.. ప్రభుత్వానికి చెందాల్సిన భూములను పక్కదారి పట్టించేందుకు కొందరు సర్కార్ పెద్దలే పావులు కదుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి యజమానిగా క్లెయిమ్ చేసుకొంటూ కదుపుతున్న ఆ పావులతో ప్రభుత్వ పెద్దలు ఆ భూదందాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో అక్కడ భారీ ఎత్తున వాణిజ్య, నివాసయోగ్యమైన టవర్లను నిర్మించేందుకు బెంగళూరుకు చెందిన ఓ నిర్మాణ సంస్థతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం
పైకి చెప్తున్నది ప్రజాప్రయోజనం.. చేస్తున్నది ఫక్తు రియల్ఎస్టేట్ వ్యాపారం! ఇది మరో కాంగ్రెస్ మార్క్ ల్యాండ్ స్కామ్.. అధికారం అడ్డుగా కమ్ముతున్న పొల్యూషన్!
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ వెస్ట్ సిటీలోని రాయదుర్గంలో ఇటీవల టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఎకరా రూ.267 కోట్ల ధర పలికిన విషయం తెలిసిందే. సరిగ్గా ఆ భూములకు ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో, పాత ముంబై హైవేను అనుసరించి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఆనుకొని ఉన్న భూములు.. అంటే ఎకరా ధర కనీసంగా రూ.200 కోట్లయినా పలుకుతుంది. అలాంటి భారీ విలువ ఉన్న రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామ పరిధిలో అల్యూమినియం ఫ్యాక్టరీకి చెందిన భూములు ఉన్నాయి. గ్రామ పరిధిలోని 95-97, 99/1, 99/2, 101/1, 101/2, 101/3 సర్వేనంబర్లలో 100.35 ఎకరాల భూమి కిషన్‌చంద్ అనే వ్యక్తి డైరెక్టర్‌గా ఉన్న ‘ది కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ లిమిటెడ్’ కంపెనీ పేరిట ఉన్నాయి.
ఆ భూముల్లోని 45 ఎకరాలను కేరళలోని కుందరలో ఉన్న ‘ది అల్యూమినియం ఇండస్ట్రీస్ లిమిటెడ్’ కంపెనీ కి విక్రయించారు. ఈ మేరకు 06.03.1961న బేగంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఆ సమయంలో ఎకరా సుమారు రూ.8,111 చొప్పున 45 ఎకరాలకు గాను రూ.3,65,000 ‘ది అల్యూమినియం ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ’ చెల్లించింది. ఆ తర్వాత అందులో అదే కంపెనీ పేరిట అల్యూమినియం ఉత్పత్తుల ప్రక్రియ కొనసాగింది. ఇదీ మలి అడుగు గోపన్‌పల్లిలోని ఆ అల్యూమినియం కంపెనీ మంచిగానే నడుస్తుండగా, ఉత్పత్తితోపాటు పదుల సంఖ్యలో జనానికి ఉపాధి కూడా లభించింది. దీంతో ఉత్పత్తిని పెంచేందుకు తమ కంపెనీని విస్తరించాలనుకొన్న ఆ యాజమాన్యం తమకు ప్రభుత్వ భూమిని కేటాయించాలని 1966లో అప్పటి ప్రభుత్వాన్ని కోరింది. పారిశ్రామికాభివృద్ధి కోణంలో అప్పటి ప్రభుత్వం భూముల కేటాయింపునకు అంగీకరించింది.
ఈ మేరకు అప్పటికే కంపెనీ ఉన్న 45 ఎకరాలకు తోడు మరో 53.14 ఎకరాలను ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కంపెనీని ఆనుకొని ఉన్న భూములను ప్రభుత్వపరంగా సేకరించే బాధ్యతను పరిశ్రమలు, వాణిజ్యశాఖకు అప్పగించింది. ఆ శాఖ అధికారికంగా ఏపీ భూసేకరణ చట్టం-1994 చట్టం ప్రకారం భూసేకరణ నోటిఫికేషన్ జారీచేసి.. సర్వేనంబరు 90 (14.12 ఎకరాలు), 91 (9.34 ఎకరాలు), 92 (9.13 ఎకరాలు), 93 (9.35 ఎకరాలు), 94 (10.00) సేకరిస్తున్నట్టు ప్రకటించింది. ఆ సమయంలో సంబంధిత రైతులకు పరిహారం కింద రూ.1,63,347 అవార్డును కూడా ప్రకటించింది. అంటే ఎకరాకు సుమారు రూ.3,073 మొత్తాన్ని రైతులకు ప్రభుత్వం చెల్లించింది. ఆ తర్వాత ఆ భూములను ‘ది అల్యూమినియం ఇండస్ట్రీస్ లిమిటెడ్’ కంపెనీకి 22.02.1966న అధికారులు కంపెనీ యాజమాన్యానికి అప్పగించారు. ఇలా 45 ఎకరాలతో మొదలైన అల్యూమినియం ఫ్యాక్టరీ 98.14 ఎకరాలకు విస్తరించింది.

అధికారిక ధ్రువీకరణ పత్రమైన సనద్‌లో ప్రభుత్వం స్పష్టమైన షరతులు విధించింది. సాధారణంగా రిజిస్ట్రేషన్లు చేసే సమయలో సేల్‌డీడ్ అంటే అమ్మకపు డాక్యుమెంట్, అగ్రిమెంట్ డీడ్ అంటే ఒప్పంద పత్రం అని చేస్తారు. ఇదే క్రమంలో ప్రభుత్వం ఏదైనా కంపెనీకి భూములను షరతులతో అప్పగించే సమయంలో ‘సనద్’ రూపంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా అప్పగిస్తుంది. అంటే సదరు భూములను అప్పగిస్తున్నట్టుగా అధికారికంగా ధ్రువీకరించేదే ఈ సనద్. ఈ నేపథ్యంలో 1966లో 53.14 ఎకరాలను అల్యూమినియం ఇండస్ట్రీస్‌కు అప్పగించిన ప్రభుత్వం 1967 సెప్టెంబర్ 8న సనద్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసింది. ప్రభుత్వం తరఫున అప్పటి పరిశ్రమలు, వాణిజ్యశాఖ డిప్యూటీ సెక్రటరీ సీబీ రావు ఆ డాక్యుమెంట్లపై సంతకాలు చేశారు. ఇందుకు గాను అల్యూమినియం ఇండస్ట్రీస్ కంపెనీ ప్రభుత్వానికి రూ.66 వేలు చెల్లించింది. కాగా, పారిశ్రామిక అవసరాల కోసం చేపట్టిన ఈ భూ కేటాయింపునకు సంబంధించి అప్పటి ప్రభుత్వం డాక్యుమెంట్‌లోనే స్పష్టమైన షరతులు విధించింది.
వాస్తవానికి పారిశ్రామిక అవసరాలకే ఆ భూములను వినియోగించాల్సి ఉన్నది. కానీ, ఆ అల్యూమినియం ఫ్యాక్టరీ ఏనాడో మూతబడింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి ఆ భూములను స్వాధీనం చేసుకొని నిర్వహిస్తున్నారు. దశాబ్దాలుగా ఆ భూములను పారిశ్రామిక అవసరాలకు కాకుండా సినిమా షూటింగ్‌లకు అద్దెకు ఇస్తున్నారు. అంటే అక్కడ ఎలాంటి ఉత్పత్తి లేదు. కార్మికులూ లేరు. ఉపాధి లేదు. వివిధ భాషల సినిమాల కోసం భారీ సెట్టింగులకు కంపెనీ భూములను ఇస్తున్నారు. దాంతో ఆ వ్యక్తి ఏటా వందల కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారు. అయినా అధికారులు మాత్రం ఇదేమిటని ప్రశ్నించే దిక్కులేదు. ఇప్పుడు ఇవే భూములు ఐటీ కారిడార్ మధ్యలోకి రావడంతోపాటు వాణిజ్య, నివాసపరంగా ఈ భూములకు భారీ ఎత్తున డిమాండ్ పెరిగింది. దీంతో ఆ భూముల్లో వాణిజ్య, నివాస టవర్లు నిర్మించేందుకు స్కెచ్ వేసిన సదరు యజమాని హిల్ట్ కింద క్రమబద్ధీకరించుకొనేందుకు సర్కార్ పెద్దలను ఆశ్రయించినట్టు తెలిసింది. పైగా ఏపీ నుంచి సైతం రాజకీయంగా పైరవీ చేయడంతో హిల్ట్ పాలసీ కింద సనద్ ద్వారా గతంలో ప్రభుత్వం కేటాయించిన 53.14 ఎకరాలతో సహా మొత్తం భూములను క్రమబద్ధీకరించేందుకు ఫైల్ కూడా సిద్ధమైనట్టు సమాచారం. ఆ భూముల్లో వాణిజ్య, నివాస టవర్లు నిర్మించేందుకు బెంగళూరుకు చెందిన ఒక ఇన్ఫ్రా కంపెనీతో కూడా సదరు యజమాని ఇప్పటికే ఒప్పందం చేసుకొన్నట్టు తెలిసింది.

ప్రాంతం: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామం
గత ప్రభుత్వాలు పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూములకు ఆయా కంపెనీలు అప్పట్లో ధరలు చెల్లించారని, పూర్తి యాజమాన్య హక్కులతో అప్పట్లోనే రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయినట్టు హిల్ట్ పాలసీపై మాట్లాడిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వాళ్లకు పూర్తిగా అమ్ముకొనే స్వేచ్ఛ ఉన్నదని కూడా చెప్పారు. కానీ, అది పూర్తి వాస్తవ విరుద్ధమనేది అల్యూమినియం ఫ్యాక్టరీ భూముల చరిత్రే చెప్తున్నది. 1967లో సనద్ ద్వారా జరిగిన భూ కేటాయింపు డాక్యుమెంట్‌లోనే స్పష్టమైన షరతులు ఉన్నాయి.
ఇది కేవలం ఈ ఫ్యాక్టరీకి సంబంధించదే కాదు.. గతంలో జరిగిన భూ కేటాయింపులన్నీ దాదాపుగా ఇదేరీతిన జరిగాయని, కంపెనీ యాజమాన్యాలు ఇష్టానుసారంగా భూములను విక్రయించేందుకు, ఇతర అవసరాలకు భూములను బదలాయించేందుకు అధికారం, అవకాశమే లేదని ఓ రిటైర్డ్ ఉన్నతాధికారి తెలిపారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీతో ప్రభుత్వానికి చెందాల్సిన విలువైన భూములను సర్కార్ పెద్దలు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి కొల్లగొడుతున్నారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. అల్యూమినియం ఫ్యాక్టరీ భూములకు సంబంధించి సనద్‌లో స్పష్టమైన షరతులు ఉన్నప్పటికీ కంపెనీ యాజమాన్యం పేరిట వచ్చిన క్రమబద్ధీకరణ దరఖాస్తుకు పచ్చ జెండా ఊపేందుకు కసరత్తు చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.