సినిమా అంటేనే హీరో! హీరో ఉంటేనే సినిమా! సగటు ప్రేక్షకుడే కాదు.. దిగ్గజ దర్శకులు, పేరుమోసిన నిర్మాతలూ నమ్మే సిద్ధాంతమిది.
కానీ, కొందరు హీరోయిన్లు.. ఇది తమకు వర్తించదని నిరూపించారు. నాటి సావిత్రి మొదలుకొని నేటి సాయిపల్లవి వరకు.. సినిమాను శాసించగలిగే శక్తులుగా ఎదిగారు. హీరోలకు దీటుగా.. కొన్నిసార్లు వారికంటే ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రలతో మెప్పించారు. పాటల్లో హీరో పక్కన స్టెప్పులు వేయడమే కాదు.. ఫైట్స్‌తో విలన్స్‌కు చుక్కలు చూపించారు. తమ అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను అలరించారు, ఏడిపించారు, నవ్వించారు. హీరో ఎవరనేది చూడకుండా.. కేవలం తమపేరునే టిక్కెట్లు తెగేలా చేశారు. బాక్సాఫీస్‌ను కొల్లగొట్టి.. అగ్రహీరోలను మించిన వసూళ్లు రాబట్టారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా..
వెండితెరను ఏలిన కొందరు కథానాయికల గురించి!
బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచే..
భానుమతి: మొదటి తరం హీరోయిన్లలో మొదట చెప్పుకోవ్సాలింది.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన భానుమతి గురించి. గంభీరమైన స్వభావం, ఎవరికీ తలవంచని మనస్తత్వం.. భానుమతి సొంతం. అప్పటి అగ్ర హీరోలతో పోటీపడి నటించడమే కాదు.. వారిని మించి పారితోషికం తీసుకునేది. కేవలం నటిగానే కాదు.. దర్శకురాలిగా, రచయిత్రిగా, సంగీత దర్శకురాలిగా, గాయనిగానూ తెలుగు తెరపై తన ప్రతిభను చాటింది. ఎన్టీయార్, ఏఎన్నార్ లాంటి అగ్రనటులు కూడా ఆమె పక్కన నటించేటప్పుడు జాగ్రత్తగా ఉండేవారట. మల్లీశ్వరి, చండీరాణి, బాటసారి, విప్రనారాయణ లాంటి సినిమాలు.. భానుమతి ప్రతిభకు తార్కాణంగా నిలుస్తాయి. ఇక చండీరాణి సినిమాకు దర్శకత్వం వహించడమే కాదు.. ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేసి రికార్డు సృష్టించింది. మొత్తానికి పరిశ్రమలో సెల్ఫ్‌రెస్పెక్ట్ క్యారెక్టర్‌కు నిలువెత్తు రూపం భానుమతి.
సావిత్రి: తెలుగు సినిమా ఉన్నంతకాలం.. మహానటి సావిత్రి పేరు నిలిచి ఉంటుంది. తెలుగులో బయోపిక్ వచ్చిన ఏకైక హీరోయిన్.. సావిత్రి మాత్రమే! హీరోలతో సమానమైన హోదా, పారితోషికం అందుకున్న చరిత్ర ఆమెది. ఎన్టీయార్, ఏఎన్నార్ వంటి దిగ్గజ హీరోలు ఉన్నా.. సావిత్రి కోసమే థియేటర్లకు వెళ్లేవాళ్లు ప్రేక్షకులు! ఇక హేమాహేమీలతో రూపొందిన ‘మాయాబజార్’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందులో దిగ్గజ నటులెందరో ఉన్నా.. ఈ చిత్రరాజంలో హీరో ఎవరంటే.. ‘సావిత్రి’ అనే సమాధానమే వస్తుంది. ఈ సినిమాలో ఆమె అభినయం.. అత్యద్భుతం. దర్శకురాలిగా కూడా ప్రతిభ చాటిన సావిత్రి చిరస్మరణీయురాలు.
తొంభైల్లోకి తొంగిచూస్తే..

శ్రీదేవి: తెలుగు గడ్డపై ‘అతిలోక సుందరి’గానే కాదు.. బాలీవుడ్‌నూ ఏలిన రారాణి అందాల శ్రీదేవి. హీరోలకు తీసిపోని ఇమేజ్‌తో.. ‘ఫిమేల్ సూపర్‌స్టార్’గా వెలుగొందింది. సినిమాలో హీరో ఎవరనే దానితో సంబంధం లేకుండా.. కేవలం శ్రీదేవిని చూసేందుకే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారు. తనకాలంలో అమితాబ్, రజనీకాంత్ లాంటి అగ్ర హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న ఏకైక నటి. శ్రీదేవి నటనా కౌశలానికి ‘వసంత కోకిల’.. ఓ మచ్చుతునక. హిమ్మత్వాలా, మిస్టర్ ఇండియా, చాందినీ, నగీన లాంటి చిత్రాలతో బీటౌన్‌లో టాప్ హీరోయిన్గా ఎదిగింది. ఇక చాలా ఏళ్ల విరామం తర్వాత వెండితెరకు తిరిగి వచ్చినా, తన స్టార్డమ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నది. తన చివరి చిత్రం.. ‘మామ్’లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసి, జాతీయ ఉత్తమ నటిగా నిలిచింది.
విజయశాంతి: నటనలోనే కాదు, కలెక్షన్లు కొల్లగొట్టడంలోనూ హీరోలతో పోటీపడ్డ నటి.. విజయశాంతి. ప్రతిఘటన, కర్తవ్యం, పోలీస్ లాకప్, ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాలు కేవలం విజయశాంతి వల్లే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. 90లలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి అగ్రహీరోల సరసన పోటాపోటీగా నటించింది. డూప్ లేకుండానే సాహసోపేతమైన ఫైట్స్ చేసి ప్రేక్షకులను అబ్బురపరిచింది. 1990లో వచ్చిన కర్తవ్యం సినిమా.. విజయశాంతి కెరీర్లోనే ఓ మైలురాయి. పోలీస్ అధికారిగా ఆమె చూపిన పౌరుషం, నటనకు జాతీయ అవార్డు కూడా వరించింది. నాటి స్టార్ హీరోల సినిమాలకు దీటుగా ఈ సినిమా కలెక్షన్లు రాబట్టింది. ఇక తెలుగు పరిశ్రమలో కోటి రూపాయల పారితోషికం అందుకున్న మొదటి హీరోయిన్ కూడా విజయశాంతే.
నవతరం నాయికల్లో..

Anushka
అనుష్క శెట్టి: నేటితరానికి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను పరిచయం చేసింది.. అనుష్క శెట్టి. ‘అరుంధతి’తో ప్రభంజనమే సృష్టించింది. ఈ సినిమాతో పోటీపడ్డ పెద్దహీరోల చిత్రాలకు దీటుగా కలెక్షన్లు రాబట్టింది. ఆ తర్వాత ‘భాగమతి’, ‘రుద్రమదేవి’ చిత్రాలతో సోలోగానే సినిమాను హిట్ చేయగలనని నిరూపించింది. తన అందం, అభినయంతోపాటు స్క్రీన్ ప్రెజెన్స్లోనూ అగ్రహీరోలకు సవాల్ విసిరింది. బాహుబలిలోనూ ‘దేవసేన’ పాత్రలో.. అటు వృద్ధురాలిగా, ఇటు యువరాణిగా నవరసాలూ పలికించింది. ఇక ఒక్క సినిమా కోసం ఏ హీరోయిన్ కూడా చేయలేని సాహసం చేసింది. ‘సైజ్ జీరో’ కోసం ఏకంగా 20 కేజీల బరువు పెరిగింది. హీరోయిన్గా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే.. ఇలాంటి సాహసం చేసి, వృత్తి పట్ల తనకున్న అంకితభావాన్ని చాటిచెప్పింది.
నయనతార: హీరో అవసరం లేకుండానే.. వంద కోట్ల సినిమాను నడిపించగల సత్తా నయనతారది. ‘లేడీ సూపర్ స్టార్’ బిరుదును సార్థకం చేసుకున్న నటి. దక్షిణ భారతంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఈమెదే అగ్రస్థానం. ఒక్కో సినిమాకు 10 నుంచి 12 కోట్ల దాకా రెమ్యూనరేషన్ అందుకుంటున్నదట. ఇక సినిమా ప్రమోషన్లకు రాకపోయినా.. పోస్టర్‌పై తన పేరుతోనే జనాలను థియేటర్లకు రప్పిస్తున్నది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ‘జవాన్’తో బీటౌన్‌లో అడుగుపెట్టింది. యాక్షన్ సీక్వెన్స్‌లలో షారుక్‌నే మరిపించింది. ‘శ్రీరామరాజ్యం’లో సీతమ్మగా ఆమె చూపిన అభినయం అందరినీ ఆశ్చర్యపరచడంతోపాటు నంది అవార్డునూ అందుకున్నది. ‘రౌడీ పిక్చర్స్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి.. కొత్త దర్శకులను ప్రోత్సహిస్తున్నది. పాత్ర డిమాండ్ చేస్తే.. పూర్తి డీ-గ్లామర్ లుక్‌లోనూ కనిపించడానికి వెనకాడని తతం నయన్‌ది. మొత్తానికి నయనతార అంటే.. ఒక నటి మాత్రమే కాదు. ఒక బ్రాండ్ అనే పేరు తెచ్చుకున్నది.
సాయి పల్లవి: మేకప్ లేకుండానే గ్లామర్‌కి కొత్త నిర్వచనం చెప్పింది సాయిపల్లవి. సహజసిద్ధమైన అందం, అంతకుమించిన అభినయం, అద్భుతమైన నృత్యంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నది. హీరోయిన్ అంటే.. కేవలం గ్లామర్ బొమ్మ అనే పదానికి సాయిపల్లవి పూర్తి వ్యతిరేకం. అందుకే బలమైన పాత్రలనే ఎంచుకుంటుంది. ఫిదా, అరణ్యపర్వం, గార్గి చిత్రాల్లో హీరోలను మించిన పాత్రలు పోషించింది. తొలి సినిమాతోనే.. తెలుగు తెరపై తెలంగాణ యాసకు పట్టం కట్టింది. ఇక డ్యాన్స్ విషయంలో సాయి పల్లవిని కొట్టే నటి ప్రస్తుతం ఎవరూ లేరు. అగ్రహీరోల మాస్ పాటల కన్నా.. తన క్రేజీ డ్యాన్స్‌తో ఎక్కువ పేరు సంపాదించుకున్నది. ముఖ్యంగా, తమిళ స్టార్ ధనుష్ పక్కన ‘రౌడీ బేబీ’ అంటూ ఆమె వేసిన స్టెప్పులతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది. ఇక తెలుగులో ‘సారంగ దరియా’ పాట.. ఆమె నృత్యాభినయం వల్లే యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ కొల్లగొట్టింది.