avatar2 | ‘అవతార్ 2’ ఓ యానిమేషన్ అద్భుతం! ఈ కదిలే బొమ్మల కనికట్టు వెనుక ఓ తెలంగాణ యువకుడు ఉన్నాడు. అలా అని అతనేం పెద్దపెద్ద విశ్వవిద్యాలయాల్లో చదువుకోలేదు. ఆదిలాబాద్‌లో పుట్టిపెరిగి.. హైదరాబాద్‌లో రాటుదేలి.. హాలీవుడ్ వరకూ వెళ్లాడు. ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరాన్ ( James camroon )తో కలిసి పనిచేశాడు. ‘అవతార్’ టీమ్‌లో ముఖ్యపాత్ర పోషించాడు.
అతని పేరు రాజశేఖర్ భూపతి ( rajasekhar bhupathi ). అందరూ భూపతి అని పిలుస్తారు. అచ్చమైన ఆదిలాబాద్ వాసి. భూపతికి కార్టూన్లంటే ఇష్టం. టీవీలో రంగురంగుల కార్టూన్లు చూస్తూ పెరిగాడు. అప్పుడే, వాటిని ఎలా రూపొందిస్తారో తెలుసుకోవాలి అనిపించింది. పదేండ్ల వయసులో సమీప బంధువు సాయి ద్వారా ఆ రహస్యమూ తెలుసుకున్నాడు. సాయికి కంప్యూటర్ మీద పట్టు ఉంది. తను గృహాలంకరణల డిజైనింగ్‌లో నిపుణుడు. లేటెస్ట్ టూల్స్‌ను ఉపయోగించి కంప్యూటర్లో వివిధ రూపాలకు ప్రాణం పోయడం అతనే నేర్పించాడు. గురువు దారి చూపాడు. శిష్యుడు చొచ్చుకుపోయాడు. రెండు దశాబ్దాల తర్వాత రాజశేఖర్ ప్రపంచమంతా చెప్పుకొనేంత గొప్ప యానిమేటర్ అయ్యాడు. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ‘అవతార్ 2’ సినిమాకు వీఎఫ్ఎక్స్ కంపోజిటర్‌గా పనిచేశాడు.
రాజశేఖర్ నేపథ్యం గురించి తెలుసుకుంటే.. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఓ సాధారణ కాలేజ్ డ్రాపవుట్. డిగ్రీ మధ్యలోనే వదిలేశాడు. కానీ, తనకు ఇష్టమైన యానిమేషన్లో మాత్రం అపార పరిజ్ఞానం సంపాదించాడు. ఇంటర్మీడియట్ తర్వాత యానిమేషన్ కోర్స్‌లో చేరాలనుకున్నాడు రాజశేఖర్. అదే విషయాన్ని ఇంట్లో చెప్పాడు. కానీ, మూడు లక్షల రూపాయల ఫీజు కట్టాలి. వాళ్ల దగ్గరేమో అంత డబ్బు లేదు. దీంతో, సాధారణ డిగ్రీ కోర్సులోనే చేరాడు. కానీ, ఇష్టంలేని చదువులో ఎంతోకాలం నెట్టుకురాలేక
పోయాడు. బ్యాగు సర్దుకుని హైదరాబాద్ వచ్చేశాడు. ఒక యానిమేషన్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. తెలిసినవాళ్లు తమ తీరిక సమయంలో యానిమేషన్లో లైటింగ్, కంపోజింగ్ టెక్నిక్స్ ఉచితంగా నేర్పారు. కాకపోతే ఒకరు మణికొండలో ఉండేవారు, ఇంకొకరు కృష్ణానగర్‌లో ఉండేవారు. సిటీబస్ పట్టుకుని పరిగెత్తేవాడు. పొట్టకూటి కోసం చిన్నచిన్న ఉద్యోగాలు చేసేవాడు. పొదుపు చేసుకున్న డబ్బుతో మరిన్ని సాంకేతిక అర్హతలు సాధించాడు. కొన్ని యానిమేషన్, కార్టూన్ సినిమాలకు పనిచేశాడు. అంతలోనే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉన్న వెటా ఎఫ్ఎక్స్ కంపెనీలో అవకాశం వచ్చింది. ఈ తెలంగాణ బిడ్డ ప్రతిభకు మెచ్చి జేమ్స్ కామెరాన్ ‘అవతార్ 2’ ప్రాజెక్ట్‌కు ఎంపిక చేశారు. ‘జీవితకాలం గుర్తుంచుకోవాల్సిన అనుభవం ఇది. కామెరాన్ ఓ మహాసృష్టి కర్త. అతి సున్నితమైన విషయాలను కూడా గమనిస్తాడు. రాజీపడటం తెలియదు. యానిమేషన్లో ఆయనే నాకు స్ఫూర్తి’ అంటాడు భూపతి.
ఈ ప్రయాణంలో తన సహచరి ప్రతిభ ప్రోత్సాహమూ ఉందని చెబుతాడు రాజశేఖర్. ఆ యువకుడి చదువంతా తెలుగు మీడియంలోనే సాగింది. పనిచేసే చోట ఇంగ్లిష్ రాకపోవడం పెద్ద సమస్యగా పరిణమించింది. మునుపటితో పోలిస్తే.. వ్యక్తీకరణ మెరుగుపడినా.. అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవాలంటే చాలా సమయమే పడుతుంది. రాజశేఖర్ ముందున్న అతిపెద్ద సవాలు ఇదే. భారత్‌లో అయితే హిందీతో పని లాగించవచ్చు. కానీ, ఆస్ట్రేలియాలో అది అసాధ్యం. అన్ని పరిస్థితుల్లోనూ గడగడా ఇంగ్లిష్ మాట్లాడేయాలన్నది తన సంకల్పం. జీవితాన్ని గెలిచినవాడికి భాష ఒక లెక్కా. త్వరలోనే భూపతి అసలు సిసలు ‘అవతార్3’ చూడబోతున్నాం.
“Daily labour App | క్యాబ్‌ల కోసమే కాదు లేబర్స్ కోసమూ ఓ యాప్.. క్రియేట్ చేసిన జనగామ బిడ్డ”
“komera ankarao | మనుషులకు ఆయువునిచ్చే అడవులకు అండగా మారిన తెలుగోడు”