ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై (Saif Ali Khan) గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు. దీంతో ఆయన ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన లీలావతి దవాఖానకు తరలించారు.
సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. వెన్నెముక పక్కన కూడా కత్తి పోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో దుండగుడు దొంగతనానికి యత్నించాడని, ఈ క్రమంలోనే సైఫ్‌పై దాడి జరిగినట్లు వెల్లడించారు. 3.30 గంటలకు ఆయనను దవాఖానకు తరలించారని చెప్పారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు సర్జరీ చేస్తున్నారు. శస్త్ర చికిత్స తర్వాతే సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రానుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన ముంబై క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారైన దొంగ కోసం గాలిస్తున్నారు.