Daily labour | కరోనాతో పేద, మధ్యతరగతి జీవితాలు తలకిందులయ్యాయి. కూలీనాలీ చేసుకొని బతికేవారు రోడ్డున పడ్డారు. వారిలో ముంబై నుంచి తిరిగొచ్చిన అతని తల్లిదండ్రులు, బంధువులూ ఉన్నారు. ఆ బాధలోంచే ఓ ఆవిష్కరణ పుట్టింది. రోజువారీ కూలీలకు ఓ వేదికను పరిచయం చేసి, చేతినిండా పని కల్పిస్తున్నాడు జనగామ వాసి.. మల్లేశ్ దయ్యాల. ఆ ఆవిష్కరణే ‘డైలీ లేబర్’ యాప్.
మార్కెట్లో చేయడానికి కావల్సినంత పని. కానీ కూలీలు దొరకరు. అడ్డాలో ఎంతోమంది కూలీలు. అందరికీ పని లభించదు. ఆ డిమాండ్, సప్లై మధ్య వారధిగా ‘డైలీ లేబర్’ యాప్‌ను నిర్మించాడు జనగామకు చెందిన మల్లేశ్ దయ్యాల. రెండు వైపులా ఉన్నవారి అవసరాలను కనెక్ట్ చేస్తుందీ మొబైల్ అప్లికేషన్. పది నెలల క్రితమే ఈ యాప్‌ను ప్రారంభించాడు మల్లేశ్. ఇది హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్. అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతుంటే.. కూలీలు మాత్రం ఇంకా రోడ్లమీద ఎందుకు నిలబడాలి? అనే ఆలోచన మల్లేశ్‌కు ఈ బిజినెస్ ఐడియాను ఇచ్చింది. వలసలతో పనిలేకుండా.. శ్రామికులున్న ప్రాంతంలోనే పని కల్పించడం తన లక్ష్యమని చెబుతాడు ఈ ఆంత్రప్రెన్యూర్. గంటలో పూర్తయ్యే పని నుంచి నెల రోజుల కాంట్రాక్ట్ వరకు.. ఏదైనా ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇంటి పనివారి నుంచి భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రీలు, లోడింగ్ హెల్పర్లు, జనరల్ హెల్పర్లు, కుక్‌లు, డ్రైవర్లు, టెక్నీషియన్లు, మెకా నిక్‌లు, వ్యవసాయ కూలీలతో పాటు అన్నిరకాల శ్రామికులూ అందుబాటులో ఉంటారు. పని ఏదైనా సరే.. సమయానికి మనుషులను అందిస్తుంది ‘డైలీ లేబర్’. కాకపోతే.. పని కావాల్సినవారు, పని చేయించు కోవాల్సిన వారు.. ఇద్దరూ ఈ యాప్ ద్వారా తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
మల్లేశ్‌ది జనగామ జిల్లా లింగాల ఘన్పూర్. తల్లిదండ్రులు ముంబైలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసేవారు. పని ఉన్నరోజు వెళ్లడం, లేనిరోజు ఖాళీగా ఉండటం.. పరిపాటిగా మారింది. దీంతో సంపాదన అంతంతమాత్రంగానే ఉండేది. ముంబై మహానగరంలో బిడ్డను చదివించే స్తోమత లేక.. స్వగ్రామానికి పంపారు. దీంతో హైస్కూల్ వరకూ జనగామలోనే చదివాడు మల్లేశ్. ఇంటర్ కోసం హైదరాబాద్ వచ్చాడు. బీటెక్ వరంగల్‌లో పూర్తయింది. తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా బాగా చదువుకున్నాడు. సాఫ్ట్వేర్ కొలువు సాధించి ముంబై వెళ్లాడు మల్లేశ్. అక్కడే బ్యాంక్ ఆఫ్ అమెరికా, మోర్గాన్ స్టాన్లీ, టెక్ మహీంద్రా వంటి కంపెనీల్లో పనిచేశాడు. న్యూయార్క్, ఫ్లోరిడాలకూ వెళ్లాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పదిహేనేండ్ల అనుభవం సాధించాడు మల్లేశ్. కరోనా సంక్షోభంలో జనగామకు వచ్చాడు. చేతినిండా పనిలేక ఇబ్బందిపడేవారిని దగ్గర నుంచీ గమనించాడు. గతంలో తన తల్లిదండ్రులు అనుభవించిన కష్టాలు ఎవరికీ రాకూడదనే ఉద్దేశంతో ‘డైలీ లేబర్’ యాప్‌కు రూపకల్పన చేశాడు.
ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా.. తెలుగు రాష్ర్టాల్లోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలతోపాటు ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కొచ్చిలోనూ ‘డైలీ లేబర్’ సేవలు అందుతున్నాయి. త్వరలోనే దేశమంతా విస్తరించాలనే ఆలోచనలో ఉన్నాడు మల్లేశ్. ఆ ఉద్దేశంతోనే హిందీ, ఇంగ్లిష్, తెలుగుతో పాటు అన్ని స్థానిక భాషల్లో తన యాప్‌కు ప్రాణంపోస్తున్నాడు. ఒక్కసారి రిజిస్టర్ అయితే కమీషన్లు ఏమీ ఉండవు. యజమానిని, కూలీలను కనెక్ట్ చేయడం వరకే యాప్ పని. రేట్లు వాళ్లే మాట్లాడుకుంటారు. మొత్తం 38వేల డౌన్‌లోడ్స్‌లో 30వేలకు పైగా కూలీలు పేరు రిజిస్టర్ చేసుకున్నారు. దాదాపు 8వేల మంది మేస్త్రీలు, కాంట్రాక్టర్లు, యజమానులు నమోదయ్యారు. ఈ పది నెలల్లోనే రోజుకు 300 మందికిపైగా చేతినిండా పని కల్పిస్తున్నాడు మల్లేశ్.
ఇప్పటివరకూ దినసరి కార్మికులు సంఘటిత రంగంలోకి రాలేదు. డైలీ లేబర్ యాప్‌తో ఆ కొరత తీరింది. మా యాప్ ద్వారా పని కావాలన్నా, పని చేయించుకోవాలన్నా కచ్చితంగా టూ స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఫోన్ నంబర్‌తో పాటు ఆధార్ వంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. దీనివల్ల ఓ ఉపయోగం ఉంది. కూలీలను యజమానులు మోసం చేసినా, యజమానులు కూలీలను మోసం చేసినా న్యాయపరంగా వెళ్లేందుకు మేం సాయం చేస్తాం. ఈ యాప్‌కు ఓ రూపమిచ్చి, జనంలోకి తీసుకొచ్చేందుకు దాదాపు రూ.40 లక్షల వరకూ ఖర్చు చేశాను. నా శ్రమ వృథాగా పోలేదు.
– మల్లేశ్ దయ్యాల, డైలీ లేబర్ యాప్ సీఈఓ
… రవికుమార్ తోటపల్లి
“komera ankarao | మనుషులకు ఆయువునిచ్చే అడవులకు అండగా మారిన తెలుగోడు”