ఆదివారం 07 మార్చి 2021
Business - Jan 12, 2021 , 20:02:19

సౌదీ టీసీఎస్‌లో జీఈ వాటా టీసీఎస్ వ‌శం

సౌదీ టీసీఎస్‌లో జీఈ వాటా టీసీఎస్ వ‌శం

న్యూఢిల్లీ: భార‌త ఐటీ దిగ్గ‌జం టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టీసీఎస్‌) తాజాగా, సౌదీ అరేబియాలోని టీసీఎస్ యూనిట్‌లో జీఈ వాటాను కైవసం చేసుకున్న‌ట్లు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. టీసీఎస్ సౌదీ అరేబియాలో జీఈ వాటా విలువ సుమారు రూ.9.13 ల‌క్ష‌లు (12,471 డాల‌ర్లు) ఉంటుంది. 2013 సెప్టెంబ‌ర్‌లో జీఈ భాగ‌స్వామ్యంతో సౌదీ అరేబియా రాజ‌ధాని రియాద్ న‌గ‌రంలో పూర్తిగా మ‌హిళ‌ల‌తో బిజినెస్ ప్రాసెస్ స‌ర్వీసెస్ సెంట‌ర్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 

తాజాగా ఈ యూనిట్ నుంచి వైదొల‌గాల‌ని జీఈ ప్ర‌ణాళిక రూపొందించుకున్న‌ద‌ని, భాగ‌స్వాములు టీసీఎస్‌లోని జీఈ వెంచ‌ర్ పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌కు సంబంధించి ఒప్పందంపై సంత‌కాలు చేశాయని నియంత్ర‌ణ సంస్థ‌ల వ‌ద్ద దాఖ‌లు చేసిన రెగ్యులేట‌రీ ఫైలింగ్‌లో పేర్కొంది. వాటాల బ‌దిలీ పూర్త‌యితే రియాద్‌లోని ప్రాసెసింగ్ యూనిట్‌కు సంబంధించి పూర్తి బాధ్య‌త‌లు టీసీఎస్ నిర్వ‌ర్తించాల్సి ఉంటుందని తెలిపింది. 

జ‌న‌ర‌ల్ ఎల‌క్ట్రిక్ ఇంట‌ర్నేష‌న‌ల్ (బెనెల‌క్స్) బీవీ) అనుబంధ సంస్థ సౌదీ డ‌స‌ర్ట్ రోజ్ హోల్డింగ్ బీవీకి, టీసీఎస్ సౌదీ అరేబియాలో 24 శాతం వాటా ఉంది. మిగ‌తా 76 శాతం వాటా టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ నెద‌ర్లాండ్స్ బీవీకి ఉంది. ఈ కేంద్రంలో ప‌ని చేస్తున్న మ‌హిళా ఉద్యోగులు గ‌త ఏడేండ్ల‌లో 20 మంది నుంచి వెయ్యి మందికి చేరుకున్న‌ది. 

రెస్పాన్సిబుల్ కాంపిటీటివ్ నెస్ కు గాను కింగ్ ఖాలీద్ అవార్డ్స్ 2018, బెస్ట్ ఉమెన్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ లీడ‌ర్ సిప్ ప్రోగ్రామ్ అమ‌లు చేసినందుకు 2018 ఫ్యూచ‌ర్ ఆఫ్ వ‌ర్క్ ప్లేస్ అవార్డ్స్‌తో స‌హా ప‌లు అవార్డుల‌ను టీసీఎస్ సౌదీ అరేబియా అందుకున్న‌ది. ఈ వాటాల బ‌దిలీ కోసం సౌదీ అరేబియాలో యాంటీ ట్ర‌స్ట్ సంస్థ ఆమోదం కోసం టీసీఎస్ ద‌ర‌ఖాస్తు చేసింది. మూడు నుంచి ఆరు నెల‌ల్లో దీనికి ఆమోదం ల‌భించ‌వ‌చ్చున‌ని భావిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo