కరీంనగర్, మార్చి 7(నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం కూలిందని చిల్లరమాటలు మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. వరద కాలువకు, ఇతర ప్రాజెక్టులకు నీళ్లు ఎక్కడినుంచి వస్తున్నాయో చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ టీ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి వద్ద వరద కాలువను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు మోటర్ల ద్వారానే మిడ్‌మానేరు, రంగనాయకసాగర్, పోచమ్మసాగర్, మ ల్లన్నసాగర్తోపాటు వరద కాలువను నింపుతున్నారని తెలిపారు. ఒకవైపు కాళేశ్వరం ప్రా జెక్టు 6, 8 ప్యాకేజీల నుంచి మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తూనే మరోవైపు ప్రాజెక్టు కూలిపోయిందని కాళేశ్వరాన్ని వాడకుండానే దేశంలోనే అత్యధిక పంటలను పండిస్తున్నామని రేవంత్, కొందరు మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
‘కాళేశ్వరం నీళ్లతో రిజర్వాయర్లు నింపుతున్నది నిజం. లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్నది నిజం. అందుకే ఇవాళ వరద కాలువ దగ్గరికి వచ్చి రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తున్నం’ అని చెప్పారు. మేడిగడ్డ కు సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు చేయాలని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినా బీఆర్ఎస్పై పగతో సీఎం రేవంత్ ఉద్దేశపూర్వకం గా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్ ఇప్పటికైనా పిచ్చికూతలు మానుకొని మిగిలిన కాల్వ లు తవ్వి ఆయకట్టును పెంచాలని హితవు పలికారు. తమ హయాంలోనే రూ.2,052 కోట్లు ఖర్చుచేసి ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేశామ ని గుర్తుచేశారు.
కాంగ్రెస్ హయాంలో మిడ్‌మానేరు పనులు కేవలం 25శాతం మాత్రమే జరిగాయని, తమ ప్రభుత్వ హయాంలోనే రూ.1,586 కోట్లు ఖర్చు చేసి, 90శాతం కాంక్రీట్, ఎర్త్ పనులు, వంద శాతం గేట్ల పనులు పూర్తి చేశామని స్పష్టంచేశారు. మరో రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కింద వరద కాలువను సజీవంగా మార్చామని వివరించారు. ఆ తర్వాత మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు పుట్కం రవీంద్రనాథ్ ఠాగూర్, ఎడ్ల అనిల్ ఆధ్వర్యంలో కేసీఆర్ కప్ విజేతలకు బహుమతులు అందజేశారు. చొప్పదండి నియోజకవర్గలోని 500మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరగా పార్టీలోకి ఆహ్వానించారు.
రేవంత్ కర్ణుడు కాదని, కుంభకర్ణుడని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కర్ణుడు మాటతప్పని వాడని, తన కవచ కుండలాలను సైతం దానం చేసిన త్యాగధనుడని, కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం పేదల గుండెల మీద తన్నే దుర్మార్గుడని మండిపడ్డారు. ఖమ్మంలో పేదల ఇండ్లు కూలగొడుతుంటే ఆ విధ్వంసాన్ని చూసి బందోబస్తుకు వెళ్లిన ఒక ఎస్సై కన్నీళ్లు పెట్టుకున్న వీడియో చూసి దేశమంతా చలించినా, రేవంత్‌రెడ్డి మాత్రం వీసమెత్తు కూడా బాధపడలేదని విమర్శించారు.
కట్టడం చేతగాని రేవంత్‌కు కూల్చే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. సకాలంలో చెరువులు నింపకపోవడం వల్ల గోపాల్రావుపల్లి, మల్కపేట గ్రా మాల్లో 500 ఎకరాల్లో పంట దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కరీంనగర్, జగిత్యాల జిల్లాల బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జీవీ రామకృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.
‘కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేసినందుకు మా బతుకులు ఆగమైనయ్.. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నయ్. గంటకోసారి కరెంటు పోతాంది. యూరియా కావాల్నంటే ఓటీపీలు జెప్పుమంటాన్రు. పంట సాగు చేసేదాకా ఒక కష్టం.. సాగు చేసినంక ఇంకోటి.. ఒకటంటే ఇంకొటి ఉంటలేదు. గీ కాంగ్రెస్ కూలిపోతెనే మా కష్టాలు తీరుతయి’ అంటూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాల్రావుపల్లి పరిసర గ్రామాల రైతులు హరీశ్‌రావు ఎదుట గోడు చెప్పుకొన్నారు.
సాగునీరందక పంటలు ఎండి పోతున్నాయనే సమాచారం తెలుసుకున్న ఆయన శనివారం వారి కష్టాలు తెలుసుకునేందుకు స్వయంగా ఆ గ్రామాన్ని సందర్శించారు. రెండెకరాల్లో వరి ఎండిపోయిందంటూ అచ్చంపల్లి శ్రీనివాస్ అనే రైతు హరీశ్‌రావును చూసి బోరున విలపించారు. అనంతరం అక్కడే ఒక చెట్టు కింద కూర్చుని రైతుల బాధలు అడిగి తెలుసుకున్న హరీశ్‌రావు.. అసెంబ్లీలో ప్రస్తావించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
మల్లన్నసాగర్ 25 టీఎంసీలతో కళకళలాడుతున్నదంటే దానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టే. ఆ నీటితో హైదరాబాద్‌లోని మూసీ నదిని శుద్ధి చేసేందుకు రూ.8వేల కోట్లతో టెండర్లు పిలిచారు కదా. కాళేశ్వరమే లేకుంటే ఇదెలా సాధ్యమయ్యేది. కాళేశ్వరం కూలిపోయిందని చెప్పే రేవంత్‌రెడ్డి 20 టీఎంసీలు తరలించి మూసీని ఎలా ప్రక్షాళన చేస్తారు.
– హరీశ్‌రావు