న్యూశాయంపేట, సెప్టెంబర్10: న్యూశాయంపేట బోనమెత్తింది. ఆనవాయితీని కొనసాగిస్తూ.. శ్రావణమాసంలోని చివరి గురువారం రోజున ఊరంతా ఒకేరోజు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. పిల్లాపాపలతో, కుటుంబ సమేతంగా పోచమ్మ దేవాలయానికి చేరుకున్న భక్తులు ‘పోచమ్మ తల్లీ సల్లంగ చూడు’ అంటూ అత్యంత భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించారు.
న్యూశాయంపేట అంతా ఆధ్యాత్మికశోభనను సంతరించుకుంది. పోచమ్మ తల్లి బోనాలను పునస్కరించుకొని పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డీజే పాటలు, పోలీసుల బందోబస్తు మధ్య పోచమ్మతల్లి అమ్మవారి రథం ఊరేగింపు వాడవాడలా సంబురంగా సాగింది. డప్పులు, వాయిద్యాలమోత, భక్తుల నినాదాలతో న్యూశాయంపేట వీధులు మార్మోగాయి. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు.
పోచమ్మబోనాలతో ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో అందరూ ప్రశాంతంగా తల్లిని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పోచమ్మ బోనాలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఎంతో భక్తిశ్రద్దలతో నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, కుడా చైర్మన్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ కార్పొరేటర్ మామిండ్ల రాజు, బీఆర్ఎస్ మాజీ డివిజన్ అధ్యక్షుడు వేల్పుల వేణుగోపాల్, వివిధ పార్టీల నాయకులు పోచమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు.