pralhad chhabria | గొప్పవాళ్ల జీవితాల్లో అందరికీ తెలిసిన విజయాలు, కొందరికి తెలిసిన పరాజయాలే ఎక్కువ. కానీ, సాధారణ సినిమాపై డాక్యుమెంటరీలు, జీవిత చరిత్రలు పైచేయి సాధిస్తున్న వేళ.. ‘ప్రహ్లాద్’ ఓ ప్రయోగంలా వచ్చింది. ఇది జీవిత చరిత్రే అయినా జీవితం మొత్తాన్నీ చూపించాలన్న పిచ్చిప్రయత్నం ఎక్కడా కనిపించదు. ఎమోషన్స్‌ను పండించడానికి పనికట్టుకుని ట్రాజెడీని భూతద్దంలో చూపలేదు. ఫినొలెక్స్ వ్యవస్థాపకుడు ప్రహ్లాద్ పి. ఛాబ్రియా జీవితంలోని ఒక ఘట్టాన్ని మాత్రమే కళ్లకు కట్టేందుకు ప్రయత్నించాడు దర్శకుడు శయన్ ముఖర్జీ . ఏకంగా గుండెల్నే తడిమింది ఆ అధ్యాయం.
ఫినొలెక్స్.. వేలకోట్ల విలువైన పరిశ్రమ. అంతపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ప్రహ్లాద్ పి. ఛాబ్రియా కెరీర్ పది రూపాయల నోటుతో మొదలైంది. అతని వెనుక తాతలూ తండ్రులూ లేరు. అతని డీఎన్ఏలో వ్యాపార పదార్థమూ లేదు. అవిభక్త భారతంలోని.. కరాచీలో అమ్మ ఉండేది. నాన్న చిన్నప్పుడే మరణించాడు. దుర్భర దారిద్య్రం. జేబులో పది రూపాయలు మాత్రమే ఉన్నా, మెదడులో మాత్రం లక్షల విలువైన ఆలోచనలు. ఎలాగైనా సరే.. బతకాలన్న పట్టుదల తప్పిస్తే, జీవితం పట్ల పెద్దగా ఆశలూ లేవు. ఆ లక్ష్యంతోనే.. పద్నాలుగేండ్ల వయసులో సొంతూరి నుంచి రైలులో బయల్దేరాడు ప్రహ్లాద్. ఆ ప్రయాణం ఇతివృత్తంగా తీసిన ‘ప్రహ్లాద్’ షార్ట్ ఫిల్మ్.. ప్రహ్లాద్ వ్యక్తిత్వాన్ని చాటి చెప్పింది.
* * *
అది స్వాతంత్య్రోద్యమ కాలం. ఆకలి నుంచి విముక్తిని కోరుతూ భారత వాణిజ్య రాజధానికి ప్రయాణ మయ్యాడు ప్రహ్లాద్. అమృత్సర్ జంక్షన్లో రైలెక్కాడు. అతని జేబులో పది రూపాయలు ఉన్నాయి. ఆ నోటే ప్రహ్లాద్ గుండె ధైర్యం. అంతలోనే పచ్చజెండా ఊగింది. రైలు కదిలింది. తోటి ప్రయాణికులు ఆయనతో ప్రేమగా మాట్లాడారు. పక్కనే కూర్చున్న మరాఠీ మహిళ మాటలు కలిపింది. ఎదురు సీట్లోని పెద్దమనిషి తన కుమార్తెను ముంబైలో డాక్టర్‌కు చూపించడానికి తీసుకువెళ్తున్నానని చెప్పాడు. ఓ నిరుద్యోగి వ్యథనూ ఓపిగ్గా విన్నాడు ప్రహ్లాద్. ఆ నిరాశావాది మాటల్ని నమ్మితే వెనుదిరగాల్సిందే. కానీ ప్రహ్లాద్ ఆ ప్రభావానికి లొంగలేదు. పది రూపాయలతో ప్రపంచాన్ని గెలవాలనే సంకల్పాన్ని వదిలిపెట్టుకోలేదు. ఎక్కడా రాజీపడలేదు.
* * *
చుకుబుకుల జోలపాట మధ్య బోగీలోని ప్రయాణికులంతా నిద్రపోయారు. వారితోపాటు ప్రహ్లాద్ కూడా. అంతలోనే తెల్లవారి పోయింది. తినడానికి ఏదో ఒకటి కొనుక్కుంటున్నారు చాలామంది. ప్రహ్లాద్‌కు కూడా ఏదో ఒకటి తినాలనిపించింది. జేబులో చేయిపెడితే.. పది రూపాయలు లేవు. భయపడ్డాడు. ఏడ్చాడు. తన గోడు టికెట్ కలెక్టర్‌తో చెప్పుకొన్నాడు. చివరికి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది వ్యవహారం. ఆ పది రూపాయలే అతని బలం. ధైర్యం. మరొకరైతే.. నోటుతోపాటు బతుకు మీద నమ్మకాన్నీ కోల్పోయే వారు. ప్రహ్లాద్ స్వభావం వేరు. ఓ సహ ప్రయాణికుడు తన డబ్బును కొట్టేశాడని ప్రహ్లాద్‌కు అర్థమైపోయింది. ఆ విషయాన్ని పోలీసులకు కూడా చెప్పాడు. ‘ఏమిటి సాక్ష్యం’ అడిగాడు హస్తలాఘవం ప్రదర్శించిన వ్యక్తి. ‘నా పది రూపాయల నోటు నంబరెంతో చెబుతాను.
చెక్ చేసుకోండి. తేడా ఉంటే.. ఆ పైసలునాకొద్దు’ అంటూ పొల్లుపోకుండా చెప్పేశాడు. ఒక్క అంకె కూడా అటూ ఇటూ కాలేదు. తన నోటు తన చేతికొచ్చింది. ఆ తర్వాత, జీవనాధారం కోసం ఓ బట్టల దుకాణంలో చేరాడు. అనేక అవరోధాలను అధిగమించి.. ఫినొలెక్స్ వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమను స్థాపించాడు. వ్యవసాయ రంగానికి తనవంతు సాయం చేశాడు. హోప్ ఫౌండేషన్ ద్వారా పేదలకు సాయం అందించాడు.
సాజ్ అగర్వాల్ రాసిన ప్రహ్లాద్ పి. ఛాబ్రియా జీవిత చరిత్ర ‘దేర్ ఈజ్ నో సచ్ థింగ్.. యాజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్’ ఆధారంగా ‘ప్రహ్లాద్’ లఘు చిత్రానికి ప్రాణంపోశారు. నిర్మాణ సమయంలో శుభాంగ్ మోషన్ పిక్చర్స్‌కు ఫినొలెక్స్ కంపెనీ ఆర్థిక సహాయం అందించింది. ఈ షార్ట్ ఫిల్మ్ విడుదలైన కొద్ది నెలలకే అనేక అంతర్జాతీయ చిత్రోత్సవ వేదికలపై ప్రశంసలందుకుంది. ‘లాఖోం మే ఏక్’ ఫేమ్ రిత్విక్ సాహోర్ ప్రహ్లాద్ పాత్రలో నటించాడు. అబిద్ షమీమ్, అన్నపూర్ణ సోని, చిన్మయ్ దాస్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ షార్ట్ ఫిల్మ్ పరాగ్వే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, లండన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఫెస్టివల్, మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికై అనేక అవార్డులు గెలుచుకుంది.
“Suresh Raina | టాలెంట్ మాత్రమే సరిపోదు.. తన సక్సెస్ సీక్రెట్ ఏంటో రివీల్ చేసిన సురేశ్ రైనా”