Liquor | ఇటీవల కాలంలో ఏ వేడుక జరిగినా మద్యం వినియోగం సాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా వివాహ వేడుకల్లో అయితే విచ్చలవిడిగా మద్యం సేవించడం కనిపిస్తోంది. మద్యం మత్తులో కొందరు హద్దులు దాటి ప్రవర్తించడం వల్ల గొడవలు, అశాంతి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలని ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామ సర్పంచ్ వినూత్న నిర్ణయం తీసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డోయీవాలా నియోజకవర్గ పరిధిలో గడుల్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామ సర్పంచ్ స్వీటీ రావత్ వివాహ వేడుకల్లో మద్యం వినియోగాన్ని అరికట్టాలని సంకల్పించారు. ఇందుకోసం ఆమె ప్రత్యేక ప్రోత్సాహక పథకాన్ని అమలు చేస్తున్నారు.
మద్యం పంపిణీ చేయకుండా పెళ్లి జరిపే కుటుంబాలకు రూ.51 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పటివరకు రెండు కుటుంబాలు ఈ నిబంధనను పాటించగా, వారికి నగదు బహుమతిని అందజేశారు. శుభకార్యాల్లో మద్యం అందించడం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతున్నాయని, యువత మద్యానికి అలవాటు పడే ప్రమాదం ఉందని స్వీటీ రావత్ అభిప్రాయపడ్డారు. సమాజంలో మంచి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. గ్రామ ప్రజల నుంచి కూడా ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని చెప్పారు. ఆమె చేస్తున్న ఈ ప్రయత్నాన్ని జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులు ప్రశంసించారు.
ఇదే తరహా ప్రయత్నం గతంలో కూడా ఉత్తరాఖండ్‌లోనే జరిగింది. తెహ్రి జిల్లాలోని దేవ్‌ప్రయాగ్ గ్రామంలో మద్యం లేకుండా వివాహం నిర్వహిస్తే వధువుకు రూ.10 వేల నగదు బహుమతి ఇస్తామని స్థానిక పోలీసులు ప్రకటించారు. ఆ మొత్తాన్ని పోలీసులే స్వచ్ఛందంగా విరాళాల రూపంలో సమకూర్చి అందించారు. ఈ చర్యలు సమాజంలో మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్న సానుకూల అడుగులుగా భావిస్తున్నారు.