మోర్తాడ్/బాల్కొండ(మోర్తాడ్) ఆగస్టు 6: పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి ఎంతో జరిగిందని ప్రజలందరికీ తెలుసని ఆ పార్టీ నాయకులు అన్నారు. మిగిలిన పనులు కూడా పూర్తయితే వేముల ఎక్కడ ప్రజల గుండెల్లో నిలిచిపోతారోననే భయంతో కాంగ్రెస్ నాయకుడు సునీల్‌రెడ్డి అనవసర ప్రేలాపనలు చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రస్తుతం అభివృద్ధి పనులకు బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు.
మోర్తాడ్‌లో పార్టీ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, బాల్కొండలో పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్‌రెడ్డి స్థానిక నాయకులతో కలిసి గురువారం డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో వేర్వేరుగా మాట్లాడారు. ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను సునీల్‌రెడ్డి పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి 80శాతం అభివృద్ధి పనులు పూర్తిచేశారని, కానీ కాస్తోకూస్తో మిగిలిపోయిన పనులను కాంగ్రెస్ నాయకులు సాకుగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆ పనులకు బిల్లులు రాకుండా అడ్డుకుంటూ, పనులు పూర్తయితే ప్రశాంత్‌రెడ్డికి పేరువస్తుందన్న దురుద్దేశంతో మూడేండ్లుగా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి కారుకుడైన ప్రశాంత్రెడ్డిపైనే నిందలు వేస్తూ పబ్బం గడుపుతున్న సునీల్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. మంత్రులు, అధికారులకు చెబుతూ బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నది సునీల్‌రెడ్డే అని ఆరోపించారు. బట్టకాల్చి మీద వేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితులో లేరని పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని పదేండ్లలో అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ప్రశాంత్‌రెడ్డి తీసుకెళ్లాడన్న విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. మూడేండ్లుగా బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడుతుందంటే, దారికి కారణం సునీల్రెడ్డియే అని విమర్శించారు.
ఇకనుంచైనా నోరు అదుపులో పెట్టుకుని అబద్ధాలు మాట్లాడడం మానుకోవాలని సూచించారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. బాల్కొండలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయగా, మిగిలిన వాటిని అర్హులైన లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మోర్తాడ్ సర్పంచ్ బోగ ఆనంద్, పీఏసీఎస్ చైర్మన్ కల్లెం అశోక్, పాపాయి పవన్, పర్సదేవన్న, శ్రీనివాస్, అశోక్, ఇంతియాజ్, గందం మహిపాల్, సామ శ్రీనివాస్, ఏనుగు రాజేశ్వర్, తౌషిఫ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.