yoganathan | ఒక సంవత్సరం కరిగిపోతున్నదంటే.. ‘ఈ ఏడాది ప్రభావశీలురైన వ్యక్తులు ఎవరా?’ అని ఇంటర్నెట్లో సెర్చింగులు మొదలవుతాయి. ఎలాంటి వెతుకులాట లేకుండా ఈ ఏడాది మేటి వ్యక్తిగా ఎంపికయ్యారు యోగనాథన్. ‘ప్రకృతి పరిరక్షకుల’ విభాగంలో సీఎన్ఎన్-న్యూస్18 సంస్థ ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’గా ఆయన పేరును ప్రకటించింది. పచ్చదనం కోసం యోగనాథన్ సాగించిన ప్రస్థానమే ఎన్నో పురస్కారాలతోపాటు అవార్డునూ సొంతం చేసుకునేలా చేసింది.
తమిళనాడుకు చెందిన యోగనాథన్ ఎస్టీసీ బస్ కండక్టర్గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి చెట్లంటే ప్రాణం. ఆ చెట్ల నీడలో కూర్చొని కవితలు రాసుకోవడం అంటే చాలా ఇష్టం. పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ చెట్లు బక్కచిక్కిపోవడం గమనించారు. చెట్ల నీడ తగ్గడం గుర్తించారు. యోగనాథన్ మనసు చివుక్కుమంది. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలకు నిలువ నీడ ఉండదని భావించారు. తనవంతుగా ఏదైనా చేయాలని సంకల్పించారు.
ఇదిలా ఉండగా, ప్రకృతికి ఆటపట్టులాంటి నీలగిరి కొండల్లో అటవీసంపద నానాటికీ తగ్గిపోతున్నదన్న వార్తలు యోగనాథన్ను కలచివేశాయి. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ల అక్క ఊరికి వెళ్లినప్పుడు ఆ కొండల్లో జరుగుతున్న అక్రమాలను ప్రత్యక్షంగా చూశారు. వంటచెరుకు కోసం పచ్చని చెట్టును కొడుతున్న గ్రామీణులు కనిపించారు. కోట్ల సంపద కోసం భారీ వృక్షాలను కూలదోస్తున్న స్మగ్లర్లనూ చూశారు. తల్లిలాంటి అడవిని నాశనం చేసుకోవద్దని గ్రామీణులకు అర్థమయ్యేలా చెప్పారు. వాళ్లూ సరేనన్నారు. కానీ, స్మగ్లర్ల ఆట కట్టించలేకపోయారు. వారిని అడ్డుకునే లక్ష్యంతో నలుగురినీ కలుపుకొని ఉద్యమాలు చేపట్టారు. అందులో కొంత సఫలమయ్యారు కూడా!
ప్రకృతి పరిరక్షణకు తనవంతుగా మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నారు. ఏదో పది మొక్కలో, పదిహేను మొక్కలు నాటి ఊరుకోలేదు. 1985 నుంచి నేటి వరకు ఏకంగా లక్షాయాభైవేల మొక్కలు నాటారు యోగనాథన్. ఆయన నాటిన మొక్కల్లో 70 శాతం ఇప్పుడు చెట్లుగా పెరిగాయి. వాటిలో సగం వృక్షాలుగా ఎదిగాయి. ఎవరి నుంచి ఆర్థిక సాయం ఆశించకుండా తన సంపాదనలో 40 శాతం పచ్చదనం కోసం వెచ్చిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యాన్ని వివరిస్తూ పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ‘ప్రతి వ్యక్తి తన పుట్టిన రోజు నాడు ఒక మొక్క నాటాలి’ అని పిలుపునిచ్చారు. పిల్లలను, యువతను, గ్రామీణులను, పట్టణవాసులను, ప్రభుత్వాలను పచ్చదనం దిశగా అడుగులు వేయించి ‘ట్రీ మ్యాన్ ఆఫ్ తమిళనాడు’గా గుర్తింపు పొందారు యోగనాథన్. తాజాగా ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’గా మరో కీర్తి గడించారు.
“Suresh Raina | టాలెంట్ మాత్రమే సరిపోదు.. తన సక్సెస్ సీక్రెట్ ఏంటో రివీల్ చేసిన సురేశ్ రైనా”